గజదాడుల నియంత్రణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
ABN , Publish Date - Apr 29 , 2025 | 02:55 AM
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేయడం, రైతులపై దాడులు చేస్తుండడంపై డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ సోమవారం సమీక్షించారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఏనుగుల విధ్వంసంపై డిప్యూటీ సీఎం సమీక్ష
మంగళం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేయడం, రైతులపై దాడులు చేస్తుండడంపై డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ సోమవారం సమీక్షించారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గజదాడులను అదుపులోకి తెచ్చేందుకు మరింత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. చిన్నగొట్టిగల్లులో మూడురోజుల క్రితం ఏనుగు ఒక కౌలు రైతును తొక్కి చంపివేయడం, పాకాల మండలం గానుగపెంటలో పంటలను ధ్వంసం చేయడం ప్రస్తావించిన ఆయన ఏనుగుల వల్ల ప్రజలకు, ప్రజల వల్ల ఏనుగులకు ఎలాంటి హాని కలుగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.ఎలిఫెంట్ కారిడార్‌లో భాగంగా ఏనుగుల మందలు, ఒంటరి ఏనుగులు ఎటు వెళ్తున్నాయో ట్రాక్ చేయడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఎలిఫెంట్ ట్రాకర్స్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని స్పష్టంచేశారు.ఇందుకోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని పీసీసీఎ్‌ఫను ఆదేశించారు. ఈ మేరకు తిరుపతి డీఎ్‌ఫవో వివేక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ భాకరాపేట, పనబాకం, తిరుపతి రేంజి, చిత్తూరు ఈస్ట్, చిత్తూరు వెస్ట్‌రేంజ్‌లలో పనిచేస్తుందని సీసీఎఫ్ సెల్వం తెలిపారు. సౌర విద్యుత్ ద్వారా పనిచేసే జీఎస్‌ఎం సిమ్ ఏనుగుల కదలికలను గుర్తించి తిరుపతిలో ఏర్పాటు చేయబోయే కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం చేరవేస్తుందన్నారు. గ్రామస్థులు ఏనుగుల గుంపు కనపడితే టోల్‌ఫ్రీ నెంబరు 18004255909, తిరుపతి డీఎఫ్‌వో 94408 10069, తిరుపతి ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌వో 94408 10070కు సమాచారం ఇవ్వాలని కోరారు.