Share News

దిశా నిర్దేశం లేని అసెంబ్లీ సమావేశాలు

ABN , Publish Date - Apr 01 , 2026 | 05:16 AM

అసెంబ్లీ సమావేశాలు దిశా నిర్దేశం లేకుండానే ముగిశాయని బీఆర్‌ఎస్ఎల్పీ డిప్యూటీ నేత టీ హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆరు గ్యారంటీలపై స్పష్టత వస్తుందని ఆశలు పెట్టుకున్న ప్రజలకు సర్కారు...

దిశా నిర్దేశం లేని అసెంబ్లీ సమావేశాలు

  • దిగ జారిన సభా నాయకుడి ప్రతిష్ఠ

  • పొంగులేటి అవినీతిపై ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌

  • బీఆర్‌ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్‌ హరీశ్‌

హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాలు దిశా నిర్దేశం లేకుండానే ముగిశాయని బీఆర్‌ఎస్ఎల్పీ డిప్యూటీ నేత టీ హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆరు గ్యారంటీలపై స్పష్టత వస్తుందని ఆశలు పెట్టుకున్న ప్రజలకు సర్కారు నిరాశే మిగిల్చిందని మంగళవారం అసెంబ్లీ మీడియా హాలులో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు జవాబివ్వకుండా తొండలు, కండల భాష మాట్లాడిన సీఎం రేవంత్‌ రెడ్డి.. సభా నాయకుడికి ఉన్న ప్రతిష్ఠను దిగజార్చారన్నారు. కాంగ్రెస్‌ పాలకులు ఆత్మరక్షణలో పడ్డప్పుడల్లా విపక్షాలపై ఎదురు దాడి చేయడం తప్ప సభా మర్యాదను పాటించలేదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై చర్చకు సర్కారు ముందుకు రాలేదని, అసెంబ్లీ సమావేశాల్లో సగం రోజులు కూడా ప్రశ్నోత్తరాలు జరగలేదని చెప్పారు. ఇక ఢిల్లీ నుంచి సీఎం వస్తున్నారని.. ఏకంగా 4 గంటల టీ బ్రేక్‌ ఇచ్చారని, ఆర్థిక మంత్రి ప్రిపేర్‌ కావడానికి 3 గంటలు వేచి చూసేలా చేశారన్నారు. ఇంట్లో ప్రిపేర్‌ అయి రావాలే గానీ.. సభకు వచ్చాక ప్రిపేరవుతారా? అని ఆయన ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో తాము సభలో బయటపెడితే ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేశారని ఆరోపించారు. ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్కను తాను వ్యక్తిగతంగా విమర్శించలేదన్న హరీశ్‌.. ఆయన బడ్జెట్‌నుమాత్రమే విమర్శించానని చెప్పారు. తెలంగాణ ప్రజలు, వారి సమస్యలు పట్టని కాంగ్రెస్‌ ప్రభుత్వం కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం మార్చి30న అసెంబ్లీని అర్ధంతరంగా ముగించారన్నారు. 2 రోజులు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేసి.. ప్రభుత్వం తాననుకున్న బిల్లులను ఆమోదించుకుందని హరీశ్‌ చెప్పారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతోపాటు రెండేళ్లుగా సీఎం రేవంత్‌ రెడ్డి భాషపై కూడా ఎథిక్స్‌ కమిటీకి సిఫారసు చేయాలన్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు కొట్టుకు పోయాయని కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని హరీశ్‌ స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిద్దాం అని కేంద్ర మంత్రులు సీఆర్‌ పాటిల్‌, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతోపాటు కాళేశ్వరంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతలకు యాదాద్రి-భువనగిరి, చొప్పదండి, జగిత్యాల, సిద్దిపేట ప్రాంతాలకెళితే కాళేశ్వరంతో పండిన పచ్చని పంట పొలాలు కనిపిస్తాయన్నారు.

Updated Date - Apr 01 , 2026 | 05:16 AM