ఏప్రిల్ 30లోపు ఆస్తి పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ
ABN , Publish Date - Apr 01 , 2026 | 05:14 AM
రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో వార్షిక ఆస్తి పన్నును ఏప్రిల్ 30లోపు చెల్లించిన వారికి ‘ఎర్లీ బర్డ్’ పథకంలో 5 శాతం రాయితీ లభించనుంది.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నేటి నుంచి ‘ఎర్లీ బర్డ్’
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో వార్షిక ఆస్తి పన్నును ఏప్రిల్ 30లోపు చెల్లించిన వారికి ‘ఎర్లీ బర్డ్’ పథకంలో 5 శాతం రాయితీ లభించనుంది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ఆదేశాలిచ్చారు. ఇప్పటికే జమ్మికుంట, హూజూరాబాద్ మున్సిపాలిటీలు వంద శాతం పన్ను వసూలు చేయగా.. మరో 10 మున్సిపాలిటీల్లో 90శాతం పైగా వసూలైందని అధికారులు తెలిపారు. ఎర్లీ బర్డ్ పథకంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నును ముందస్తుగా చెల్లిస్తే 5 శాతం రాయితీ వర్తిస్తుందని, పాత బకాయిలకు రాయితీ ఉండదని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎర్లీ బర్డ్‌లో భాగంగా పూర్వ జీహెచ్ఎంసీకి రికార్డు స్థాయిలో రూ.900 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ వరకు పరిధి పెంచుతూ మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆదాయం రూ.1,100 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.