Nagarjuna Sagar Right Canal: నాగార్జున సాగర్ కుడికాలువ కట్టకు గండి.. భయం గుప్పిట్లో ప్రజలు..
ABN , Publish Date - Nov 21 , 2025 | 08:17 AM
కారంపూడి ఎస్కేప్ ఛానల్ వద్ద అర్ధరాత్రి వేళ నాగార్జున సాగర్ కుడి కాలువ కట్టకు గండి పడింది. కాలువకు గండి పడటంతో నాగులేటి వాగుకు ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ పోతోంది.
పల్నాడు: నాగార్జున సాగర్ కుడికాలువ కట్టకు గండి పడింది. కారంపూడి ఎస్కేప్ ఛానల్ వద్ద అర్ధరాత్రి వేళ కట్టకు గండి పడింది. కాలువకు గండి పడటంతో నాగులేటి వాగుకు ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ పోతోంది. వీరుల తిరునాళ్లలో ఏర్పాటు చేసిన దుకాణాల్లోకి నీరు చేరింది. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
సమాచారం అందుకున్న స్థానిక అధికారులు హుటాహుటిన గండిపడ్డ చోటుకు చేరుకున్నారు. గండిని పూడ్చే పనులు చేపట్టారు. ప్రాజెక్టు వద్దే నీటిని నిలుపుదల చేయాల్సి ఉందని స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు కట్టను ధ్వంసం చేసి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి నిమ్మల
మంత్రి నిమ్మల రామానాయుడు నాగార్జున సాగర్ కుడికాలువ గండిపై ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. సమీప గ్రామాల్లోకి నీరు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు చెప్పారు. గండి పడటానికి గల కారణాలను నివేదిక రూపంలో అందించాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి నిమ్మల ఆదేశించారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన గండి పూడ్చుతున్నారు. ఆందోళన వద్దని గ్రామస్తులకు సూచిస్తున్నారు. మధ్యాహ్నం కల్లా గండి పూడ్చి వేత పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
రేడియాలజిస్టు పాడు పని.. స్కానింగ్ కోసం వెళ్లిన మహిళపై..
పాత్రధారులే అరెస్టు అవుతున్నారు.. మరి సూత్రధారులు ఎక్కడ..