CORPORATION: సీట్లన్నీ ఖాళీ
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:03 AM
నగరపాలక సంస్థలో ప్రధాన అధికారుల పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇనచార్జ్‌లతో నే పాలనను నెట్టుకొస్తున్నారు. ఏఎంసీ సెక్రటరీ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, ఏసీపీ, మేనేజర్, అడిషినల్ కమిషనర్ ఇలా అన్ని రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో నగరపాలక సంస్థ ఆశించిన మేర అభివృద్ధికి నోచుకోలేకపోతోంది. నగరపాలక సంస్థగా రూపాంతరం చెంది దాదాపు రెండు దశాబ్దాలు గడిచినా నగరంలో అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది.
ఇనచార్జిలతో నెట్టుకొస్తున్న పరిస్థితి
అధ్వానంగా మారిన పారిశుధ్య విభాగం
అధికారుల మధ్య లోపించిన సమన్వయం
అంతంతమాత్రంగా నగర అభివృద్ధి
అనంతపురం క్లాక్‌టవర్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థలో ప్రధాన అధికారుల పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇనచార్జ్‌లతో నే పాలనను నెట్టుకొస్తున్నారు. ఏఎంసీ సెక్రటరీ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, ఏసీపీ, మేనేజర్, అడిషినల్ కమిషనర్ ఇలా అన్ని రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో నగరపాలక సంస్థ ఆశించిన మేర అభివృద్ధికి నోచుకోలేకపోతోంది. నగరపాలక సంస్థగా రూపాంతరం చెంది దాదాపు రెండు దశాబ్దాలు గడిచినా నగరంలో అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. సరైన రోడ్లు, మురుగుకాలువ వ్యవస్థ, తాగునీరు, డంపింగ్ యార్డు లేవు. వీధి కుక్కలు, ఆవులు, పందుల నియంత్రణ కనిపించదు. ఈ సమస్యలపై నగర ప్రజలు ఫిర్యాదు చేసిన నగరపాలక సంస్థ అధికారుల స్పందించి పరిష్కరించడం అంతంతమాత్రంగానే ఉంటోంది. నగరంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నా నియంత్రించే నాథుడే లేడు.
ఇనచార్జిలే దిక్కు..
నగరపాలక సంస్థలో ఏఎంసీ సెక్రటరీ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అడిషినల్ కమిషనర్, టౌన ప్లానింగ్‌లో ఏసీపీ, టీపీఓ, టీపీఈఎస్, టీపీబీఓ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. టీపీఓ శిరీషకే ఏసీపీ ఇనచార్జ్ బాధ్యతలు అప్పగించారు. పరిపాలనలో కీలకంగా ఉండే మేనేజర్ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. రెవెన్యూ విభాగంలో సుమారు 19ఏళ్ల పాటు చేసిన సుజాతకు మేనేజర్‌గా బాధ్యతలు ఇచ్చినప్పటికీ వివిధ ఆరోపణలతో ఆమెను తప్పించారు. పెన్షన విభాగంలో పనిచేస్తున్న అధికారి ఖయ్యూమ్‌కి ఇనచార్జ్ బాధ్యతలు అప్పగించారు. డీఈగా పనిచేస్తున్న ఇంజనీరు నరసింహులును ఇనచార్జ్ ఎంహెచఓగా నియమించారు. ఇంజనీరింగ్ విభాగంలో వార్డు సచివాలయంలో పని చేస్తున్న అమెనిటీస్ సెక్రటరీలు 8మందికి అర్హత లేకపోయిన ఏఈలుగా నియమించారు. ఇనచార్జ్‌ల పాలనలో నగరపాలక సంస్థలో అభివృద్ధి అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గాడిలో పెడతాం..
నగరపాలక సంస్థలో అన్ని విభాగాలను గాడిలో పెట్టడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించాం. ఒక్కొక్క విభాగంపై దృష్టి పెడుతూ ఆయా సమస్యలు, అక్కడి పరిస్థితులు తెలుసుకుంటున్నాం. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అన్ని విభాగాలను ప్రక్షాళన చేసి, పాలనను గాడిలో పెట్టడానికి కృషి చేస్తాం. ఉద్యోగుల సమయపాలన మొదలు వారు చేసే పనుల పట్ల కూడా ఆరా తీస్తున్నాం. త్వరలో అన్నింటికి ఓ స్పష్టత ఇస్తాం.
-బాలస్వామి, కమిషనర్, అనంత నగరపాలక సంస్థ
కమిషనర్ దృష్టి సారించేనా..?
గత జనవరిలో అనంత నగరపాలక సంస్థ కమిషనర్‌గా వచ్చిన బాలస్వామి ఖాళీ పోస్టుల భర్తీపై దృష్టి పెడతారా? లేక మిన్నకుండిపోతారా అనే చర్చ నడుస్తోంది. డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషనలో అత్యధిక అనుభవశాలి అయిన కమిషనర్ నగర పాలికలో ఏం జరుగుతోంది తెలుసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏయే విభాగాల్లో ఎవరెవరు విధులకు హాజరవుతున్నారు? ఎవరు డుమ్మా కొడుతున్నారనే విషయాలపై కనీసం ఆరా తీయాలని కోరుతున్నారు. కమిషనర్ కార్పొరేషన పరిధిలో జరిగే భూమి పూజ, శంకుస్థాపనలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత ఆరు నెలలుగా బిల్లులు కావడం లేదని పనులుచేసిన కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యలపై కమిషనర్ దృష్టి సారించి నగర పాలకసంస్థను గాడిన పెట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు.
‘అపరిశుభ్రం’గా పారిశుధ్య విభాగం
నగరపాలక సంస్థలో శానిటేషన విభాగం కీలకం. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుధ్య విభాగం బలంగా పనిచేయాల్సి ఉంది. అయితే శానిటేషన పర్యవేక్షించడానికి, కార్మికులు, సిబ్బంది సక్రమంగా పని చేయడానికి ఇక్కడ ఒక డాక్టర్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్‌గా ఉండాల్సి ఉంది. కానీ గత వైసీపీ పాలన పుణ్యమా అని డాక్టర్లు కాని ఇంజనీర్లకు ఎంహెచఓ బాధ్యతలు అప్పగించే అనవాయితీకి శ్రీకారం చుట్టారు. దీంతో గత వైసీపీ పాటించిన పద్ధతిలోనే కూటమి ప్రభుత్వం కూడా ఎంహెచఓ బాధ్యతలు జనరల్ అధికారులకు అప్పగిస్తూ వస్తోంది. గత 8నెలలుగా ఏఎంసీ సెక్రటరీ రంగస్వామి ఇనచార్జి ఎంహెచఓగా పని చేసి, ఇటీవల మైదుకూరు కమిషనర్‌గా బదిలీపై వెళ్లారు. దీంతో డీఈగా ఉన్న నరసింహులుకు ఎంహెచఓ బాధ్యతలు అప్పగించారు. శానిటేషన సెక్రటరీలుగా ఆరు సర్కిళ్లకు ఒక్కరే రెగ్యులర్ ఇనస్పెక్టర్‌గా ఉన్నారు. ఐదు సర్కిళ్లలో మేస్త్రీలకు శానిటేషన ఇనస్పెక్టర్ల బాధ్యతలు అప్పగించారు. కనీస విద్యార్హత లేనివారిని శానిటేషన ఇనస్పెక్టర్లుగా నియమించడంతో నగరంలో పారిశుధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సర్కిల్ 6లో నలుగురు సిబ్బంది విధులకు హాజరు కాకుండా వేతనాలు తీసుకుంటున్నా పట్టించుకునేవారే లేరు. కొవిడ్ సమయంలో నియమించిన ఉద్యోగుల్లో రవికుమార్, ఉదయ్ కుమార్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది శివకుమార్, రెగ్యులర్ సిబ్బంది కేఆర్ నల్లమ్మ 9నెలలుగా విధులకు రాకుండా జీతాలు పొందుతున్నారు. శానిటేషన విభాగంలో ప్రతి సర్కిల్, ప్రతి వార్డులో ఇలా 10 నుంచి 20 మంది సిబ్బంది కనీస అనుమతి లేకుండా విధులకు డుమ్మా కొడుతూ జీతాలు తీసుకుంటున్నట్లు తెలిసింది.
విభాగాల మధ్య కొరవడిన సమన్వయం
నగరపాలక సంస్థలో ఉన్న వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. నగరపాలక సంస్థలో ప్రఽధానంగా టౌనప్లానింగ్, రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన, జనన-మరణాల విభాగం, మెప్మాలు ఉన్నాయి. అయితే ఆయా శాఖలు సంయుక్తంగా చేసే కార్యక్రమాలలో సైతం అధికారుల మధ్య సఖ్యత లేకపోవడం గమనార్హం. అటు అధికారులు, ఇటు ఉద్యోగుల తీరుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.