AIIMS Mangalagiri: మంగళగిరి ఎయిమ్స్‌లో అధునాతన క్యాథ్‌ల్యాబ్
ABN , Publish Date - Jul 06 , 2025 | 04:02 AM
మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన సెవెన్త్ జనరేషన్ బైప్లేన్ క్యాథ్‌ల్యాబ్‌ను, టీఎంటీ పరికరాలను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో ప్రొఫెసర్ అహంతెం శాంతా సింగ్ శనివారం ప్రారంభించారు.

ప్రారంభించిన ఎయిమ్స్ సీఈవో శాంతా సింగ్
అందుబాటులోకి ప్రపంచ స్థాయి కార్డియాలజీ సేవలు
మంగళగిరి సిటీ, జూలై 5(ఆంధ్రజ్యోతి): మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన సెవెన్త్ జనరేషన్ బైప్లేన్ క్యాథ్‌ల్యాబ్‌ను, టీఎంటీ పరికరాలను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో ప్రొఫెసర్ అహంతెం శాంతా సింగ్ శనివారం ప్రారంభించారు. గుండె సంరక్షణ, న్యూరోవాస్కులర్ ఇంటర్వెన్షన్స్ సేవలు, సంక్లిష్టమైన ఎండోవాస్కులర్ సేవలను మెరుగు పరిచేలా ఆ క్యాథ్‌ల్యాబ్‌ను తీర్చిదిద్దారు. ఈ అధునాతన టెక్నాలజీ ద్వారా కార్డియాలజీ విభాగంలో ప్రపంచ స్థాయి రోగ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వీలవుతుందని ఈ సందర్భంగా శాంతా సింగ్ అన్నారు. సుమారు రూ. 11 కోట్ల ఖరీదు చేసే నూతన ల్యాబ్ ద్వారా కరోనరీ యాంజియోప్లాస్టీ, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, స్ట్రక్చరల్ హార్ట్ ప్రొసీజర్లు, ఎలక్ట్రోఫిజియోలాజికల్ అధ్యయనాలు చేయవచ్చన్నారు. దీంతో కచ్చితమైన ఫలితాలు వస్తాయని చెప్పారు. వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు థ్రెడ్‌మిల్ టెస్ట్ పరికరాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఎయిమ్స్ హాస్టల్ ప్రాంగణానికి సమీపంలో బ్యాడ్మింటన్ కోర్టుల సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏఆర్ నటరాజ్, కార్డియాలజీ హెచ్‌వోడీ డాక్టర్ అమృత గణేష్, ఇతర అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.
13 మంది ఎయిమ్స్ విద్యార్థులపై చర్యలు
మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్ ఘటనకు సంబంధించి 13 మంది వైద్య విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్టు ఆ సంస్థ అధికార ప్రతినిధి డాక్టర్ వంశీకృష్ణారెడ్డి వెల్లడించారు. శనివారం ఎయిమ్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘13 మంది విద్యార్థులు ర్యాంగింగ్‌కు పాల్పడినట్టుగా గుర్తించాం. వారిని ఆరు నెలల నుంచి ఏడాదిన్నరపాటు సస్పెండ్ చేయడంతోపాటు ఒక్కొక్కరికి రూ.25 వేల జరిమానా కూడా విధించాం. ఆ విద్యార్థులను ఎయిమ్స్ వసతి గృహం నుంచి పూర్తిగా బహిష్కరించాం. సస్పెన్షన్ కాలం పూర్తయిన తర్వాత కూడా వారు హాస్టల్‌లో వుండే అవకాశం లేదు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాం. వారి భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని పేర్లను బయటకు వెల్లడించడం లేదు’ అని వంశీకృష్ణారెడ్డి తెలిపారు.