ఏసీబీ కేసులో సీఐ వెంకటప్పపై చర్యలు నిలిపివేత
ABN , Publish Date - Aug 01 , 2025 | 02:11 AM
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తిరుపతి డీసీఆర్‌బీ సీఐ కుటాల వెంకటప్పపై ప్రభుత్వం తదుపరి చర్యలు నిలిపివేసింది. వివరాలిలా వున్నాయి. ఐదేళ్ల కిందట తిరుపతి కమాండ్ కంట్రోల్ సెంటర్ సీఐగా పనిచేస్తున్న ఆయనపై అవినీతికి పాల్పడడం ద్వారా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగివున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్ళాయి.

తిరుపతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తిరుపతి డీసీఆర్‌బీ సీఐ కుటాల వెంకటప్పపై ప్రభుత్వం తదుపరి చర్యలు నిలిపివేసింది. వివరాలిలా వున్నాయి. ఐదేళ్ల కిందట తిరుపతి కమాండ్ కంట్రోల్ సెంటర్ సీఐగా పనిచేస్తున్న ఆయనపై అవినీతికి పాల్పడడం ద్వారా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగివున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్ళాయి. దీంతో 2020 మార్చి 11న వెంకటప్పపై కేసు నమోదు చేసిన తిరుపతి ఏసీబీ అధికారులు అదే రోజున నెల్లూరు స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండు విధించడంతో ఆ రోజే సీఐ వెంకటప్పను అనంతపురం డీఐజీ సస్పెండ్ చేశారు. మరోవైపు వెంకటప్పకు చెందిన రూ.1.88 కోట్ల విలువైన స్థిరచరాస్తులను ఏసీబీ అధికారులు కోర్టుకు అటాచ్ చేశారు. రెండేళ్ల తర్వాత 2022 జూన్ 23న ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసింది. ఈ ఏడాది జూన్ 16న ఏసీబీ డైరెక్టర్ జనరల్ సమర్పించిన తుది నివేదికలో వెంకటప్పకు ఆదాయానికి మించి రూ.58.52 లక్షల విలువైన ఆస్తులు మాత్రమే కలిగివున్నట్టు నిర్ధారించారు. ఆదాయానికి మించి 15.45 శాతం మాత్రమే ఆస్తులు అధికంగా వున్నందున నిబంధనల రీత్యా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం లేదని, అందువల్ల తదుపరి చర్యలు నిలిపివేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీంతో సీఐ కుటాల వెంకటప్పపై తదుపరి చర్యలను నిలిపివేయడంతో పాటు ఆయన సస్పెన్షన్ కాలాన్ని డ్యూటీలో ఉన్నట్టుగా పరిగణిస్తున్నట్టు రాష్ట్ర హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా సీఐ వెంకటప్ప ప్రస్తుతం తిరుపతి డీసీఆర్‌బీలో పనిచేస్తున్నారు.