Christian Leaders: పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్యే
ABN , Publish Date - Apr 20 , 2025 | 04:07 AM
పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం రోడ్డు ప్రమాదం కాకుండా అన్యాయంగా చనిపోవడం అని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. వారి పిలుపు మేరకు రాజమహేంద్రవరం రూరల్ మండలంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు

ఏపీ, తెలంగాణ క్రైస్తవ సంఘాల ప్రతినిధుల ఆరోపణ
ఆయన మృతిచెందిన ప్రదేశానికి 2 వేల మందితో ర్యాలీ
ప్రవీణ్ ఫ్లెక్సీ వద్ద ప్రార్థనలు... కొవ్వొత్తులు వెలిగించి నివాళి
హర్షకుమార్, మరికొందరిని స్టేషన్‌కు తరలించిన పోలీసులు
రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, అది హత్యేనని పలువురు క్రైస్తవు సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు-దివాన్ చెరువు రోడ్డులో పెద్దఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం సాయంత్రం వేలాది మంది క్రైస్తవులు ప్రవీణ్ మరణించిన స్థలానికి ర్యాలీగా చేరుకున్నారు. హర్షకుమార్, జీవీ శ్రీరాజ్, ఏపీ, తెలంగాణకు చెందిన పలు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. హర్షకుమార్‌తో పాటు ఇసుకపట్ల రాంబాబు, నక్కా వెంకటరత్నం, జంగా బాబురావు, పాలకొల్లుకు చెందిన రమే్‌షను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అయితే పెద్దఎత్తున క్రైస్తవులు అక్కడకు చేరుకోవడంతో వారిని అడ్డుకోవడం సాధ్యపడలేదు. వారంతా నేరుగా ప్రవీణ్ మరణించిన స్థలంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేసి, నివాళులర్పించారు. ప్రవీణ్‌ది హత్యేనని, రోడ్డు ప్రమాదం కాదని, క్రైస్తవులకు పాలకులు అన్యాయం చేస్తున్నారని నినదిస్తూ నిరసన తెలిపారు. ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు వందమందికి పైగా పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. కొంతమందిని రాజానగరం పోలీ్‌సస్టేషన్‌కు, హర్షకుమార్‌ను అనపర్తి స్టేషన్‌కు తరలించారు.