CM Chandrababu: రాజకీయ రౌడీలతో ప్రమాదం.. ఆలోచించండి
ABN , Publish Date - Jul 02 , 2025 | 03:32 AM
నేను ఇవాళ నేరస్థుడితో రాజకీయం చేయాల్సి వస్తోంది. పిల్లలకు పెళ్లిళ్లు చేసేటప్పుడు ఎన్ని ఆలోచిస్తాం.. ఏడు తరాలు ఆరా తీస్తాం. మరి ఒక నేతను ఎన్నుకునేటప్పుడు గుడ్డిగా ఓటేస్తారా? ప్రజలు ఆలోచించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

వివేకా హత్యలో నన్నే మోసం చేశారు
ఆరోజే అరెస్టు చేసుంటే రాష్ట్రానికి మేలు జరిగేది
ఆ ఐదేళ్లూ నన్ను బయటికి రానివ్వలేదు
దుష్ప్రచారాన్ని నమ్మితే భవిష్యత్తు చీకటే
నాటి విధ్వంసం నుంచి.. నేడు వికాసానికి
1న నిద్రలేచిన వెంటనే గ్రామాలన్నీ కళకళ
ఇందుకు పింఛన్ల పంపిణీయే ప్రధాన కారణం
ఆగస్టు 15 నాటికి లక్ష బంగారు కుటుంబాలు
2029కల్లా పేదరిక నిర్మూలనే పీ-4 లక్ష్యం: సీఎం
గత ప్రభుత్వంలో అధికార యంత్రాంగానికి జీతాలు ఎపుడొస్తాయో అర్థమయ్యేది కాదు. పింఛను ఎప్పుడిస్తారో రిటైర్డ్ ఉద్యోగులకు తెలిసేదికాదు. వారంతా వాటిపైనే ఆధారపడినవారు. కానీ నేనూ, నా మిత్రుడు పవన్‌కల్యాణ్ ఒకటో తేదీనే అన్నీ ఇస్తున్నాం.
అభివృద్ధి లేకపోతే ఆదాయం రాదు. ఆదాయం లేకపోతే అప్పులు చేయాలి. అప్పులు చేస్తే రాష్ట్రం దివాళా తీస్తుంది. అందుకే అభివృద్ధి చేస్తూ సంపద సృష్టించి ఆదాయం పెంచి ఈ రాష్ర్టాన్ని బాగు చేస్తామని ఆనాడే చెప్పాను.
ఆగస్టు 15వ తేదీ నాటికి లక్ష బంగారు కుటుంబాలు చేయాలనేదే లక్ష్యం. 2029 నాటికి పేదరికం పూర్తిగా నిర్మూలించడమే పీ-4 లక్ష్యం. ఇది అందరి బాధ్యత.
- సీఎం చంద్రబాబు
రాజమహేంద్రవరం, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ‘నేను ఇవాళ నేరస్థుడితో రాజకీయం చేయాల్సి వస్తోంది. పిల్లలకు పెళ్లిళ్లు చేసేటప్పుడు ఎన్ని ఆలోచిస్తాం.. ఏడు తరాలు ఆరా తీస్తాం. మరి ఒక నేతను ఎన్నుకునేటప్పుడు గుడ్డిగా ఓటేస్తారా? ప్రజలు ఆలోచించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కులం, మతం, తప్పుడు సమాచారాన్ని నమ్ముకుంటే భవిష్యత్ మృగ్యమవుతుందని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం పరిధిలోని మలకపల్లి గ్రామంలో మంగళవారం మార్గదర్శులు-బంగారు కుటుంబాల పేరిట జరిగిన ప్రజావేదికపై ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఒకప్పుడు రాజకీయాల్లో రౌడీలు ఉండేవారు కాదన్నారు. ఇవాళ రాజకీయాల్లోకి రౌడీలు వస్తున్నారని.. నేతలు కూడా అవుతున్నారని..ఇది చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తంచేశారు. తాను ప్రతీ అడుగూ ఆచితూచి వేస్తానని.. అలాంటి తననే 2019 ఎన్నికల ముందు వివేకా హత్య విషయంలో మోసం చేశారని చెప్పారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని జగన్ టీవీలో ప్రచారం చేస్తే తానూ నమ్మానన్నారు. ‘మర్నాడు సాక్షి పేపరులో నా చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్తచరిత్ర అని రాయించారు. ముఖ్యమంత్రినైనా నాడు నిస్సహాయుడినయ్యాను. ఆరోజే నిందితులను అరెస్టు చేసి ఉంటే రాష్ర్టానికి మేలు జరిగేది..’ అని వ్యాఖ్యానించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..
పింఛన్లతో కళకళ
ప్రతినెలా మొదటి తారీఖును అందరూ గుర్తు పెట్టుకుంటున్నారు. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎన్‌డీఏ నేతలు, కార్యకర్తలూ ఆ రోజు ప్రజాసేవలో నిమగ్నమవుతున్నారు. ఒకటో తేదీన నిద్రలేచిన వెంటనే గ్రామాలన్నీ ఆనందంగా ఉంటున్నాయి. కళకళలాడుతున్నాయి. ఇందుకు పింఛన్లే ప్రధాన కారణం. భారతదేశ చరిత్రలో ఎక్కడా రూ.4 వేలు పింఛను ఇవ్వడంలేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నేతలు దగ్గరుండి ఇవ్వండి. నేను స్వయంగా గ్రామాలకు వచ్చి ఇస్తున్నాను. ఉద్యోగులు ఒక్కొక్కరు 53మందికి పింఛన్లు పోటీ పడి ఇస్తున్నారు. ఎవరైనా ఇవ్వకపోయినా, తామేదో ఉచితంగా ఇస్తున్నట్టు ఫీలైనా, లబ్ధిదారులతో సరిగా మాట్లాడకపోయినా.. చులకనగా చూసినా వదలిపెట్టను. సేవాభావంతో పనిచేయాలి. ఈ నెల నుంచి వ్యక్తిగతంగా మెసేజ్‌లు కూడా వస్తాయి. ఎవరు తీసుకోకపోయినా తెలిసిపోతుంది. ఎందుకు తీసుకోలేదో చెప్పాలని మెసేజ్ పంపిస్తాం. రాజకీయ ముసుగు వేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేవారి పట్ల కఠినంగా ఉంటాను.
ఇంత విధ్వంసం చూడలేదు..
సీఎం పదవి నాకు కొత్తకాదు. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేశాను. 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. వైసీపీ చేసిన విధ్వంసం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయి. ఎవరూ పనిచేసే పరిస్థితి లేదు. దీనిని సరిదిద్దడానికి సంవత్సరం పట్టింది. సంక్షేమం చేస్తున్నాం.. అభివృద్ధీ చేస్తున్నాం. సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం.
నెలలో మెగా డీఎస్సీ ఉద్యోగాలు
వైసీపీ నేతలు మెగా డీఎస్సీకి అనేక అడ్డంకులు సృష్టించారు. సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. 16,500 మందికి టీచర్ ఉద్యోగాలు ఇస్తాం. యువత చాలా ఆశలు పెట్టుకున్నారు. నమ్మకం పెట్టుకున్నారు. వారికి ఉద్యోగాలు వచ్చేలోపు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఆ ఐదేళ్లలో ఎక్కడచూసినా గంజాయి, డ్రగ్సే. పోరాడితే కేసులు పెట్టారు. మా పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు. గంజాయి, డ్రగ్స్ అమ్మితే తాట తీస్తాను. ఆడబిడ్డ మీద చెయ్యివేస్తే అదే వాళ్లకు చివరి రోజు. రౌడీయిజాన్ని సహించం. అభివృద్ధి పనులన్నీ సుస్థిరంగా కొనసాగిస్తాం. పోలవరం, అమరావతి, స్టీల్‌ప్లాంట్ విషయాల్లో కేంద్రం సహకరిస్తోంది. యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. ఏడాదిలోనే 9.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటివల్ల 8.50 లక్షల మందికి ఉద్యోగాలొస్తాయి. రాష్ట్రంలో ఇప్పుడు రూ.5 లక్షల కోట్ల విలువైన పనులు ప్రారంభయ్యాయి. 4 లక్షల 50వేల మందికి ఉద్యోగాలు వస్తాయి.
క్రూరంగా ఆలోచిస్తున్నారు..
గత ఐదేళ్లూ నన్ను బయటకు రానివ్వలేదు. నా ఇంటికి తాళ్లు కట్టారు. విశాఖ వెళితే తిరిగి పంపారు. అయితే ఆ పని నేను చేయలేను. ఇవాళ తెనాలిలో రౌడీషీటర్‌ను పలకరించడానికి వెళ్లి మార్కెట్‌ను ధ్వంసం చేశారు. ఓ వ్యక్తి చనిపోతే.. ఏడాది తర్వాత జగన్ ఇప్పుడు పరామర్శకు వెళ్లాడు. తక్కువ మందితో వెళ్లండని పోలీసులు చెబితే వినలేదు. ఇరుకు సందుల్లో మీటింగ్ వద్దంటే వినడం లేదు. ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. క్రూరంగా ఆలోచిస్తున్నారు. మనం కారులో వెళ్లేటప్పుడు దాని కింద ఎవరైనా పడితే ఏం చేస్తాం? ఆగి, ఆస్పత్రికి తీసుకెళ్తాం. బతికించడానికి కనీస ప్రయత్నం చేస్తాం. కానీ జగన్ కారు కింద సింగయ్య అనే వ్యక్తి నలిగిపోతే ఈడ్చిపడేశారు. మనుషుల ప్రాణాలకు కూడా విలువ లేదు. జగన్ కారుకిందే సింగయ్య చనిపోయినట్టు ఆధారాలు ఉన్నాయి. ఇలాంటి వారితో నేనెలా రాజకీయాలు చేస్తున్నాను..? బాధనిపిస్తోంది.
మూడోసారీ పుష్కరాలు నేనే నిర్వహిస్తాను
గోదావరి పుష్కరాలను 2027లో మూడోసారి నేనే చరిత్రలో కనీవినీ ఎరుగుని రీతిలో నిర్వహిస్తా. ఇవాళ మంత్రుల కమిటీ కూడా వేశాం. కొవ్వూరు, రాజమండ్రి వైపు ఘాట్ల మరమ్మతులతో పాటు అదనపు సుందరీకరణ కూడా చేస్తున్నాం. కేంద్రం నుంచి ఇప్పటికే రూ.98 కోట్లు వస్తే, అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం. త్వరలో ఏమి చేయాలో మీటింగ్ పెట్టి నిర్ణయిస్తాం. ఇది చాలా మంచి ప్రాంతం. పోలవరం నుంచి పాపికొండలు, కడియం నర్సరీలు, గోదావరి అందాలు, ప్రపంచంలోనే టూరిజం హబ్ చేస్తాం.
సమాజానికి కొంత తిరిగివ్వాలి..
సమాజం మనకెంతో ఇచ్చింది.. అందులో కొంత తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ‘నా దౌర్భాగ్యం.. దేవుడు నాకింతే ఇచ్చాడు. ఇది ఖర్మ. కష్టపడక తప్పదు. నా జీవితం ఇంతే అనే ఆలోచనలు మానేయండి. పేదరిక ఆలోచనలు వద్దు. బాగా ఆలోచించండి. కష్టపడే మనసత్వం పెంచుకోండి. మీ జీవితం బంగారం అవుతుంది’ అని ప్రజలకు సూచించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్‌లో భాగంగా సమాజంలో 10 శాతం ఉన్న ఉన్నత ఆదర్శవంతులైన కుటుంబాలు.. సమాజంలో దిగువన ఉన్న 20 శాతం కుటుంబాలను దత్తత తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని గుర్తుచేశారు. ‘ఇదే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్‌నర్‌షిప్ (పీ-4) విధానం. ప్రభుత్వ రాయితీలతో ఇండస్ర్టీలు నడిపి సంపాదించిన వారంతా ప్రజలకు సేవచేయాలి. ఒకప్పుడు జన్మభూమి పిలుస్తోంది రా.. అంటే ప్రపంచంలోని తెలుగువాళ్లు ముందుకు వచ్చి చాలా పనులు చేశారు. ఇప్పుడు పీ-4లో భాగంగా ఆగస్టు 15 నాటికి లక్ష బంగారు కుటుంబాలను కనీసం పది వేల మంది మార్గదర్శులు దత్తత తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. అప్పుడో పెద్ద కార్యక్రమం చేసి.. టాటా, బిర్లా, అదానీ, జిందాల్ వంటి వాళ్లను పిలుస్తాం’ అని తెలిపారు. ఈ సందర్భంగా మార్గదర్శి-బంగారు కుటుంబం కార్యక్రమంలో ఓ లబ్ధిదారు, ఓ మార్గదర్శితో ఆయన మాట్లాడించారు.
మమ్మల్ని ఆదుకుంటే..
మా అమ్మా, నాన్నా కూలి పనిచేస్తారు. మేం ముగ్గురం ఆడపిల్లలం, ఒకరు దివ్యాంగురాలు. నేను బీఎస్సీ చదివాను. ఉన్నత విద్య చదవాలని ఉన్నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యలో మానేసి ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తున్నాను. లోన్ తీసుకుని నా చెల్లెలిని చదివిస్తున్నాం. చంద్రబాబు మాకు పింఛను మంజూరు చేశారు. 2019లో ఇల్లు కూడా ఇచ్చారు. గత ఐదేళ్లలో ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. మా కుటుంబాన్ని ఆదుకుంటే నేను బాగా స్థిరపడి మరిన్ని కుటుంబాలను ఆదుకుంటాను.
- ములపర్తి నవ్యశ్రీ, బంగారు కుటుంబం లబ్ధిదారు
ఈ కుటుంబం బాధ్యత తీసుకుంటా..
నేను కూడా చిన్న కుటుంబం నుంచే వచ్చాను. ప్రభుత్వ పాఠశాలలో చదివాను. బిట్స్ పిలానీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేశాను. తాళ్లపూడి మండలంలో ఠాగూర్ ల్యాబొరేటరీస్ స్థాపించి 1,500 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. నవ్యశ్రీ కుటుంబం బాధ్యత నేను తీసుకుంటాను. ఆమెతో ఎమ్మెస్సీ చేయిస్తాను. లేదంటే మా కంపెనీలో ఉద్యోగం ఇస్తాను. వారి తల్లిదండ్రులకు కూడా ఉపాధి కల్పిస్తాం.
- కాశీ విశ్వనాథరాజు, మార్గదర్శి