Share News

COVID-19: రోగనిరోధక శక్తే కవచమైంది

ABN , Publish Date - Jun 21 , 2025 | 04:02 AM

కనుమరుగైనట్టే అనుకుంటున్న తరుణంలో కరోనా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు ఒక్కసారిగా పెరగడంతోపాటు కొత్త వేరియంట్‌ కూడా బయటపడడంతో రాష్ట్రంలోనూ భయాందోళన మొదలైంది.

COVID-19: రోగనిరోధక శక్తే కవచమైంది

  • రాష్ట్రంలో నెమ్మదించిన కొవిడ్‌ వ్యాప్తి

(గుంటూరు మెడికల్‌ - ఆంధ్రజ్యోతి): కనుమరుగైనట్టే అనుకుంటున్న తరుణంలో కరోనా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు ఒక్కసారిగా పెరగడంతోపాటు కొత్త వేరియంట్‌ కూడా బయటపడడంతో రాష్ట్రంలోనూ భయాందోళన మొదలైంది. కానీప్రస్తుతం ఆ పరిస్థితేమీ కనిపించడంలేదు. రోగనిరోధక శక్తి కవచంలా అడ్డుపడడంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నమ్మెదించాయి. ప్రతిరోజూ వందల సంఖ్యలో కొవిడ్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నా పట్టుమని పది పాజిటివ్‌ కేసులు కూడా నమోదు కావడం లేదు. నెల రోజులుగా రాష్ట్రంలోని 17 వైద్య బోధన ఆస్పత్రుల్లో కొవిడ్‌ లక్షణాలతో వచ్చిన 3,321 మంది రోగులకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా, 368 మందికి మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో ఇప్పటికే 90 శాతం మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ సీజన్‌లో కొవిడ్‌ మరణాలు నమోదు కాలేదు. ప్రస్తుత వేవ్‌లో కొవిడ్‌ తీవ్రత, వ్యాప్తి బాగా తగ్గి పోయాయి. దీనికి ప్రధాన కారణంప్రజల్లో నెలకొన్న వ్యాధి నిరోధక శక్తి ప్రభావమే అని వైద్యనిపుణులు చెబుతున్నారు.


గతంలో కొవిడ్‌ నివారణకు తీసుకున్న వ్యాక్సిన్లు, ప్రజల్లో పెరిగిన హెర్డ్‌ ఇమ్యునిటీ (సమాజంలో సగటు వ్యాధి నిరోధక శక్తి) వంటి కారణాలతో కొవిడ్‌ నెమ్మదించినట్లు వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం దేశంలోకి ప్రవేశించిన కొవిడ్‌-19 వైరస్‌ ఇప్పటివరకు పలు వేరియంట్లుగా రూపు మార్చుకుంది. తాజాగా ఎన్‌బీ 1.8.1 వేరియంట్‌ (నింబస్‌ కొవిడ్‌) బయటపడింది. ఇది నాలుగింతలు శక్తిమంతంగా ఉండడంతో వ్యాప్తి అధికంగా ఉం టుందనుకున్నారు. కానీ ఈ వైర్‌సను తట్టుకొనే వ్యాధి నిరోధక శక్తి ప్రజల్లో రూపొందటమే దీనికి కారణమని వైద్యులు భావిస్తున్నారు.


వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కారణం

కొవిడ్‌-19ను ఎదుర్కొనే హెర్డ్‌ ఇమ్యునిటీ సమాజంలో బాగా పెరగడమే ఈ సీజన్‌లో కరోనా కేసులు తగ్గడానికి కారణం. ప్రస్తుతం కొవిడ్‌ వైరస్‌ కంటే ఇన్‌ఫ్లూయోంజా వైరస్‌ బాగా విస్తరిస్తోంది. కొవిడ్‌ కూడా మరో ఫ్లూ వైర్‌సలా మారినట్లు భావించవచ్చు. కాబట్టి ప్రజలు కొవిడ్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

- అంటువ్యాధుల వైద్యనిపుణులు కల్యాణ్‌ చక్రవర్తి

Updated Date - Jun 21 , 2025 | 06:38 AM