Share News

మహిళా సాధికారతకు.. ఉచిత బస్సు ఊతం

ABN , Publish Date - Apr 01 , 2026 | 05:17 AM

రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం’ మహిళా సాధికారతకు ఎంతో ఉపయోగకరంగా మారిందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

మహిళా సాధికారతకు.. ఉచిత బస్సు ఊతం

  • 290 కోట్ల జీరో టికెట్లు.. రూ.10 వేల కోట్లు ఆదా

  • ఆర్టీసీని బలోపేతం చేస్తూనే పథకం అమలు

  • మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.57 వేల కోట్ల రుణాలిచ్చాం

  • ‘మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం’ అభినందన సభలో డిప్యూటీ సీఎం భట్టి

  • పరిశీలనలో ఆర్టీసీ విలీనం: పొన్నం

హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం’ మహిళా సాధికారతకు ఎంతో ఉపయోగకరంగా మారిందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఉచిత బస్సు పథకం కింద ఇప్పటి వరకు 290 కోట్ల జీరో టికెట్లు (ఉచిత ప్రయాణంలో మహిళలకు ఇచ్చే టికెట్‌) ఇవ్వగా, రూ.10 వేల కోట్ల ప్రయాణ చార్జీలను మహిళలు ఆదా చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళల కోసం మహాలక్ష్మి పథకం ప్రారంభించామని, దీంట్లో భాగంగా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించామని గుర్తు చేశారు. ఆర్టీసీని బలోపేతం చేయటానికి చర్యలు తీసుకుంటూనే, మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నుంచి ఉచిత ప్రయాణ మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఆర్టీసీకి చెల్లిస్తున్నామని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాల మహిళలకు ఉచిత ప్రయాణం ఎంతగానో ఉపయోగపడుతోందని, బస్సు చార్జీలలో మిగిలిన మొత్తాన్ని కుటుంబ అవసరాలకు వినియోగించుకునే వెసులుబాటు కలిగిందన్నారు. మహిళా సాధికారతలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. తాము హామీ ఇచ్చినట్లుగా ఈ ఐదేళ్ల కాలంలో మహిళా సంఘాలకు లక్ష కోట్ల రుణం అందిస్తామని, ఇప్పటికే రూ.57వేల కోట్లు చెల్లించామని తెలిపారు. ఇదే విధంగా కొనసాగితే లక్షన్నర కోట్లు చెల్లించే పరిస్థితి కూడా రావచ్చన్నారు. హైదరాబాద్‌లో నిరుపేదలు నివసించే వాడల్లో మహిళా సంఘాలు పెద్ద సంఖ్య లో ఏర్పాటు చేస్తామని, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు నిధులు ఇచ్చి వారిని వ్యాపారస్థులను చేస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.


మారుమూల గ్రామాలకూ ఆర్టీసీ: పొన్నం

రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామానికి కూడా ఆర్టీసీ బస్సు నడిచేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్ల ఏర్పాటు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, మిగతా ఏ సమస్యలు ఉన్నా.. కార్మికులు తమ దృష్టికి తెస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఆర్టీసీలో విద్యుత్‌ బస్సులపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, 2018 నుంచే ఆ బస్సుల వాడకం ఆర్టీసీలో ఉందని, దశల వారీగా పెరుగుతున్నాయని గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రతి రోజు సగటున 65 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, వారిలో 40 లక్షల మంది మహిళలేనని చెప్పారు. మహాలక్ష్మి పథకం విజయవంతం కావడంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని చెబుతూ.. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకి ప్రభుత్వం తరపున మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తెలంగాణలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సంఘాలకు అందించిన రుణాలతో 4.78లక్షల మంది మహిళలు చిన్న వ్యాపారాలు ప్రారంభించారని తెలియజేశారు. ఉచిత ప్రయాణంతో మహిళలకు డబ్బులు మిగులుతున్నాయన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు. ఉచిత బస్సు పథకం తమకు ఏ విధంగా సహాయపడుతుందనే విషయాన్ని పలువురు మహిళా ప్రయాణికులు వివరించారు.

Updated Date - Apr 01 , 2026 | 05:17 AM