National Award: చీరాల కుప్పడం చీరకు జాతీయ గుర్తింపు
ABN , Publish Date - Jun 14 , 2025 | 03:58 AM
చీరాల కుప్పడం చీరకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి(ఓడీఓపీ) కింద కేంద్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఓడీఓపీ కింద కేంద్ర ప్రభుత్వ అవార్డు
జూలై 14న ఢిల్లీలో అందుకోనున్న కలెక్టర్
చీరాల, జూన్ 13(ఆంధ్రజ్యోతి): చీరాల కుప్పడం చీరకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి(ఓడీఓపీ) కింద కేంద్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. జూలై 14న ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్ మండపంలో నిర్వహించనున్న కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళీ ఈ అవార్డును అందుకోనున్నారు. తమ నైపుణ్యానికి తగిన గుర్తింపు కోసం చీరాలలోని వేలాది చేనేత కుటుంబాలు ఎదురుచూస్తూనే ఉన్నాయి. వారి ఆకాంక్షను కూటమి ప్రభుత్వం తీర్చింది. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య నేతన్నలు నేసిన చీరను, దాని నాణ్యత వివరాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. నేతన్నల ప్రావీణ్యంపై సానుకూలంగా స్పందించిన సీఎం.. చీరాల చీర ప్రాధాన్యతను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
జనవరిలో కేంద్ర బృందం పర్యటన
గత జనవరి 9న కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశీలన చేసింది. ఈ సందర్భంగా ఇక్కడి చీరల ప్రత్యేకత, నాణ్యతను కలెక్టర్ ఆ బృందం సభ్యులకు వివరించారు. చీరాల చేనేతల కుప్పడం(డిజైన్ కోసం చేతితో ప్రత్యేకంగా నేసే విధానం) ఉత్పత్తులు, అమ్మకాలు, వారి జీవన స్థితిగతులపై కేంద్రానికి నివేదిక ఇచ్చారు. కుప్పడం చీరలు నేయడానికి ప్రత్యేక నైపుణ్యం ఉండాలని, చీర అంచులను రెండు విధాలుగా నేయాల్సి ఉంటుందని నేతన్నలు చెబుతున్నారు. తమలో కూడా నైపుణ్యం ఉన్న వారు మాత్రమే ఈ చీరలు నేయగలుగుతారని అంటున్నారు.
చేనేత రంగానికి ఊతం
చీరాల నేతన్నకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. కుప్పడం చీరకు లభించిన గుర్తింపుతో ఉపాధి పెరుగుతుంది. అమ్మకాలు పెరుగుతాయి.
- సిద్ధి బుచ్చేశ్వరరావు, మాస్టర్ వీవర్