అందులోనూ స్టారే
ABN , Publish Date - Apr 05 , 2026 | 05:59 AM
సినిమాలతోనే కాదు.. ఆదాయం పెంచుకోవడంలోనూ తన రూటే సపరేటని నిరూపిస్తోంది బాలీవుడ్ నటి సారా అలీఖాన్. తాజాగా..
సినిమాలతోనే కాదు.. ఆదాయం పెంచుకోవడంలోనూ తన రూటే సపరేటని నిరూపిస్తోంది బాలీవుడ్ నటి సారా అలీఖాన్. తాజాగా తన ముంబై బంగ్లాను ఒక స్కూల్‌కు లీజుకు ఇచ్చిన ఈ అమ్మడు కోట్లలో అద్దె అందుకోబోతోంది.
బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఆస్తుల నిర్వహణలోనూ తన తెలివితేటలను ప్రదర్శిస్తోంది. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన అంధేరీ వెస్ట్‌లో ఉన్న తన విలాసవంతమైన బంగ్లాను ఒక విద్యాసంస్థకు భారీ అద్దెకు లీజుకు ఇవ్వడం ద్వారా ఆమె ఇప్పుడు వార్తల్లోని వ్యక్తి అయింది. ఐదేళ్ల కాలానికి కుదిరిన ఈ ఒప్పందం విలువ రూ. 4.14 కోట్లు.
సెక్యూరిటీ డిపాజిట్‌గా 20 లక్షలు
పాత లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని ‘బెల్‌స్కాట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’లో ఉన్న ఈ బంగ్లా సుమారు 4,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాంగణాన్ని ‘ప్రాడిజీ మాంటిస్సోరి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ అనే విద్యాసంస్థకు స్కూల్ సంబంధిత కార్యక్రమాల కోసం సారా లీజుకు ఇచ్చింది. ఈ ఒప్పందానికి సంబంధించి పాఠశాల యాజమాన్యం ఇప్పటికే రూ. 20 లక్షలను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించింది.
అంచెలంచెలుగా పెరగనున్న ఆదాయం
ఈ భారీ లీజు ఒప్పందానికి సంబంధించి ఆర్థిక లావాదేవీలను చాలా పక్కాగా రూపొందించారు. ఒప్పందం ప్రకారం మొదటి రెండేళ్లపాటు సారాకు నెలకు రూ. 6.5 లక్షల అద్దె లభిస్తుంది. మూడో ఏడాది నుంచి అద్దెపై 5 శాతం పెంపు ఉంటుంది. అంటే మూడో ఏడాదిలో రూ. 6.82 లక్షలు, నాలుగో ఏడాది రూ. 7.16 లక్షలు, ఐదో ఏడాది నాటికి అది రూ. 7.52 లక్షలకు చేరుతుంది. ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే ఈ ఒప్పందంలో 36 నెలల లాక్ ఇన్ పిరియడ్ కూడా ఉంది.
బాలీవుడ్‌లో లీజుల ట్రెండ్
ఇటీవల కాలంలో బాలీవుడ్ సెలబ్రిటీలు తమ ఆస్తులను కమర్షియల్ లీజుకు ఇవ్వడం ద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు. ఇప్పటికే మాధురీ దీక్షిత్, రాకేష్ రోషన్, బాబీడియోల్ వంటి ప్రముఖులు తమ కార్యాలయ స్థలాలను, బంగ్లాలను భారీ మొత్తాలకు లీజుకు ఇచ్చి ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పుడు అదే బాటలో సారా అలీఖాన్ కూడా ఒక విద్యా సంస్థకు తన బంగ్లాను లీజుకు ఇచ్చి అటు ఆదాయం ఆర్జించడంతోపాటు సామాజిక అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం
‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే... జరిగింది!