Share News

జోరుగా ‘తొలిఅడుగు’

ABN , Publish Date - Aug 01 , 2025 | 02:15 AM

తెలుగుదేశం చేపట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు..’ కార్యక్రమాన్ని జిల్లాలో టీడీపీ నాయకులు జోరుగా నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది పూర్తయిన సందర్భంగా ఇప్పటివరకు చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్న చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 జోరుగా ‘తొలిఅడుగు’

క్షేత్రస్థాయిలో విస్తృతంగా టీడీపీ నేతల పర్యటన

ఏడాదిలో చేసిన మంచిని వివరిస్తున్న శ్రేణులు

కుప్పం నియోజకవర్గంలో వంద శాతం పూర్తి

చిత్తూరు, జూలై 31 (ఆంధ్రజ్యోతి):తెలుగుదేశం చేపట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు..’ కార్యక్రమాన్ని జిల్లాలో టీడీపీ నాయకులు జోరుగా నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది పూర్తయిన సందర్భంగా ఇప్పటివరకు చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్న చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా 89 శాతం ప్రచారం పూర్తవగా, మిగిలిన నియోజకవర్గాల్లోనూ జోరుగా సాగుతోంది. నగరి, జీడీనెల్లూరు వెనుకబడ్డాయి. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు జూలై 2వ తేదీన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.శాంతిపురం మండల పర్యటనలో చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి..ఇంటింటికి వెళ్లి తాము చేపడుతున్న సంక్షేమ పథకాలతో జరుగుతున్న మంచిని వివరించారు.వారి మంచిచెడ్డలను విచారించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లాలో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు తాము చేసిన మంచిని చెప్పడంతో పాటు సంక్షేమం, అభివృద్ధి అంశాల్లో ప్రభుత్వం ఎలా కట్టుబడి ఉందో ప్రజలకు వివరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారో తెలుసుకుంటున్నారు. నియోజకవర్గాల్లో క్లస్టర్‌ నుంచి ఎమ్మెల్యే, ఇన్‌ఛార్జి వరకు బాధ్యత తీసుకుని ఇంటింటికి తిరుగుతున్నారు. ఏడాదిలో జరిగిన మంచిని వివరిస్తూనే ఐదేళ్లలో వైసీపీ చేసిన విధ్వంసాన్ని గుర్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, నాయకులతో పాటు కార్యకర్తలు పెద్దఎత్తున వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంతో పార్టీ శ్రేణుల్లో ఒకింత ఉత్సాహం పెరిగింది. నాయకులు ఇంటింటికీ తిరగడంతో పాటు ఆ వివరాలను నిర్దేశిత యాప్‌లో అప్లోడ్‌ చేయాల్సివుంది. తిరిగి కూడా అప్లోడ్‌ చేయకుంటే వెనుకబడినట్లే. ఉదాహరణకు అమరనాథ రెడ్డి ఇటీవల విదేశాలకు వెళ్లివచ్చినా ద్వితీయ శ్రేణి నాయకులు ఇంటింటికి తిరిగి వివరాలను అప్లోడ్‌ చేయడంతో పలమనేరు 3వ స్థానంలో నిలిచింది. మంత్రులు రామ్‌ప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌ ఇటీవల జీడీనెల్లూరులో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం మరో మంత్రి బీసీ జనార్దన రెడ్డి పలమనేరు నియోజకవర్గంలో పాల్గొనేందుకు వస్తున్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌ రోజూ తిరుగుతూ నియోజకవర్గాన్ని కుప్పం తర్వాతి స్థానంలో నిలిపారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ఇటీవల విదేశాలకు వెళ్లి మంగళవారం వచ్చినా, అక్కడి నాయకులు ఈ కార్యక్రమాన్ని జోరుగా నిర్వహిస్తూ వచ్చారు. దీంతో ఆ నియోజకవర్గం మూడో స్థానంలో ఉంది. పుంగనూరులో టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ కూడా రోజూ చిత్తూరు నగరం, రూరల్‌,గుడిపాల, మండలాల్లో స్థానిక నాయకులతో కలిసి తిరుగుతున్నారు. జీడీనెల్లూరు ఎమ్మెల్యే థామస్‌ వీలును బట్టి నియోజకవర్గంలో తిరుగుతున్నా, నాయకులు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. జీడీనెల్లూరు, నగరి నియోజకవర్గాలు కాస్త వెనుకబడ్డాయి. ఈ రెండు చోట్ల ఎమ్మెల్యేలు థామస్‌, గాలి భానుప్రకాష్‌ చొరవ తీసుకుని స్థానిక నాయకులకూ బాధ్యతలు అప్పగిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

నియోజకవర్గం తిరగాల్సిన ఇళ్లు ప్రచారం చేసినవి శాతం

కుప్పం 87104 77612 89.10

పూతలపట్టు 72572 54657 75.31

పలమనేరు 86713 57717 66.56

పుంగనూరు 79117 46285 58.50

చిత్తూరు 69605 38733 55.65

జీడీనెల్లూరు 67200 28010 41.68

నగరి 69569 25439 36.57

Updated Date - Aug 01 , 2025 | 02:15 AM