ఏసీబీకి చిక్కిన శ్రీకాళహస్తి సర్వేయర్
ABN , Publish Date - Apr 29 , 2025 | 02:59 AM
శ్రీకాళహస్తి మండల సర్వేయర్ పురుషోత్తంరెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కాడు. వ్యవసాయ భూమి కన్వర్షన్ కోసం రూ.25వేలను లంచంగా తీసుకుంటుండగా పట్టుబడ్డాడు.

రూ.25 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పురుషోత్తంరెడ్డి
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి మండల సర్వేయర్ పురుషోత్తంరెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కాడు. వ్యవసాయ భూమి కన్వర్షన్ కోసం రూ.25వేలను లంచంగా తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. ఏసీబీ ఏఎస్పీ విమలకుమారి తెలిపిన ప్రకారం.. తిరుపతికి చెందిన కె.చంద్రశేఖర్‌రెడ్డి ప్రభుత్వ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్‌శాఖలో ప్రొటోకాల్ అధికారిగా పదవీ విరమణ చేశారు. శ్రీకాళహస్తిలోని పానగల్ వద్ద ఆయన ప్రైవేటు కళాశాల నిర్వహిస్తున్నారు. పట్టణ శివార్లలోని విశాలాక్షి కాలనీ ఎదురుగా పానగల్ రెవెన్యూ పరిధిలో సర్వే నెం.172లో 75సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. దీనిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు (ల్యాండ్ కన్వర్షన్ కోసం) సుమారు రూ.1.70లక్షలు ప్రభుత్వానికి చలానా కట్టారు. రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. దీనికి మండల సర్వేయర్ పురుషోత్తంరెడ్డి లంచం డిమాండు చేయగా.. చంద్రశేఖర్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో సోమవారం తహసీల్దారు కార్యాలయంలో చంద్రశేఖర్‌రెడ్డి నుంచి సర్వేయర్ పురుషోత్తంరెడ్డి రూ.25 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 వరకు తహసీల్దారు కార్యాలయంలో విచారించారు. తహసీల్దారు లక్ష్మీనారాయణను ఏసీబీ అధికారులు కార్యాలయానికి పిలిపించారు. అలాగే ఆర్డీవో భానుప్రకా్‌షరెడ్డి కూడా తహసీల్దారు కార్యాలయానికి వచ్చారు. విచారణ అనంతరం సర్వేయర్ పురుషోత్తంరెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆయన్ను నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏఎస్పీ విమలకుమారి తెలిపారు. ఈ కేసుపై మరింత లోతుగా విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ ప్రశాంతి, సీఐ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
లంచం కోసం తిప్పలు పెట్టారు
నేను 2000లో కొన్న 75సెంట్ల వ్యవసాయభూమి కన్వర్షన్ కోసం ఫిబ్రవరిలో దరఖాస్తు చేశా. తహసీల్దారు లక్ష్మీనారాయణను, డీటీ ప్రేమ్‌కుమార్‌ను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినా పనికాలేదు. దీంతో రెండోసారి షిర్డీకి వెళ్లి సాయిబాబాకు మొక్కుకుని దరఖాస్తు చేసినట్లు అధికారులకు చెప్పా. అయితే సాయిబాబా నీ పని పూర్తి చేస్తాడంటూ తహసీల్దారు, డీటీ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. 72 ఏళ్ల వయసులో ఎన్నిసార్లు కార్యాలయానికి వచ్చినా కనీసం కూర్చోమని చెప్పిన పాపాన పోలేదు. సర్వేయర్ పురుషోత్తంరెడ్డి రూ.30వేలు లంచం ఇవ్వాలంటూ రెండు నెలలుగా తిప్పాడు. చివరకు బేరమాడితే రూ.25వేలకు వచ్చాడు. అవినీతిని ప్రోత్సహించడం ఇష్టంలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించా. - కె.చంద్రశేఖర్‌రెడ్డి, బాధితుడు