Chandrababu: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ
ABN , Publish Date - Jul 15 , 2025 | 09:04 PM
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు ఈ సాయంత్రం ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై ఇరువురు మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. పోలవరం, బనకచర్లపై..

ఢిల్లీ, జులై 15: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు ఈ సాయంత్రం ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై ఇరువురు మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. పోలవరం, బనకచర్లపై ఏపీ వైఖరిని కేంద్ర హోం మంత్రికి చంద్రబాబు వివరించారు. ముందుగా మాజీ కేంద్ర మంత్రి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గవర్నర్ గా నియమించడంపై హోం మంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై అమిత్ షాతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు.
ఏపీలో వివిధ ప్రాజెక్టులకు, అభివృద్ది కార్యక్రమాలకు ఆర్ధిక సాయం అందించాల్సిన అవసరాన్ని సీఎం.. హోం మంత్రికి వివరించారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీ ఎదుర్కొన్న ఆర్ధిక నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని నిధుల కేటాయింపులు చేసేలా చూడాలని 16వ ఆర్ధిక సంఘానికి నివేదించామని అమిత్ షాకు సీఎం వివరించారు. అలాగే రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు నీటిని తరలించేందుకు కీలకమైన పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టు అంశాన్ని కూడా ప్రస్తావించారు. పోలవరం నుంచి కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్ వరకూ 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా ఈ లింక్ ప్రాజెక్టు ప్రతిపాదించినట్లు సీఎం.. చెప్పారు.
అనుసంధాన ప్రాజెక్టు పూర్తి అయితే కరవు పీడిత రాయలసీమ ప్రాంతానికి దక్కే ఫలితాలను సైతం అమిత్ షాకు వివరించారు సీఎం చంద్రబాబు. గోదావరి నదిలో ఎగువ, దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చిన తర్వాత కూడా 90 నుంచి 120 రోజుల మిగులు జలాలు ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పారు. నదీ ప్రవాహ మార్గంలో చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందని అమిత్ షా కు చెప్పారు సీఎం చంద్రబాబు.
ఇవి కూడా చదవండి:
పవర్ బ్యాంక్ కొనాలనుకునేవారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి
పాస్‌వర్డ్స్ లీక్.. భారతీయులకు కీలక సూచనలు జారీ
Read Latest and Technology News