Ministers OSD Removed in Mining Row: మంత్రి కొల్లు ఓఎస్‌డీ తొలగింపు
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:52 AM
గనుల శాఖపై తీవ్ర ఆరోపణల నేపథ్యంలో, మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్‌డీగా నియమించిన పి. రాజాబాబును సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వం తొలగించింది. ఆయనపై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నా, మంత్రి పట్టుబడి నియమించగా.. ఇప్పుడు అవే ఆరోపణలు అధికారుల వైఖరిని ప్రశ్నించాయి

గనుల శాఖపై తీవ్ర విమర్శల నేపథ్యంలో నిర్ణయం
నివేదిక తెప్పించుకున్న సీఎం చంద్రబాబు
ఓఎస్‌డీ రాజాబాబును తప్పించాలని ఆదేశం
నియామకానికి ముందే ఆయనపై తీవ్ర ఆరోపణలు
అయినప్పటికీ ఆయనే కావాలని నాడు పట్టుబట్టిన మంత్రి
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వద్ద ఓఎస్‌డీగా పనిచేస్తోన్న పి. రాజాబాబును ప్రభుత్వం పక్కన పెట్టింది. రాజాబాబు గనులశాఖ అధికారి. ఆ శాఖలో జాయింట్‌డైరెక్టర్‌గా పనిచేస్తూ 2024 మార్చిలో పదవీ విరమణ పొందారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన్ను కొల్లు రవీంద్రకుఓఎస్‌డీగా తీసుకోవాలని సంప్రదింపులు జరిగిన సమయంలోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. గనులశాఖలో పనిచేసినప్పుడు ఆయనపై అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చాయి.
అలాంటి అధికారిని మంత్రి ఓఎస్‌డీగా ఎలా తీసుకుంటారన్న ప్రశ్నలు వచ్చినా నాడు మంత్రి లెక్కపెట్టలేదు. రాజాబాబే ఓఎ్‌సడీగా కావాలని పట్టుబట్టి మరీ తీసుకున్నారు. ఈ 10 నెలల పాలనలో గనులశాఖ పనితీరు, అప్పీల్ రివిజన్ కేసులపై అనేకానేక ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లాయి. వీటిపై సీఎం నివేదిక తెప్పించుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఓఎస్‌డీనే తప్పించాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో రాజాబాబు గత కొద్దిరోజులుగా ఆఫీసుకు రావడం లేదు. ఓఎ్‌సడీ పోస్టు నుంచి తప్పుకుంటానని ఆయన పేషీలో చెప్పినట్లు తెలిసింది. ప్రభుత్వం తప్పించబోతోందన్న సమాచారంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.