Dilsukhnagar blast case: దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు సయ్యద్ మృతి
ABN , Publish Date - Jul 26 , 2024 | 09:48 AM
సంచలనం సృష్టించిన 2013 నాటి దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న ఇండియన్ ముజాయుద్దీన్‌కు చెందిన సయ్యద్ మక్బూల్ (52) చనిపోయాడు.

హైదరాబాద్: సంచలనం సృష్టించిన 2013 నాటి దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న ఇండియన్ ముజాయుద్దీన్‌కు చెందిన సయ్యద్ మక్బూల్ (52) చనిపోయాడు. చర్లపల్లి జైల్లో ఉన్న అతడు అనారోగ్యంతో బాధపడుతూ గాంధీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా దేశవ్యాప్తంగా పలు బాంబుదాడుల్లో సయ్యద్ మక్బూల్ ప్రమేయం ఉన్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.
దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసుల్లో సయ్యద్ మక్బూ్ల్‌కు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే ట్రాన్సిట్ వారెంట్‌పై పోలీసులు అతడిని ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
2013 ఫిబ్రవరి 21న సాయంత్రం పేలుడు
కాగా 2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 6:45 గంటలకు దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 17 మంది మృత్యువాతపడ్డారు. వందలాది మంది తీవ్రంగా గాయపడి క్షతగాత్రులయ్యారు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడింది. పేలుళ్లకు పాల్పడిన ఐదుగురికి ఎన్‌ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది. కాగా ఇప్పటి వరకు నిందితులకు ఉరిశిక్ష అమలుకాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పేలుళ్లలో చనిపోయిని వారికి బాధిత కుటుంబాలు నివాళులర్పించారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.