కుప్పం మున్సిపల్ చైర్మన్ కుర్చీ ఎవరిదో?
ABN , Publish Date - Apr 28 , 2025 | 01:13 AM
నేడే ఎన్నిక తమదేనని టీడీపీలో ధీమా అంత ఈజీగా కాదంటున్న వైసీపీ

కుప్పం మున్సిపల్ చైర్మన్ కుర్చీ గెలుచుకోవడానికి అధికార, ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. చైర్మన్ కుర్చీ తమదేనన్న ధీమా టీడీపీలో కనిపిస్తోంది. అంత ఈజీగా వదులుకోకూడదన్న పట్టుదల వైసీపీలోనూ కనిపిస్తోంది. మరోవైపు చైర్మన్ ఎన్నిక సోమవారం నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం ఆదివారం పూర్తి చేసింది. కుప్పంలో అంతా ప్రశాంతంగా ఉన్నట్టే కనిపిస్తోంది కానీ, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
- కుప్పం, ఆంధ్రజ్యోతి
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య జరగనుంది. 22వ తేదీన ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో అధికార, ప్రతిపక్షాలు రెండూ ఆ పదవిని కైవసం చేసుకోవడానికి రంగంలో దిగాయి. వైసీపీకి టాటాచెప్పి టీడీపీలో చేరిన డాక్టర్ సుధీర్ తన మున్సిపల్ చైర్మన్ పదవితోపాటు 16వ వార్డునుంచి గెలుచుకున్న కౌన్సిలర్ పదవికి కూడా గతేడాది నవంబరు 6వ తేదీన రాజీనామా చేశారు. అప్పటినుంచి మున్సిపల్ చైర్మన్ పదవి ఖాళీగానే ఉంది. మున్సిపాలిటీలో 25 వార్డులుండగా, 16వ వార్డు ఖాళీ కావడంతో 24 మంది కౌన్సిలర్లే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్టీ తరఫున గెలిచినవారు ఆరుగురు, తర్వాత పార్టీలో చేరిన నలుగురితో కలిపి అధికార టీడీపీకి 10 మంది కౌన్సిలర్లు, వైసీపీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఈ 24 మంది కౌన్సిలర్లకు కాక టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భరత్‌లకు, స్థానిక ఎమ్మెల్యే కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు ఉంది. ఈ ప్రకారం తీసుకుంటే సభ్యుల సంఖ్య మొత్తం 27 అవుతుంది. ప్రత్యేక మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి, ఎన్నిక జరపడానికి కోరం కావాలంటే 14 మంది సభ్యులు హాజరు కావాల్సి ఉంటుంది.
శిబిర రాజకీయాలు
ప్రలోభాలకు గురికాకుండా ఉండడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ దాదాపు నాలుగైదు రోజులనుంచి తమ పార్టీలకు చెందిన కౌన్సిలర్లను ఇతర రాష్ట్రాల్లోని ప్రత్యేక శిబిరాలకు తరలించాయి. ఆయా శిబిరాల్లో కౌన్సిలర్లు మహారాజ భోగం అనుభవిస్తున్నారు. అయితే టీడీపీ అధికారంలో ఉండడంతో కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు సహజంగానే అటువైపు మొగ్గారు. ప్రస్తుతం టీడీపీ శిబిరంలో ఆ పార్టీకి చెందిన 10 మంది కౌన్సిలర్లతోపాటు వైసీపీ కౌన్సిలర్లు ముగ్గురు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కోరం ఉండాలంటే అధికార పార్టీకి ఇంకో కౌన్సిలర్ అవసరమవుతారు. ఆదివారం రాత్రికి మరో ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లనైనా శిబిరంలో చేర్చడానికి, లేదా నేరుగా కౌన్సిల్ సమావేశానికి వచ్చి తమ అభ్యర్థికి ఓటు వేయడానికి టీడీపీ నాయకులు చేస్తున్న ముమ్మర ప్రయత్నాలు దాదాపు ఫలించే అవకాశం ఉందంటున్నారు. వైసీపీ కూడా చైర్మన్ కుర్చీని అంత తేలిగ్గా వదిలేయదలచుకోలేదు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఆ పార్టీ కూడా కౌన్సిలర్లతో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తోంది. మరోవైపు తమకు ప్రొటెక్షన్ కావాలంటూ ఎమ్మెల్సీ భరత్‌తోపాటు కొందరు ప్రతిపక్ష పార్టీకి చెందిన కౌన్సిలర్లు హైకోర్టుకు వెళ్లి ఆ ప్రకారం ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఓవైపు శిబిరంలో ఉన్నవారేకాక, మరికొందరు వైసీపీ కౌన్సిలర్లు కుప్పంలోనే తిరుగుతున్నారు.
చంద్రబాబు నిర్ణయమే ఫైనల్
టీడీపీలో మున్సిపల్ చైర్మన్ కుర్చీకోసం ముగ్గురి మధ్య పోటీ నెలకొంది. మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న వాల్మీకి బోయ సామాజిక వర్గానికి చెందిన 19వ వార్డు కౌన్సిలర్ జిమ్ దాము, బలిజ సామాజిక వర్గానికి చెందిన 20వ వార్డు కౌన్సిలర్ ఎస్.సోమశేఖర్ మధ్య ఈ పోటీ మరీ తీవ్రంగా ఉంది. 5వ వార్డు కౌన్సిలర్ వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సెల్వరాజ్ కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు. చివరికి ఈ విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని అందరూ అంగీకరిస్తున్నారు. ఆయన కరుణ ఎవరిపై ఉందో ప్రస్తుతానికైతే ఎవరికీ తెలియదు. మరోవైపు వైసీపీలో చూడడానికి తీవ్రంగా పోటీ పడుతున్నట్టు అనిపిస్తున్నా, ఆ పార్టీలో చైర్మన్ కుర్చీ సొంతం చేసుకుంటామన్న నమ్మకం పెద్దగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఆ పార్టీనుంచి మొదటినుంచి ఈ పోటీలో ఉన్నట్టు వినిపిస్తున్న ప్రస్తుత మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్ ఆ పదవికి రాజీనామా చేయకపోవడమే దీనికి ఉదాహరణ. మున్సిపల్ చైర్మన్‌గా పోటీ చేయాలంటే వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి తీరాలి. మరొకరి పేరు చెబుతున్నారు కానీ, అంత బలంగా వినిపించడంలేదు.
ఎన్నికకు సర్వం సిద్ధం
చైర్మన్ ఎన్నిక కోసం కుప్పం ఎంపీడీవో కార్యాలయ సమావేశపు హాలును ఆదివారం అధికారులు సిద్ధం చేశారు. మున్సిపల్ కమిషనర్ వి.వెంకటేశ్వరరావు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా కుప్పం ఆర్డీవో వెంకటేశ్వర రాజు, పరిశీలకులుగా జేసీ విద్యాధరి వ్యవహరిస్తారు. ఇక డీఎస్పీ పార్థసారథి, కుప్పం అర్బన్ సీఐ శంకరయ్యలు శాంతిభద్రతలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎన్నిక జరిగే సమావేశపు హాలుకు వంద మీటర్ల దూరం వరకు 163 సెక్షన్ అమల్లో ఉంటుందని డీఎస్పీ తెలిపారు. దీనివల్ల ఇక్కడ స్థానికులకు తప్ప, బయటి వారికి అనుమతి లేదని చెప్పారు. ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీలతోపాటు మొత్తం వంద మంది పోలీసు బలగాలను నియమించారన్నారు. శాంతిఽభద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
టీడీపీలో ముందస్తు విజయోత్సాహం
కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి టీడీపీలో ముందస్తు విజయోత్సాహం కనిపిస్తోంది. విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కుప్పం తరలిరావాలంటూ పార్టీ శ్రేణులకు ఆదివారం అంతర్గతంగా నాయకులు పిలుపునిచ్చారు. ఎన్నికకు రెండు గంటల ముందే అంటే సోమవారం ఉదయం తొమ్మిది గంటలకంతా పంచాయతీకి 50 మంది చొప్పున కుప్పంలోని పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు. దీంతో చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ విజయం తప్పదన్న ధీమా పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది. మరోవైపు వైసీపీ కూడా తమ పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ భరత్ పిలుపునిచ్చారు. కుప్పం పట్టణంలోని మండల సచివాలయం సమీపంలోని ఏడీఎస్ సూపర్‌బజార్ వద్దకు చేరుకోవాలని పార్టీ సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు పెట్టారు.