Share News

ముక్కంటి ఆలయంలో 8,766 రాహుకేతు పూజలు

ABN , Publish Date - Apr 28 , 2025 | 01:11 AM

వివిధ సేవా టిక్కెట్లు, ప్రసాదాలు కలిపి రూ.కోటి ఆదాయం వాయులింగేశ్వరుడి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

ముక్కంటి ఆలయంలో 8,766 రాహుకేతు పూజలు
ఆలయం వద్ద భక్తులు

శ్రీకాళహస్తి, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహుకేతు పూజల సంఖ్య ఆదివారం సరికొత్త రికార్డుగా నమోదైంది. ఒక్క రోజే ఐదు విభాగాలు కలిపి మొత్తం 8,766 రాహుకేతు సర్పదోష నివారణ పూజలు నమోదయ్యాయి. ఇందులో రూ.500 రాహుకేతు టిక్కెట్ల ద్వారా 4,739మంది, రూ.750 టిక్కెట్ల ద్వారా 2,481, రూ.1,500 టిక్కెట్ల ద్వారా 862మంది, రూ.2,500 టిక్కెట్ల ద్వారా 492మంది, రూ.5వేలు టిక్కెట్ల ద్వారా 192మంది పూజలు చేయించుకున్నారు. వివిధ సేవలు, ప్రసాదాల ద్వారా ఆలయానికి రికార్డుస్థాయిలో ఆదాయం నమోదైంది. వివిధ సేవల ద్వారా రూ.1,02,62,356 ఆదాయం వచ్చింది. అందులో ఆశీర్వాదం 1, స్వామి అమ్మవార్ల అభిషేకం 139, శనీశ్వరస్వామి అభిషేకం 42, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 38, గోపూజ 46, మృత్యుంజయస్వామి అభిషేకం 4, రుద్ర హోమం 6, సుప్రభాత సేవ 16, చండీ హోమం 13, నిత్య కల్యాణం 5, అర్చన 116గా నమోదైంది. ఇక ఐదు రకాల ప్రసాదాలు కలిపి 28,470 అమ్ముడైనట్లు ఆలయాధికారులు తెలిపారు

ఆలయంలో భక్తులు

ఆదివారం అమావాస్య కలిసి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. శనివారం రాత్రే పట్టణంలోని లాడ్జీలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆదివారం వేకువజాము నుంచే స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు క్యూలో బారులు తీరారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహరాష్ట్ర నుంచీ పెద్దసంఖ్యలో భక్తులు వచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 35 వేలమంది స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. రూ.500 అంతరాలయ దర్శనం 563 మంది, రూ.200 శీఘ్ర దర్శనం టిక్కెట్ల ద్వారా 5,769 మంది, రూ.50ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా 4,109 మంది స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

Updated Date - Apr 28 , 2025 | 01:11 AM