Share News

చెట్టు తొర్రలో సారా

ABN , Publish Date - Apr 28 , 2025 | 01:09 AM

చెంబుల్లో దాచిన అక్రమార్కులు పసిగట్టిన డ్రోన్‌

చెట్టు తొర్రలో సారా
ఎర్రావారిపాలెంలో చెట్టు తొర్రలో దాచి ఉంచిన సారాను బయటకు తీస్తున్న పోలీసులు

తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో డ్రోన్ల నిఘా పెరిగింది. తాజాగా చెట్టు తొర్రలో దాచి ఉంచిన సారా గుట్టును డ్రోన్‌ రట్టు చేసింది. ఎర్రావారిపాలెం, భాకరాపేట, తలకోన, వేములవాడ, గ్రామాల పరిధిలో ఇటీవల నాటుసారా తయారీ ఎక్కువగా ఉంది. నాటుసారాను తయారుచేసి వివిధ ప్రాంతాల్లో దాచి.. రాత్రికి రాత్రే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలీసులు ఎన్నిసార్లు తనిఖీలు చేపట్టినా ఇలా దాచి ఉంచిన సారాను పట్టుకోలేని పరిస్థితి. చెట్లు చాటున సారా తయారు చేసి.. చెట్టు తొర్రల్లో దాచిన ముఠాను గుర్తించడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. భాకరాపేట సీఐ ఇమ్రాన్‌భాషా ఆధ్వర్యంలో ఎస్‌ఐలు, పోలీసులు డ్రోన్‌ నిఘా పెట్టారు. ఎర్రావారిపాల్లెం మండలం వేములవాడ గ్రామం, తలకోన వాటర్‌ కెనాల్‌, భాకరాపేట,తో పాటు దాదాపు 25 ప్రాంతాల్లో డ్రోన్లు ఎగురవేసి అనుమానం వున్న ప్రతి ప్రాంతాన్ని నిశితంగా తనిఖీ చేశారు. దీనికోసం ప్రత్యేక బృందం సీఐ వినోద్‌కుమార్‌ డ్రోన్‌ అందించిన ఫొటోల ఆధారంగా సారా తయారు చేసి దాచి వుంచిన స్థలాలను కనుగొన్నారు. అక్కడకు చేరుకుని చెట్ల తొర్రల్లో దాచి వుంచిన 14 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రోన్‌ సాయంతో వేములవాడ గ్రామానికి చెందిన హనుమంతు, వేణు, మునస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇక, సత్యవేడు, విజయపురం

డ్రోన్ల సహాయంతో నాటుసారా స్థావరాలపై నిఘా ఉంచిన పోలీసు అధికారులు రెండో విడతలో సత్యవేడు, విజయపురం మండలాల్లో నిఘా ఉంచనున్నారు. రెండు డ్రోన్లు ఉపయోగించి జిల్లా వ్యాప్తంగా నాటుసారా, గంజాయి, మత్తు పదార్థాలు గుర్తించేలా ఎస్పీ హర్షవర్ధనరాజు ప్రత్యేక పోలీసు బృందాలకు దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా తిరుపతి, చంద్రగిరి ప్రాంతాలపై ఎక్కువగా ఫోకస్‌ చేయనున్నారు.

Updated Date - Apr 28 , 2025 | 01:09 AM