AP NGO Association: ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని స్వాగతిస్తున్నాం
ABN , Publish Date - Jun 16 , 2025 | 04:25 AM
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతిస్తున్నామని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు.

ఉద్యోగుల సమస్యలను విస్మరించొద్దు
ఏపీఎన్జీజీవో అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్
నూతన ప్రధాన కార్యదర్శిగా డీవీ రమణ ఎన్నిక
విజయవాడ, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతిస్తున్నామని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. సంఘం నూతన ప్రధాన కార్యదర్శిగా విజయనగరం జిల్లాకు చెందిన డీవీ రమణ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను విస్మరిస్తోందనే భావన ఉందని, ఉద్యోగ వర్గాలు దీనిపై అసంతృప్తిగా ఉన్నాయన్నారు. రూ.30 వేల కోట్లకుపైగా ఆగిపోయిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల్లో రూ.7,500 కోట్లే ఇచ్చారని పేర్కొన్నారు. పీఆర్సీ కమిటీని తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. వీలైనంత త్వరలో ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని విద్యాసాగర్ కోరారు. రమణ మాట్లాడుతూ ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా అందరికీ అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు దస్తగిరి, 13 జిల్లాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.