విషాదయాత్ర
ABN , Publish Date - Apr 29 , 2025 | 02:52 AM
బెంగళూరుకు చెందిన నలుగురు మహిళలు తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా హోసూరులోని జీఆర్‌బీ ఫుడ్ ప్రొడెక్ట్స్‌లో పనిచేస్తున్నారు.

పట్టణాల్లో ట్రాఫిక్ మార్గాలు దాటుకుని జాతీయ రహదారి ఎక్కగానే ఎక్సలేటర్‌పై ఒత్తిడి పెరిగిపోతోంది. ఎదురుగా వచ్చే వాహనాలు లేకపోవడంతో రయ్‌మంటూ దూసుకుపోతున్నారు. పైగా ఆరు వరుసల జాతీయ రహదారి కావడంతో వేగానికి కళ్లెం వేయడంలేదు. ఇలాంటి అతివేగం వల్ల ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
పాకాల సమీపంలో కంటైనర్ కిందకు దూసుకెళ్లిన కారు
ఐదుగురి దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు
- తిరుపతి/పాకాల, ఆంధ్రజ్యోతి
బెంగళూరుకు చెందిన నలుగురు మహిళలు తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా హోసూరులోని జీఆర్‌బీ ఫుడ్ ప్రొడెక్ట్స్‌లో పనిచేస్తున్నారు. వీరు శనివారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. దర్శనానంతరం శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకున్నారు. తిరుగుప్రయాణంలో పాకాల సమీపంలోని తోటపల్లి వద్ద జార్ఖండ్ రాష్ట్రం రాంచీనుంచి బెంగళూరుకు కొరియర్ లోడ్‌తో వెళ్తున్న కంటైనర్‌ను వెనుక వైపు బలంగా ఢీ కొన్నారు. దీంతో కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఏదో యాక్సిడెంట్ జరిగిందని గ్రహించిన లారీ డ్రైవర్ ఎన్‌హెచ్‌కు ఓవైపున లారీ నిలిపారు. అప్పటికే సుమారు 80 మీటర్లు కంటైనర్ ప్రయాణం చేసింది. ఇంతలో స్థానికులు, అటువైపు వెళ్లేవారు అప్రమత్తమై పోలీసులకు, 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు.అప్పటికే ఘోరం జరిగిపోయింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంటైనర్ కింద చిక్కుకున్న కారు నుజ్జునుజ్జుగా మారింది. అతికష్టం మీద బయటకు తీశారు. ఈఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయినవారి కొందరి ముఖాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. జాతీయ రహదారుల కోసం వినియోగించే క్రేన్ తీసుకొచ్చి అతికష్టం మీద కంటైనర్ నుంచి కారును వేరుచేశారు. గాయపడినవారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. భీతావహంగా మారిన ఘోర ప్రమాదాన్ని చూసిన స్థానికులు తీవ్ర ఆవేదన చెందారు. కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ప్రమాద స్థలానికి వెళ్లి పరిశీలించారు. కంటైనర్ డ్రైవరుతో మాట్లాడారు. ప్రమాదం ఎలా జరిగిందనేది తెలుసుకున్నారు. కలెక్టర్ స్విమ్స్‌కు వెళ్లి క్షతగాత్రులకు వైద్య సేవలను పరిశీలించారు.
కంటైనర్ కింద ఇరుక్కుపోయి..
చంద్రగిరి, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): రాంచీ నుంచి బెంగళూరుకు కంటైనర్ డ్రైవర్ వికాస్ మెహతా, మరో డ్రైవర్ అభిజిత్ శనివారం బయలుదేరారు. సోమవారం మధ్యాహ్నం చంద్రగిరి మండలం గాదంకి టోల్‌ప్లాజా వద్ద భోజనం చేసి, 1.30 గంటల సమయంలో కొంతదూరం వెళ్లగానే వెనక పెద్ద శబ్దం రావడంతో కంటైనర్‌కు ఏదైనా ప్రమాదం జరిగిందేమో అని సుమారు 80 మీటర్లకుపైగా ముందుకెళ్లి రోడ్డు పక్కకు వాహనం ఆపారు. కిందకు దిగి చూడగా కంటైనర్ వెనుక కింద భాగంలో కారు ఇరుక్కుపోయి ఉంది.
గంట సమయం పట్టింది.
ప్రమాద స్థలానికి వెళ్లి చూస్తే కంటైనర్ కింద కారు ఇరుక్కుపోయి నుజ్జు నుజ్జు అయిఉంది. అప్పటికే క్రేన్ ద్వారా కారును బయటకు తీశారు. ఇద్దరికి ఊపిరి ఉండటంతో అతికష్టంపై బయటకు తీసి, ఆసుపత్రికి పంపించాము. ఆ ఇద్దర్ని తీయడానికే గంట పట్టింది.
- చంద్రశేఖర్‌రెడ్డి, తోటపల్లి
మృతులు,
బెంగళూరుకు చెందిన విజయలక్ష్మి (50), సహాన (34), రజని (27), లేఖన్ గౌడ (10), తమిళనాడు రాష్ట్రం హోసూరుకు చెందిన కారు డ్రైవరు ఎస్.త్యాగరాజన్ (42). వీరిలో విజయలక్ష్మి, రజని, లేఖన గౌడ్ ఒకే కుటుంబానికి చెందిన వారు.
గాయపడినవారు
గీతమ్మ (51), క్రిస్‌విల్ (15). వీరిలో క్రిస్‌విల్ తండ్రి త్యాగరాజన్ మృతిచెందారు.
ఇంత ప్రమాదం ఎప్పుడూ చూడలేదు
ప్రమాదం జరగ్గానే పక్కనే మా ఊరి నుంచి వెంటనే వెళ్లా. కంటైనర్ కింద కారులో నుంచి ఇద్దరి అరుపులు వినిపించాయి. అందరితో కలిసి పోలీసులకు సాయం చేసి, మృతదేహాలను బయటకు తీశాం. ఇలాంటి ప్రమాదం ఎప్పుడూ చూడలేదు.
- కిరణ్, బయనపల్లి