Free Civils Coaching: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచిత సివిల్స్ కోచింగ్.. ఐదు రోజులే టైం
ABN , Publish Date - Nov 28 , 2025 | 08:02 AM
ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత కోచింగ్, ఉచిత వసతి కల్పిస్తున్నట్టు వెల్లడించింది. విద్యార్థులు డిసెంబర్ 3వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని, 7న ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందని.. 11న ఫలితాలు, 14 నుంచి తరగతులు..
ఇంటర్నెట్ డెస్క్: ఏపీ సర్కారు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత సూచించారు. 100 మందికి ఉచిత శిక్షణతోపాటు ఉచిత వసతి కూడా కల్పిస్తున్నామని, వచ్చే నెల 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని.. 7న ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందని మంత్రి సవిత వెల్లడించారు. 11న ఫలితాలు వెల్లడించి.. 14 నుంచి తరగతులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో వచ్చే నెల 14వ తేదీ నుంచి ఉచిత సివిల్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అందజేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్‌లో బీసీ సంక్షేమ శాఖాధికారులతో మంత్రి సవిత గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రెండో విడత సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇస్తున్నట్టు మంత్రి సవిత తెలిపారు. వంద మంది అభ్యర్థులకు శిక్షణిచ్చేలా గొల్లపూడి బీసీ భవన్‌లో ఏర్పాట్లు చేయిస్తున్నామన్నారు. అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 12వ తేదీన గొల్లపూడిలోని బీసీ భవన్ లో రిపోర్టు చేయాలని చెప్పారు.
తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన బీసీ అభ్యర్థులు ఉచిత సివిల్స్ శిక్షణకు అర్హులని మంత్రి వివరించారు. గతేడాది ఉచిత శిక్షణ పొందిన వారు కూడా మరోసారి దరఖాస్తు చేసుకోవొచ్చునని.. ఉచిత సివిల్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ కు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించనున్నామన్నారు. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు మంత్రి చెప్పారు. 100 సీట్లలో బీసీలకు 66 సీట్లు, ఎస్సీలకు 20, ఎస్టీలకు 14 సీట్లు కేటాయిస్తున్నామని మంత్రి వెల్లడించారు. మహిళలకు 34 శాతం రిజర్వేషన్లు అమలుచేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే
ముఖ్యమంత్రా.. రియల్ ఎస్టేట్ ఏజెంటా..?
Read Latest Telangana News and National News