Share News

Health Department: రెండుసార్లు వైద్య పరికరాల కొనుగోళ్లా

ABN , Publish Date - Jun 23 , 2025 | 03:26 AM

ఒకే రకమైన వైద్య పరికరాలను రెండుసార్లు కొనుగోలు చేసి, రూ.16 కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేసిన విషయం బయటకు పొక్కడంతో ఆరోగ్యశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Health Department: రెండుసార్లు వైద్య పరికరాల కొనుగోళ్లా

  • నివేదిక కోరిన వైద్య మంత్రి, ఆరోగ్యశాఖ

  • వ్యవహారాన్ని రహస్యంగా ఉంచిన డీఎంఈ అధికారులు

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో వెలుగులోకి..

అమరావతి, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఒకే రకమైన వైద్య పరికరాలను రెండుసార్లు కొనుగోలు చేసి, రూ.16 కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేసిన విషయం బయటకు పొక్కడంతో ఆరోగ్యశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ), ఆ కార్యాలయ అధికారులకు దాదాపు ఐదు వారాల క్రితం ఈ విషయం తెలిసినా, వ్యవహారాన్ని కప్పిపుచ్చే క్రమంలో తూతూ మంత్రంగా విచారణ చేసి వదిలేశారు. కనీసం ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయానికి కూడా సమాచారం ఇవ్వలేదు. అనంతపురం ఆస్పత్రికి సంబంధించిన ఈ వ్యవహారంపై ‘కొనుగోళ్లలో కాసుల వర్షం!’ శీర్షికన ఆదివారం ‘ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం రావడంతో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల్లో కదలిక వచ్చింది.


ఒకే రకమైన వైద్య పరికరాలు రెండుసార్లు ఎందుకు కొనుగోళు చేశారు? ఎంత నిధులు దుర్వినియోగమయ్యాయి?. ఆ పరికరాలు ఇప్పుడు ఎక్కడున్నాయి?.. ఇలా పూర్తిస్థాయి సమాచారం ఇవ్వాలని డీఎంఈని, అనంతపురం ఆస్పత్రి అధికారులను నివేదిక కోరారు. మంత్రి సత్యకుమార్‌ ఆదేశాల మేరకు ఆయన కార్యాలయం కూడా సోమవారం నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. డీఎంఈ అధికారుల విచారణలో ఈ మొత్తం వ్యవహారం బయటికి వచ్చినా సూపరింటెండెంట్‌ మీద కానీ, ఈఈ మీద కానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పైగా తొలుత, రెండోసారి కొనుగోలు చేసిన వైద్య పరికరాలకు రూ.16 కోట్లు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో సూపరింటెండెంట్‌, ఈఈతో పాటు డీఎంఈ అధికారులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Updated Date - Jun 23 , 2025 | 03:27 AM