PVN Madhav: అన్నిరంగాల్లోనూ అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్
ABN , Publish Date - Jul 02 , 2025 | 05:06 AM
ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా ఉండాలని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆకాంక్షించారు. రాష్ట్రం మరోసారి విభజన గాయాలకు గురికాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలు, భాష, వారసత్వంపై ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం రావాలనీ,

బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆకాంక్ష
సీనియర్ నాయకుల సమక్షంలో బాధ్యతలు
బాధ్యతలు అప్పగించిన పురందేశ్వరి
అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా ఉండాలని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆకాంక్షించారు. రాష్ట్రం మరోసారి విభజన గాయాలకు గురికాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలు, భాష, వారసత్వంపై ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం రావాలనీ, ‘ఇది నాది’ అనే భావన పెరగాలనీ ఆయన సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా మాధవ్ పేరును కర్ణాటక బీజేపీ ఎన్నికల పరిశీలకుడు, బెంగళూరు ఎంపీ పీసీ మోహన్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఎన్నిక నిర్వాహకుడు, ఎంపీ పాకా సత్యనారాయణ ధ్రువీకరణ పత్రం అందజేయగా.. పురందేశ్వరి పార్టీ జెండా మాధవ్ చేతికి అందజేసి బాధ్యతలు బదిలీ చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన సంఘటనా పర్వ్‌లో మాధవ్ మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్ష పదవి తనకు బాధ్యత అని, ఒక చేత్తో బీజేపీ జెండా, మరో చేత్తో ఎన్డీఏ అజెండాతో పనిచేస్తానని తెలిపారు. ‘‘రాష్ట్రంపై అభిమానం, భాషపై మమకారం ఏర్పరచుకొని జాతీయ స్ఫూర్తితో ప్రతి ఒక్కరం ముందడుగు వేయాల్సిన బాధ్యత ఉంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో భాషతో పాటు రాజధాని కూడా అన్యాయానికి గురైంది. అమరావతి రాజధానిగా ఏడాదిగా సుపరిపాలన జరుగుతోంది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విశాఖలో యోగాంధ్ర నిర్వహించి ప్రపంచం ఆరోగ్యంగా ఉండేలా ప్రయత్నం చేశారు. ఒకప్పుడు ఒడిసా, కర్ణాటకతో పోల్చితే ఏపీలోనే బీజేపీ బలంగా ఉండేదనే విషయాన్ని ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రంలో పార్టీని బలమైన శక్తిగా కార్యకర్తలు గర్వపడే స్థాయికి చేరుస్తాను. ఎమర్జెన్సీ గాయానికి యాభై ఏళ్లు వచ్చేనాటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అయ్యాను. ఇదే సమయంలో ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి వందేళ్లు కావడం ఆనందంగా ఉంది.’’ అని మాధవ్ అన్నారు.
మాధవ్‌కు సీఎం శుభాకాంక్షలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్‌కు సీఎం చంద్రబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతల్లో రాణించాలని ఆకాంక్షించారు. కూటమి పార్టీల సమన్వయం, పరస్పర సహకారంతో రాష్ట్రాభివృద్ధికి పాటు పడుదామని సూచించారు. మంత్రి లోకేశ్ కూడా మాధవ్‌కు అభినందనలు తెలియజేశారు.