Share News

SIT Interrogation: ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్నికోట్లు పంచారు

ABN , Publish Date - Jul 02 , 2025 | 04:28 AM

గత సార్వత్రిక ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్నెన్ని కోట్ల మద్యం ముడుపులు పంచారు? లిక్కర్‌ స్కామ్‌లో ఏ-1 రాజ్‌ కసిరెడ్డి నుంచి ఎన్ని కోట్లు నగదు రూపంలో తీసుకున్నారు?

 SIT Interrogation: ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్నికోట్లు పంచారు

  • రాజ్‌ కసిరెడ్డి వద్ద డబ్బు తీసుకోమన్నది ఎవరు?

  • వెంకటేశ్‌నాయుడికి ఈ డబ్బులతో లింకేంటి?

  • ముడుపులు దాచిన ఇంటికి మీరెందుకెళ్లారు?

  • ఆఫ్రికాలో బిజినెస్‌ వ్యవహారం ఎంతవరకు వచ్చింది?

  • చెవిరెడ్డిపై సిట్‌ అధికారుల ప్రశ్నల వర్షం

  • తెలియదు.. సంబంధం లేదంటూ వైసీపీ నేత దాటవేత

  • అధికారులపై చిందులు.. కేకలు వేస్తూ దబాయింపు

  • లిక్కర్‌ వాసన కూడా చూడని వ్యక్తిపై నిందలేస్తారా?

  • సంబంధంలేని కేసులు పెడతారా అంటూ అదే పాతపాట

అమరావతి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): గత సార్వత్రిక ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్నెన్ని కోట్ల మద్యం ముడుపులు పంచారు? లిక్కర్‌ స్కామ్‌లో ఏ-1 రాజ్‌ కసిరెడ్డి నుంచి ఎన్ని కోట్లు నగదు రూపంలో తీసుకున్నారు? ఎవరు చెబితే మీరు పంపిన వ్యక్తులకు ఆయన డబ్బులిచ్చారు? గరికపాడు చెక్‌పోస్టు వద్ద పట్టుబడ్డ డబ్బులతో మీ మిత్రుడు వెంకటేశ్‌ నాయుడికి(ఏ-34) సంబంధం ఏంటి.?......అంటూ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు ప్రశ్నలవర్షం కురిపించారు. మద్యం కుంభకోణం కేసులో విచారణకు గతంలో హాజరైన వారంతా.. సిట్‌ ప్రశ్నలకు తెలియదు.. గుర్తు లేదు.. అని చెబుతూ వచ్చారు. అయితే, సిట్‌ అధికారులు వేసిన ప్రశ్నలకు చెవిరెడ్డి బదులివ్వకపోగా, వారిపైనే చిందులు తొక్కినట్టు సమాచారం. మద్యం ముట్టని తనపై నిందలు వేస్తున్నారంటూ పాత పాటనే ఆయన పాడినట్టు తెలిసింది. మద్యం కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (ఏ38), ఆయన స్నేహితుడు చెరుకూరి వెంకటేశ్‌నాయుడిని సిట్‌ అధికారులు మంగళవారం కస్టడీకి తీసుకున్నారు. జైలులో రికార్డు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించిన తర్వాత పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఉన్న సిట్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. వారిద్దరినీ వేర్వేరు గదుల్లో ఉంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు విడివిడిగా విచారించారు. గత ఎన్నికల సమయంలో గరికపాడు చెక్‌పోస్టు వద్ద దొరికిన 8.37కోట్ల నగదు ఎక్కడిది.? ఎక్కడ తీసుకుని, ఎక్కడకు తరలిస్తున్నారు... అంటూ వెంకటేశ్‌నాయుడిని సిట్‌ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది.


అరిస్తే అబద్ధాలు నిజాలు కావు సర్‌ చెవిరెడ్డికి దీటుగా సిట్‌ ప్రతిస్పందన

విచారణ సందర్భంగా... మద్యం కుంభకోణానికి సంబంధించి సంపాదించిన పక్కా ఆధారాలను ముందుపెట్టుకుని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సిట్‌ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. సిట్‌ అధికారులకు, చెవిరెడ్డికి మధ్య సంభాషణ ఇలా సాగింది..

సిట్‌: రూ.మూడున్నర వేల కోట్ల మద్యం కుంభకోణంలో భారీగా డబ్బులు మీ ద్వారా పలు ప్రాంతాలకు చేరాయి. ఎక్కడెక్కడికి ఎంత తీసుకెళ్లారు.? అక్కడి నుంచి ఎవరెవరికి పంపిణీ చేశారు?.’

చెవిరెడ్డి: నాకు లిక్కర్‌ వాసన పడదు. ఎప్పుడూ రుచి కూడా చూడలేదు. అలాంటిది వేల కోట్ల స్కామ్‌లో నాకు డబ్బులు ఎవరైనా, ఎందుకిస్తారు.? సంబంధం లేని వ్యవహారంలో నన్ను, నా కుటుంబాన్ని అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారు.. ఫలితం అనుభవిస్తారు.

సిట్‌: మీరు నోరు పెద్దది చేసి గట్టిగా మాట్లాడితే సరిపోదు. ఏ సంబంధమూ లేకపోతే తాడేపల్లిలో మద్యం ముడుపులు దాచిన ఇంటికి పలుమార్లు ఎందుకెళ్లారు?. ప్రణయ్‌ ప్రకాశ్‌తో ఎందుకు సమావేశమయ్యారు?

చెవిరెడ్డి: తాడేపల్లిలో మా పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉంది. ముఖ్యమంత్రి, పలువురు పార్టీ పెద్దలు అక్కడ ఉంటారు. ఏదో పని మీద ఎవరినైనా నేను కలుస్తుంటా. అంతమాత్రాన, ఆ ఇంట్లో డబ్బులున్న విషయం నాకు తెలుస్తుందా? ప్రణయ్‌ ప్రకాశ్‌ ఎవరో నాకు తెలియదు. (అధికారులపై చిందులు)


ఇవిగో సాక్ష్యాలు..

సిట్‌ : (ఇదిగో సాక్ష్యాలంటూ ఇద్దరూ ఎక్కడెక్కడ కలిశారో ఫొటోలతోపాటు ప్రణయ్‌ వాంగ్మూలాన్ని చూపిస్తూ..) మీ ఇద్దరూ మద్యం ముడుపులతో ఆఫ్రికాదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకున్నారు కదా.? అవి ఇప్పుడు ఏ దశలో ఉన్నాయి?

చెవిరెడ్డి: అక్కడ నాకు వ్యాపారాలుంటే చూపించండి. ఎలాంటి శిక్షకైనా సిద్ధం. (అధికారులపై అరుపులు)

సిట్‌ : మీరు కేకలు వేస్తేనో.. గట్టిగా అరిస్తేనో.. నిజాలు అబద్ధాలు అయిపోవు. మా దర్యాప్తునకు సహకరించండి. ఏదైనా ఉంటే తర్వాత కోర్టులో నిరూపించుకోండి. మీరు పలుమార్లు హైదరాబాద్‌లో రాజ్‌ కసిరెడ్డి నుంచి డబ్బులు తీసుకున్నారు.? ఎవరు చెబితే ఆయన మీకు డబ్బులు ఇచ్చారు.? ఎన్నిసార్లు మీరు తీసుకున్నారు? రాజ్‌ కసిరెడ్డి మొత్తం ఎంత ఇచ్చారు.? ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఎంత పంచారు? ఎవరు చెబితే పంపిణీ చేశారు.?

చెవిరెడ్డి: నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు ఎవ్వరూ డబ్బులు ఇవ్వలేదు.. నేను ఎవ్వరికీ పంపిణీ చెయ్యలేదు..

సిట్‌ : లిక్కర్‌ ముడుపుల సొమ్ము ముట్టుకోలేదని మీరు అంటున్నారు. కానీ, మీరెక్కడ ఆ డబ్బులు తీసుకున్నావో.. మీ మనుషుల్ని ఎక్కడకి పంపారో మా వద్ద ఆధారాలు ఉన్నాయి. (కొన్ని వీడియోలు చెవిరెడ్డికి చూపించారు.)

చెవిరెడ్డి: నాకేమీ తెలియదు. రాజ్‌ కసిరెడ్డి ఆఫీసుకు వెళ్లేందుకు సవాలక్ష వ్యవహారాలు ఉంటాయి. అంత మాత్రాన డబ్బులకు వెళ్లినట్టేనా?

సిట్‌ : అడిగిన దానికి సూటిగా సమాధానం ఇవ్వండి. గట్టిగా దబాయిస్తే తప్పు ఒప్పు అయిపోదు.

చెవిరెడ్డి: అన్యాయంగా కేసులో ఇరికించి నేను తప్పు చేశాననడం సరికాదు.


ఆ రూ.8.37 కోట్లు ఎవరివి.?

సిట్‌: లిక్కర్‌ స్కామ్‌తో సంబంధం లేదు.. డబ్బులు ఎవరి దగ్గరా తీసుకుని ఎవరికీ చేర్చలేదని చెబుతున్నారు కదా! మరి, ఎన్నికల సమయంలో గరికపాడు చెక్‌పోస్టు వద్ద పట్టుబడ్డ 8.37కోట్ల రూపాయలు ఎవరివి.? ఆ డబ్బులతో సంబంధం లేకుంటే మీ సహాయకుడు నవీన్‌ ఎందుకు ఆ సమయంలో అక్కడున్నారు.? గన్‌మెన్‌ గిరిని సెల్‌ స్విచ్చాఫ్‌ చేసి చెన్నైకి పారిపో అని ఎందుకు మీరు చెప్పారు.?

చెవిరెడ్డి: ఆ డబ్బులు ఒంగోలుకు చెందిన వ్యాపారవేత్త ప్రద్యుమ్నకు చెందినవి. దీనికి సంబంధించి ఆయన ఇప్పటికే ఆధారాలు చూపించారు.

సిట్‌: ప్రద్యుమ్న కంపెనీ సామర్థ్యం ఏ పాటిదో మాకు తెలుసు. మీ మిత్రుడు వెంకటేశ్‌ నాయుడు హైదరాబాద్‌లో మీ గన్‌మెన్‌ గిరి, పీఏ నవీన్‌కు మద్యం ముడుపులు అందించారు.

చెవిరెడ్డి: నేను కోర్టులో తేల్చుకుంటా. మీరు నన్ను ఉద్దేశ పూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారు.

సిట్‌: అదే నిజమైతే మీ పీఏ, గన్‌మెన్‌ ఆ సమయంలో గరికపాడు చెక్‌పోస్టు వద్ద ఎందుకున్నారు.?

చెవిరెడ్డి: గన్‌మెన్‌ను మీరు బెదిరిస్తే ఆయన ఏదో చెప్పాడు. దానికి నేను సమాధానం చెప్పాలా?

సిట్‌: మీరు లా చేశారు. ఇంత కన్నా టెక్నికల్‌ ఎవిడెన్స్‌ కావాలా.? (చెవిరెడ్డి కారులో పీఏ, గన్‌ మెన్‌ ప్రయాణిస్తున్న వీడియో చూపారు.)

Updated Date - Jul 02 , 2025 | 05:43 AM