MP Balashowry: ఏపీలో తుఫానుల నష్టంపై చర్చ జరగాలి: జనసేన ఎంపీ బాలశౌరి
ABN , Publish Date - Nov 30 , 2025 | 03:37 PM
రేపటి నుంచి హస్తినలో పార్లమెంట్ సమావేశాలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో అఖిలపక్ష భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన తరపున ఎంపీ బాలశౌరి హాజరయ్యారు. పార్లమెంట్లో ఏపీకి సంబంధించి జరగాల్సిన చర్చల మీద ఆయన..
ఢిల్లీ, నవంబర్ 30: రేపటి నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల సందర్బంగా ఈరోజు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు, జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. ఏపీలో మొంతా తుఫాను, దిత్వా తుఫానుల వల్ల జరిగిన నష్టంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని అఖిలపక్ష సమావేశంలో కోరారు.
ఏపీలో చాలా జిల్లాలకు జల్ జీవన్ మిషన్ కింద నిధులు రావాల్సి ఉందని, ప్రతి ఇంటికి మంచినీటిని అందించే జల్ జీవన్ మిషన్ కొనసాగించాలి.. దీనిపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని ఆయన విన్నవించారు. జల జీవన్ మిషన్ పథకం కింద ఏపీకి కేంద్ర సహకారం కావాలని, SIR(ఎన్నికల జాబితా సవరణ) పై పార్టీలో చర్చించి మా పార్టీ నిర్ణయాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కేంద్రానికి చెబుతారని కూడా అఖిలపక్షానికి బాలశౌరి తెలియజేశారు.
పోలవరం ప్రాజెక్టును 2027 లోపు పూర్తి చేయాలని, అమరావతి రాజధాని నిర్మాణం 2028 లోపు పూర్తయ్యేలా సహకారం అందించాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని కూడా బాలశౌరి వెల్లడించారు. రాజధాని, పోలవరం, ఔటర్ రింగ్ రోడ్డు సహా అనేక విషయాల్లో రాష్ట్రానికి కేంద్ర సహకారం ఉందని ఆయన చెప్పారు. 'మేము ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం.. రాష్ట్రం వెనుకబడి ఉంది.. కేంద్రం సహకారాన్ని మరింత పెంచాలని కోరాం' అని ఎంపీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
బీఎల్ఓల పరిహారం రెట్టింపు.. ఈసీ నిర్ణయం
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిల పక్షం భేటీ..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి