CPM: జహ్రాన మమ్దాని విజయం అపూర్వం
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:07 AM
అమెరికా దేశంలోని న్యూయార్క్ మేయర్‌గా జహ్రాన మమ్దాని ఎన్నికకావడం అపూర్వమని సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప అన్నారు. మేయర్‌గా మమ్దానీ ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ కూడలి వద్ద ఆయన చిత్రపటంతో ప్రదర్శన నిర్వహించారు.
అనంతపురం టౌన, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): అమెరికా దేశంలోని న్యూయార్క్ మేయర్‌గా జహ్రాన మమ్దాని ఎన్నికకావడం అపూర్వమని సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప అన్నారు. మేయర్‌గా మమ్దానీ ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ కూడలి వద్ద ఆయన చిత్రపటంతో ప్రదర్శన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అమెరికా దేశానికి కుంభస్థలం వంటి న్యూయార్క్ మహానగరంలో తనను తాను సోషలిస్టుగా ప్రకటించుకున్న డెమోక్రటిక్ అభ్యర్థి మమ్దాని విజయం సాధించడం గర్వించతగ్గ విషయమన్నారు. పెట్టుబడిదారీ విధానం వికటాట్టహాసం చేసే చోట సామాన్యుడి ఆకాంక్షల స్వరాన్ని జోహ్రాన గట్టిగా వినిపించారన్నారు. ప్రపంచ దేశాలపై పెత్తనానికి సామ్రాజ్యవాద వ్యూహాలు రూపొందించేచోట ప్రజల ఆరోగ్యం, పబ్లిక్ స్కూళ్ల బలోపేతం, ఇంటి అద్దెల నియంత్రణ వంటి అంశాలను ఆయన ఎజెండాగా చేసుకున్నారన్నారు. కార్పొరేట్ల లాభాలు మాత్రమే చర్చలుగా సాగే చోట కార్మికుల హక్కులను ఆయన ప్రస్తావించారని పేర్కొన్నారు. మమ్దానీని ఎన్నుకుంటే న్యూయార్క్ నగరానికి నిధులు ఇవ్వబోమంటూ ట్రంప్ హెచ్చరించినా ప్రజలు ఆయన మాటలను ఖాతరు చేయలేదన్నారు. 1965 తర్వాత న్యూయార్క్ మేయర్ పదవికి పోటీచేసిన ఏ అభ్యర్థికీ మమ్దానీకి వచ్చినన్ని ఓట్లు రాకపోవడం విశేషమన్నారు. సీపీఎం నగర కార్యదర్శి రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నాగేంద్రకుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటనారాయణ, ప్రకా్‌షరెడ్డి, వలి, మసూద్, ఇర్ఫాన, ఎన్టీఆర్ శ్రీనివాసులు, జీవ, వెంకట, ఇస్మాయిల్, శంకర్, రియాజ్, తిమ్మరాజు పాల్గొన్నారు.