Share News

బీఎడ్‌ అర్హతలుంటేనే డీఈవోలుగా నియమించాలి

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:11 AM

రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలంటే బీఎడ్‌ అర్హత కలిగిన సీనియర్‌ ప్రధానోపాధ్యాయులను మాత్రమే పూర్తి అదనపు బాధ్యతలు కలిగిన జిల్లా....

బీఎడ్‌ అర్హతలుంటేనే డీఈవోలుగా నియమించాలి

  • ప్రభుత్వానికి డీటీఎఫ్‌ విజ్ఞప్తి

హైదరాబాద్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలంటే బీఎడ్‌ అర్హత కలిగిన సీనియర్‌ ప్రధానోపాధ్యాయులను మాత్రమే పూర్తి అదనపు బాధ్యతలు కలిగిన జిల్లా విద్యా శాఖాధికారులుగా (ఎఫ్‌ఏసీ డీఈవో) నియమించాలని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (డీటీఎఫ్‌) ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో అర్హత లేని ఏడీలు, ఐఏఎస్‌ అధికారులను డీఈవోలుగా నియమించడం వల్ల విద్యా వ్యవస్థ పనితీరు దెబ్బతింటోందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి సమ్మె సమయంలో నిలిచిపోయిన వేతనాలను వెంటనే విడుదల చేయడంతో పాటు వారికి 27 రోజుల సెలవు సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ఉపాధ్యాయుల ఆరోగ్య పథకం విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని, బేసిక్‌ పే నుంచి 1శాతం మాత్రమే మినహాయించాలని డీటీఎఫ్‌ విజ్ఞప్తి చేసింది. 2008 డీఎస్సీ కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులకు 12నెలల వేతనాలు మంజూరు చేయాలని కోరుతూ సీఎంకు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు పంపినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.

Updated Date - Mar 10 , 2026 | 04:11 AM