Share News

ఆటో ఎల్‌పీజీ సరఫరాను పెంచండి

ABN , Publish Date - Apr 01 , 2026 | 05:20 AM

వాహనాలకు ఎల్‌పీజీ గ్యాస్‌ సరఫరాలో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించేందుకుగాను సరఫరాలను పెంచాలని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరికి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి లేఖ రాశారు.

ఆటో ఎల్‌పీజీ సరఫరాను పెంచండి

  • కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి ఉత్తమ్‌ లేఖ

హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): వాహనాలకు ఎల్‌పీజీ గ్యాస్‌ సరఫరాలో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించేందుకుగాను సరఫరాలను పెంచాలని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరికి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి లేఖ రాశారు. గ్యాస్‌ కొరత కారణంగా రాష్ట్రంలో ఆటో రంగంపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు. ‘రాష్ట్రంలో సుమారు లక్ష ఎల్‌పీజీ ఆటో రిక్షాలు తిరుగుతున్నాయి. ఆటో ఎల్‌పీజీ గ్యాస్‌ను ప్రభుత్వ, ప్రైవేటు ఆపరేటర్లు వేర్వేరుగా అందిస్తున్నాయి. ఐవోసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ వంటి పీఎ్‌సయూలు సమష్టిగా 33 అవుట్‌లెట్లను నిర్వహి స్తూ 20 శాతం వాటా కలిగి ఉండగా.. ప్రైవేటు ఆపరేటర్లు రాష్ట్రంలో 110 అవుట్‌లెట్లతో 80శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉన్నాయి’ అని లేఖలో ఉత్తమ్‌ వివరించారు. ప్రస్తుతం నెలకొన్న సరఫరా పరిమితుల కారణంగా రోజుకు సుమారు 55 మెట్రిక్‌ టన్నుల ఆటో ఎల్‌పీజీ కొరత ఏర్పడిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో వాటి అవుట్‌లెట్లన్నింటిలో కార్యకలాపాలకు ఇబ్బందులు తలెత్తాయని, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ రంగ సంస్థల అవుట్‌లెట్లలో ఆటో ఎల్‌పీజీ లభ్యతను పెంచాలని కోరారు. ప్రభుత్వరంగ అవుట్‌లెట్లలో ఆటో ఎల్‌పీజీ ప్రస్తుత ధర లీటరుకు రూ.75 ఉండగా ప్రైవేటు కంపెనీలు లీటరుకు రూ.93 విక్రయిస్తున్నాయని, కొరతను ఆసరాగా చేసుకుని ఎక్కువ ధరకు విక్రయించే అవకాశం ఉందని కేంద్ర మంత్రికి వివరించారు. ప్రజా రవాణా, ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Apr 01 , 2026 | 05:20 AM