Share News

కేబీఆర్‌ పార్కు వద్ద పనులు చేసుకోవచ్చు

ABN , Publish Date - Apr 01 , 2026 | 05:25 AM

నగరంలోని కేబీఆర్‌ పార్కు చుట్టుపక్కల ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో చేపడుతున్న పైవంతెనలు, అండర్‌పాస్‌లు, ఇతర పనులపై తక్షణం స్టే విధించేందుకు మంగళవారం హైకోర్టు నిరాకరించింది.

కేబీఆర్‌ పార్కు వద్ద పనులు చేసుకోవచ్చు

  • రోడ్లు, వంతెనలకు ఇబ్బంది లేదు

  • పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోండి

  • హైకోర్టు సూచన.. స్టేకు నిరాకరణ

హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): నగరంలోని కేబీఆర్‌ పార్కు చుట్టుపక్కల ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో చేపడుతున్న పైవంతెనలు, అండర్‌పాస్‌లు, ఇతర పనులపై తక్షణం స్టే విధించేందుకు మంగళవారం హైకోర్టు నిరాకరించింది. పర్యావరణ సున్నిత ప్రాంతం (ఎకో సెన్సిటివ్‌ జోన్‌)గా ఉన్న ఆ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం వంటి అనుమతించిన పనులు చేసుకోవచ్చని తెలిపింది. పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో మైనింగ్‌, రిజర్వాయర్లు, ఆనకట్టలు వంటి నిర్మాణాలపై నిషేధం ఉంటుందని, ట్రాఫిక్‌ నియంత్రణకు ఉద్దేశించిన రోడ్లు, అండర్‌పాస్‌ల పనులకు వర్తించదని పేర్కొంది. పనులు చేపట్టే క్రమంలో పిటిషనర్ల అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. కేబీఆర్‌ పార్కు వద్ద భారీ నిర్మాణాలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ.. పర్యావరణవేత్త డాక్టర్‌ కే పురుషోత్తంరెడ్డి, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక సంపాదకుడు కింగ్‌షుక్‌ నాగ్‌, కాజల్‌ మహేశ్వరి తదితరులు 2021లో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదిస్తూ..నిబంధనలకు విరుద్ధంగా, ప్రజాభిప్రాయం సేకరించకుండా పనులు చేపట్టారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ.. హైకోర్టు 2021లో ఇచ్చిన ఉత్తర్వులకు లోబడే పనులు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ నర్సింహ శర్మ విన్నవించారు. వాదనలు విన్న ధర్మాసనం.. నిర్మాణాల కోసం పార్కు ప్రాంతంలో చెట్లను నరికేస్తున్నారా? అటవీ ప్రాంతాన్ని తొలగిస్తున్నారా? అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ప్రశ్నించింది. దీనికి వారు సమాధానం ఇస్తూ చెట్ల సంగతి తెలియదని, కానీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. బఫర్‌ జోన్‌లో నిషేధిత పనులు, నియంత్రిత పనులు ఏమిటో కొంత పరిశోధన చేసి వివరాలతో రావాలని వారికి సూచించింది. పనుల ప్రస్తుత పరిస్థితిపై అదనపు కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

Updated Date - Apr 01 , 2026 | 05:25 AM