Share News

మావిగన్‌.. మారీచ!

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:36 AM

‘ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెది మరో దారి’ అని అంటారు. అమరావతిని మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు...

మావిగన్‌.. మారీచ!

‘ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెది మరో దారి’ అని అంటారు. అమరావతిని మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాజకీయ పార్టీలూ ఏకాభిప్రాయంతో ఆమోదించగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మాత్రం వ్యతిరేకించడం ఈ సామెతను గుర్తుచేస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన 12 ఏళ్ల తర్వాత మా రాజధాని ఇది అని అధికారికంగా చెప్పుకోవలసి రావడమే దౌర్భాగ్యం అనుకుంటే సదరు బిల్లును కూడా వ్యతిరేకించడాన్ని ఏమనుకోవాలి? పిచ్చికి మందు ఉంటుంది గానీ అసూయ, ద్వేషాలకు మందు ఉండదు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందుతున్న సమయంలోనే తాను మళ్లీ అధికారంలోకి వస్తే రాజధానిని మారుస్తానని ప్రకటించడంతో పాటు మచిలీపట్నం –విజయవాడ–గుంటూరును కలిపి ‘మావిగన్‌’ పేరిట రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చునని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనతో రాష్ట్ర ప్రజలే కాకుండా వైసీపీ నాయకులు కూడా నిర్ఘాంతపోయారు. అమరావతి అనే పేరు ఉచ్చరించడానికి కూడా జగన్‌రెడ్డి ఎందుకు ఇష్టపడటం లేదో తెలియదు. అమరావతిలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి రెండు లక్షల కోట్ల రూపాయలు అవసరమని, అంత డబ్బును ఒకేచోట ఖర్చు చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని ఆయన పాత పాటనే అందుకున్నారు. అమరావతి నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్‌ నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదు. రైతులు ఉదారంగా ఇచ్చిన భూములను అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుతోనే మౌలిక సదుపాయాలు, నిర్మాణాలు చేపడుతున్నారు. అమరావతి అనేది సెల్ఫ్‌ సస్టెయినబుల్‌ ప్రాజెక్టు అని తెలిసి కూడా గతంలో చేసిన దుష్ప్రచారాన్ని జగన్‌రెడ్డి మళ్లీ మొదలుపెట్టారు. ఇలాంటి అసంబద్ధ ఆలోచనలు, నిర్ణయాలు, చర్యల వల్ల గత ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నప్పటికీ తమ నాయకుడి వైఖరిలో మార్పు రాకపోవడాన్ని వైసీపీకి, జగన్‌కు మద్దతుగా నిలుస్తున్న బుద్ధిజీవులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో జరిగిందేదో జరిగిపోయింది, ఇకనైనా రాజధాని గురించి మాట్లాడకపోవడం మంచిది అని పలువురు సలహాలు కూడా ఇస్తున్నారు. అయినా ఇవేవీ పట్టని జగన్‌రెడ్డి ఇప్పుడు మూడు రాజధానులను పక్కనపెట్టి ‘మావిగన్‌’ అనే కొత్త పేరును తెరపైకి తెచ్చారు. ఈ పేరు చెబుతున్నప్పుడు ఆయన స్వరంలో అంతులేని వెటకారం ధ్వనించింది. అమరావతి విషయంలో జగన్‌రెడ్డి వైఖరి వెల్లడి అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అదృష్టవంతుడు అని మరోమారు రుజువైంది. జగన్‌రెడ్డి వంటి వ్యక్తి రాజకీయ ప్రత్యర్థిగా ఉండటాన్ని మించిన అదృష్టం ఏముంటుంది? 2024 ఎన్నికల్లో చంద్రబాబు బంపర్‌ మెజారిటీతో అధికారంలోకి రావడానికి కారణం ఏమిటి? తెలుగుదేశం–జనసేన–బీజేపీ ఒక కూటమిగా ఏర్పడటమా? లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రా? చంద్రబాబు జైలుకు వెళ్లడమా? లేక చంద్రబాబు రాజకీయ వ్యూహాలా?


ఇవేవీ కావు– అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండిన జగన్మోహన్‌రెడ్డి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి ఎలా వ్యవహరించకూడదో అలా వ్యవహరిస్తూ అరాచకాలను పెంచి పోషించడం ద్వారా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. 2019కి పూర్వం జగన్‌రెడ్డి ఎలాంటి వారో, ఆయన నైజం ఎటువంటిదో ప్రజలకు తెలియదు. దివంగత రాజశేఖరరెడ్డి కుమారుడిగా ఆయనను అభిమానించారు. జగన్‌రెడ్డిలో రాజశేఖరరెడ్డిని చూసుకున్నారు. ఈ కారణంగానే 2019 ఎన్నికల్లో 151 సీట్ల భారీ మెజారిటీని జగన్‌రెడ్డికి కట్టబెట్టారు. ఇక అప్పటి నుంచి జగన్‌రెడ్డి నిజస్వరూపం వెల్లడవుతూ వచ్చింది. ప్రజలకు ఆయన ఏమిటో బోధపడింది. కక్షలు, కార్పణ్యాలు, అసూయా ద్వేషాలతో ఐదేళ్లపాటు సాగించిన పాలనతో ప్రజలకు తత్వం బోధపడింది. ఫలితమే బంపర్‌ మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చింది. సరే జరిగిపోయిందేదో జరిగిపోయింది అని ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు ఆత్మపరిశీలనకు ఉపక్రమిస్తాయి. తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటాయి. సదరు పొరపాటు మళ్లీ జరగబోదని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాయి. జగన్‌రెడ్డి ఈ ప్రాథమిక సూత్రాన్ని కూడా పట్టించుకోవడం లేదు. రాజకీయాల్లో అయినా, మరెందులో అయినా వైఫల్యాలను గుణపాఠాలుగా మలచుకొని ఎదగడానికి ప్రయత్నించడం సహజం. అయితే తాను అనుకున్నదే నిజమని నమ్మే జగన్‌రెడ్డి మరో అభిప్రాయం వినడానికే ఇష్టపడరు. ఈ క్రమంలో హైహై నాయకా అనే భజనపరులే ఆయన చుట్టూ ఏర్పడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేకత ఆయన దృష్టికి వెళ్లకుండా పరదాలు కప్పారు. 2019 ఎన్నికలతో పోలిస్తే ప్రజల్లో జగన్‌కు మద్దతు పెరిగిందని నమ్మబలికారు. 2019లో దాదాపు యాభై శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్‌ బలం 55 శాతం దాటిందని తాము భ్రమించడమే కాకుండా జగన్‌రెడ్డిలోనూ భ్రమలు కల్పించారు. ప్రజలకు డబ్బు పంచితే గంపగుత్తగా ఓట్లు పడతాయని కాకి లెక్కలు వేసుకున్నారు. ఈ భజన బృందం మాటలు నమ్మిన జగన్‌రెడ్డి ‘వై నాట్‌ 175’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత డామిట్‌ కథ అడ్డం తిరిగింది అని తెలిసి కూడా నెపాన్ని ఈవీఎంలపై తోసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావస్తోంది. ఇంకేముందీ ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, మూడేళ్లు కళ్లు మూసుకుంటే జగన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారని చిడతలు కొట్టడం మొదలెట్టారు. జగన్‌ పర్యటనల సందర్భంగా కృత్రిమ హడావిడికి రూపకల్పన చేస్తున్నారు. ఎన్నికల్లో తమను ప్రజలు ఎందుకు తిరస్కరించారో తెలుసుకొనే ప్రయత్నం చేయకపోగా తాము మళ్లీ అధికారంలోకి వస్తే తమ పాలన మరింత భయానకంగా ఉంటుందని ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం మొదలెట్టారు.


అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలను ప్రజలు మరచిపోకుండా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. రప్పా రప్పా అంటూ కత్తులు, గొడ్డళ్లు చేపట్టి స్వైరవిహారం చేస్తున్నారు. ఈ చర్యలేవీ 2029లో అధికారంలోకి రావడానికి ఉపయోగపడవని తెలుసుకొనే ప్రయత్నం చేయడంలేదు. తద్వారా 2029లో కూడా మళ్లీ ప్రతిపక్షంలోనే కొనసాగడానికి దారులు వేసుకుంటున్నారు. జగన్‌రెడ్డి పందిని చూపి నంది అంటే అదే నిజమని, నందిని చూపి పంది అంటే కూడా అది నిజమని నమ్మేవాళ్లు వైసీపీలో పుష్కలంగా ఉన్నారు. ఆ పార్టీలో సొంత బుర్ర వాడుతున్న వాళ్ల సంఖ్య తగ్గిపోతోంది. వైసీపీ నాయకులకు తోడుగా పేటీఎం బ్యాచ్‌ ఉండనే ఉంది. జగన్‌రెడ్డి తాడేపల్లిలో ప్యాలెస్‌ కట్టుకుంటే అదే రాజధాని అని ప్రచారం చేశారు. ఛ ఛ అదేమీ కాదు.. మూడు రాజధానులు అంటే ఎగిరి గంతేశారు. ఇప్పుడు అది కూడా కాదు ‘మావిగన్‌’ అంటే ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. మెడకాయ మీద తలకాయ– ఆ తలకాయలో ఇంత గుజ్జు ఉన్న ఎవరైనా ‘మావిగన్‌’ అని జగన్‌రెడ్డి నోటివెంట వెలువడిన వికారాన్ని ఏవగించుకుంటారు. ఈ ‘మావిగన్‌’ ప్రతిపాదన తర్వాత ఇటీవలి కాలంలో ఎప్పుడూ చూడనంతగా జగన్‌రెడ్డిపై ట్రోలింగ్‌ జరగడాన్ని చూస్తున్నాం. జగన్‌ అండ్‌ కోను పిచ్చివాళ్ల సమూహంగా సోషల్‌ మీడియాలో చిత్రిస్తూ ట్రోలింగ్‌ జరిగింది. జగన్‌రెడ్డి రోత మీడియా సంగతి చెప్పే పనేలేదు. అందరి నోటా ‘మావిగన్‌’ మాటే అంటూ ఆత్మవంచనకు పాల్పడ్డారు. ఈ ఆలోచనే మేలు అని మేధావులు, ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారని నమ్మబలికించే ప్రయత్నం చేస్తున్నారు. మహా నగరాలతో ‘మావిగన్‌’ పోటీ పడుతుందని ప్రచారం కూడా మొదలెట్టారు. పార్టీ అధినేతలు నోరు జారినా, ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనలు వారి నోటి వెంట వెలువడినా అదెలా సాధ్యమని వారించిన నాయకులను, సలహాదారులను ఎందరినో చూశాం. ఒక్క జగన్‌రెడ్డి విషయంలోనే ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. తనతో విభేదించే వారిని జగన్‌రెడ్డి ఇష్టపడరేమో తెలియదు. లేదా సొంత బుర్రతో ఆలోచించడాన్ని ఆ పార్టీ నేతలు మరచిపోయారేమో తెలియదు. బుద్ధి, జ్ఞానం ఏ మాత్రం ఉన్నా రాజధాని విషయంలో తలదూర్చడం ఎందుకు అని సలహా ఇవ్వాలి. అలా కాకుండా ‘మావిగన్‌’ అనే పిచ్చి ప్రతిపాదనను సమర్థించాలనుకోవడం చూస్తే జగన్‌రెడ్డి చుట్టూ అనుకూల శత్రువులు దడి కట్టారా? అన్న అనుమానం కలుగుతుంది.

తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా..

రాజ్యాంగంలో రాష్ర్టాలకు రాజధాని అనే పదం లేదని జగన్‌ తరచూ అంటూ ఉంటారు. నిజమే అనుకుందాం. అలా అయితే మన దేశంలో ప్రతి రాష్ర్టానికీ రాజధాని ఎందుకు ఉంది? దక్షిణాది రాష్ర్టాలు ఆర్థికంగా బలంగా ఉన్నాయంటే వాటికి మహా నగరాలు ఉండటమే కారణం. తెలంగాణనే తీసుకుందాం. హైదరాబాద్‌ మహా నగరం నుంచి వస్తున్న ఆదాయంతోనే కదా రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయగలుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుతం విశాఖపట్నం నుంచి అధికంగా ఆదాయం వస్తోంది. అమరావతి మహా నగరంగా అభివృద్ధి చెందితే రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. రైతులు ఇచ్చిన భూములను అభివృద్ధి చేసి, అందులో కొంత భాగాన్ని విక్రయించి ఆ డబ్బుతో మౌలిక వసతులు కల్పించబోతున్నారు. చంద్రబాబు కలలు కంటున్న మహా నగరంగా అమరావతి అభివృద్ధి చెందడానికి ఒకటి రెండు తరాలు పట్టవచ్చు. హైదరాబాద్‌ ఇప్పటి రూపం సంతరించుకోవడానికి మూడు దశాబ్దాలకు పైగా పట్టింది. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. జగన్‌రెడ్డిలా సంకుచితంగా ఆలోచించేవారు అభివృద్ధి గురించి ఆలోచించలేరు. తిన్నామా– పడుకున్నామా– తెల్లారిందా అన్నట్టుగా వారి ఆలోచనలు సాగుతాయి. జగన్‌ అమరావతిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియదు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలూ అమరావతి బిల్లుకు మద్దతు తెలిపినప్పుడు వైసీపీ మాత్రమే వ్యతిరేకించడం ఎందుకు? ఏమిటీ విపరీత వైఖరి? మేం అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ బిల్లును మాత్రం వ్యతిరేకిస్తున్నామని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లోక్‌సభలో చెప్పుకొచ్చారు. రాజ్యసభలో ఆ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి కూడా ఇదే మాట సెలవిచ్చారు. ఇదెలా ఉందంటే, నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు సమ్మతమే కానీ తాళి మాత్రం కట్టను అన్నట్టుగా ఉంది. పనిలో పనిగా రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి వైసీపీ నాయకులు మొసలి కన్నీరు కార్చారు. అధికారంలో ఉన్నప్పుడు భూములు ఇచ్చిన రైతులను వేధించడం, మహిళలను నీచమైన మాటలతో అవమానించడం, పోలీసులతో దౌర్జన్యాలు చేయించడం రాష్ట్ర ప్రజలు మరచిపోలేదు. నేను మళ్లీ అధికారంలోకి వస్తే రాజధానిని మార్చలేనా? అని జగన్‌రెడ్డి సవాలు విసురుతూనే ఉన్నారు. ఇంత జరిగాక కూడా ఈ మాటలు ఎలా అనగలిగారో తెలియదు! ‘మావిగన్‌’ వంటి పిచ్చి ప్రతిపాదనకు అనుకూలంగా ఎలా ప్రచారం చేసుకోవాలని అనిపిస్తోందో తెలియదు! నాకు ఒక రాజకీయ పార్టీ ఉంది, ఆ పార్టీ తరఫున ప్రచారం చేసుకోవడానికి సొంత మీడియా ఉంది, కూలి మీడియాను కూడా సమకూర్చుకున్నాం. నేనేం చేసినా నన్ను సమర్థించే ఒక వర్గం ప్రజలు ఉన్నారు.. అని జగన్‌రెడ్డి భావిస్తున్నారు గానీ 2024లో ఓటమిని ఇవేవీ అడ్డుకోలేదని మరచిపోతున్నారు.


మభ్యపెట్టడం మళ్లీ.. మళ్లీనా?

రాజధాని అమరావతి వ్యవహారం తెర మీదకు వచ్చిన తర్వాత జగన్‌ అండ్‌ కో పోకడలను గమనిస్తే వాళ్లంతా ఫూల్స్‌ ప్యారడైజ్‌లో విహరిస్తున్నట్టుగా ఉంది. అవినీతి ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్నప్పటికీ, సొంత బాబాయ్‌ హత్య ఉదంతం తర్వాత కూడా అధికారంలోకి రాగలిగాను కదా? ఇకపై కూడా ప్రజలను మభ్యపెడుతూ అధికారంలోకి రాగలను అని జగన్‌రెడ్డి భావిస్తూ ఉండవచ్చు. అయితే అప్పుడు జగన్‌ గురించి ప్రజలకు తెలియదు. గుడ్డిగా నమ్మారు. ఇప్పుడు అలా కాదే! ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పనిచేసి, ఓటమి తర్వాత ఇప్పుడు కూడా జగన్‌ వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలకు ఆయనపై పూర్తి అవగాహన ఏర్పడింది. మళ్లీ మళ్లీ మోసపోవడానికి ప్రజలు గొర్రెలు కాదని భావిద్దాం. ‘మావిగన్‌’ దెబ్బతో తమ నాయకుడు కామెడీ పీస్‌గా మారిపోయారని వైసీపీ నాయకులు కొందరు తలలు పట్టుకుంటున్నారు. అయితే జగన్‌రెడ్డి వద్దకు వెళ్లి తమ మనసులోని మాట చెప్పే సాహసం వారు చేయలేకపోతున్నారు. అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అని పార్లమెంటులో చట్టం చేయాల్సిన అగత్యం ఏర్పడటానికి జగన్‌రెడ్డి మాత్రమే కారకుడని ప్రజలందరికీ తెలిసిపోయింది. రాష్ట్రం ఏర్పడిన పుష్కరం తర్వాత కూడా రాజధాని ఏది? అని మాట్లాడుకోవలసి రావడాన్ని సామాన్య ప్రజలు సైతం ఇష్టపడటం లేదు. గతంలో జగన్‌రెడ్డి చేసిన ప్రచారాన్ని నమ్మి అమరావతిని వ్యతిరేకించినవాళ్లు కూడా ఇప్పుడు న్యూట్రల్‌గా మారిపోయారు. ఇక ఇప్పుడు జగన్‌ చుట్టూ చేరి చిడతలు కొట్టే వారితో పాటు పేటీఎం బ్యాచ్‌ మాత్రమే మిగిలారు. వీరిలో కూడా కొందరికి జగన్‌ పోకడ నచ్చడం లేదు. ‘మావిగన్‌’ ప్రతిపాదన హాస్యాస్పదంగా మారింది. ఈ ప్రతిపాదనను ప్రజల్లోకి తీసుకెళితే ఏవగించుకుంటారని వైసీపీ నాయకులకు కూడా అర్థమైంది. ఈ కారణంగా ఇందులో అంతుపట్టని వ్యూహం దాగి ఉందని, ఆ వ్యూహం ఏమిటో త్వరలో వెల్లడవుతుందని ఎక్స్‌ వేదికగా వైసీపీ చెప్పుకొంటోంది. కనీసం పార్టీ శ్రేణులనైనా నమ్మించడానికి అలా పాట్లు పడుతోంది. రాజ్యసభలో అమరావతి బిల్లుకు మద్దతు ఇవ్వవలసిందిగా జగన్‌రెడ్డి ఆప్తమిత్రులైన కేసీఆర్‌, కేటీఆర్‌ కూడా తమ పార్టీ ఎంపీలకు సూచించడం ఈ మొత్తం ఎపిసోడ్‌లో హైలైట్‌. మొత్తంమీద జాతీయ రాజకీయాలలో జగన్‌రెడ్డి ఏకాకిగా మిగిలారు. అమరావతి బిల్లును వ్యతిరేకించడం వల్ల మిగతా రాజకీయ పార్టీలకు కూడా జగన్‌ అంటే ఏమిటో తెలిసిపోయింది. ఈ విషయంలో రహస్య మిత్రులు కూడా జగన్‌కు అండగా నిలవకపోవడం గమనార్హం.


తక్షణ కార్యాచరణ ముఖ్యం!

లక్ష్యం మంచిది అయినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడానికి జాప్యం జరిగినా వెనకడుగు వేయకూడదు అంటారు. రాజధాని అమరావతి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం గొప్పది. ఆశించిన విధంగా అమరావతి నిర్మాణానికి బలమైన పునాదులు వేయగలిగితే చంద్రబాబు చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతారు. అమరావతి బిల్లును ఏకాభిప్రాయంతో ఆమోదింపజేసుకోవడంలో తెర వెనుక ఆయన కృషి ఉంది. ‘మావిగన్‌’ వంటి చవకబారు ఆలోచనలు జగన్‌ విజన్‌ అయితే, అమరావతి వంటి గ్రీన్‌ఫీల్డ్‌ సిటీ చంద్రబాబు విజన్‌. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీకి శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ జనావాసాలు లేవు. ఇప్పుడు అదే ప్రాంతం సైబరాబాద్‌గా అభివృద్ధి చెంది జనావాసాలతో కిటకిటలాడుతోంది. సైబరాబాద్‌ అభివృద్ధి దాదాపు సంపూర్ణం కావడంతో ఫ్యూచర్‌ సిటీ పురుడు పోసుకుంది. అమరావతి నగరాన్ని ఈ తరం చూడగలదా? అన్న సందేహం కలగడం సహజం. ఈ తరం కాకపోతే వచ్చే తరం చూస్తుంది. విత్తు నాటిన వెంటనే ఫలాలు రావు కదా? ప్రస్తుతానికి రాజధానిగా అమరావతి అవతరించడానికి చట్టపరమైన అవరోధాలు తొలగిపోయాయి. అయితే జగన్‌రెడ్డి రూపంలో ఎప్పుడైనా ఆటంకాలు ఏర్పడవచ్చు. అమరావతిని రాజధాని కాకుండా చేయాలని జగన్‌రెడ్డి అనుకుంటున్నప్పటికీ పార్లమెంటులో ఇప్పుడు అమరావతి బిల్లును సమర్థించిన పార్టీలు భవిష్యత్తులో సహకరించక పోవచ్చు. అయితే జగన్‌రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి అంటూ వస్తే రాజధానిగా అమరావతిని ఎదగకుండా అడ్డుకొనే ప్రయత్నం కచ్చితంగా చేస్తారు. అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. అమరావతి అభివృద్ధి అప్రతిహతంగా కొనసాగాలంటే ఇటువంటి వక్ర బుద్ధి ఉన్న వారికి అధికారం చిక్కకుండా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుపైనే ఉంది. కూటమి ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల వ్యవధి ఉంది. ఈ మూడేళ్లలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలను పూర్తిచేయడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థలను అమరావతిలో ఏర్పాటుచేయడానికి చంద్రబాబు కృషి చేయాలి. కంపెనీలు ఏర్పడి జనసాంద్రత పెరిగితే కాలనీలు అభివృద్ధి చెందుతాయి. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంలో అడుగులు వేగంగా పడినప్పుడే ఇది సాధ్యం. రాజధాని అమరావతి కార్యాలయాలు, సంస్థలు, జనంతో కళకళలాడుతూ ఉంటే జగన్‌రెడ్డి వంటి వారు అధికారంలోకి వచ్చినా ఏం చేయలేరు. 2029 తర్వాత అమరావతి అభివృద్ధి ఆటో మోడ్‌లో జరిగేలా చంద్రబాబు చర్యలు తీసుకోవాలి. అమరావతి బిల్లు పాస్‌ అయిందని సంబరాలు చేసుకోవడం కాదు.. ఇల్లు అలకగానే పండగ కాదని గుర్తించాలి. ఇకపై అమరావతిలో రెట్టింపు వేగంతో పనులు జరగాలి.


అమరావతి ప్రజా రాజధాని అన్న భావన వ్యాపించాలి. అప్పుడే మారీచులు, సుబాహులకు చోటు ఉండదు. ఇప్పటివరకూ జరిగింది ఒక ఎత్తు.. ఇకపై జరగాల్సింది మరో ఎత్తు. అమరావతిపై జగన్‌రెడ్డి పగబట్టారని మరువరాదు. అసూయా ద్వేషంతో రగిలిపోతున్న ఆయనకు ఏ అవకాశం దక్కకుండా అమరావతి అభివృద్ధికి చంద్రబాబు పకడ్బందీ వ్యూహం ఒకటి రూపొందించి అమలు చేయాలి. చంద్రబాబు కలలు కంటున్నట్టు అమరావతి రూపుదిద్దుకుంటుందో లేదో ఇప్పుడే చెప్పలేం గానీ, ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌కు ఒక రాజధాని అంటూ నిర్ధారణ అయింది. ఇదొక చరిత్రాత్మక సన్నివేశం. అదే సమయంలో ఒక వ్యక్తి కారణంగా ఒక రాష్ర్టానికి ఫలానా ప్రాంతం రాజధాని అని పార్లమెంటు చట్టం చేయవలసి రావడం బాధాకరం. దేవతల రాజధాని అమరావతి వలె ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి కూడా అజరామరంగా వర్ధిల్లాలని కోరుకుందాం. తమ రాజధానిని అభివృద్ధి చేసుకొనే ప్రక్రియలో ప్రజలు కూడా ప్రభుత్వంతో చేతులు కలపాలి. మారీచుల దుష్ట పన్నాగాలను ప్రతిఘటించి అందమైన, అద్భుతమైన రాజధానిని నిర్మించుకొని తలెత్తుకు తిరుగుతారని ఆశిద్దాం! బెస్టాఫ్‌ లక్‌ టు ఆంధ్రప్రదేశ్‌ పీపుల్‌!

ఆర్కే

ఈ వార్తలనూ చదవండి:

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

Updated Date - Apr 05 , 2026 | 12:36 AM