Share News

కన్నకొడుకులను చంపి తల్లి ఆత్మహత్య !

ABN , Publish Date - Apr 01 , 2026 | 04:22 AM

తమ వివాహ బంధాన్ని మరిచి భర్త రెండో పెళ్లి చేసుకున్నాడనే కారణంతో మనస్తాపం చెందిన ఓ మహిళ తీవ్ర నిర్ణయం తీసుకుంది.

కన్నకొడుకులను చంపి తల్లి ఆత్మహత్య !

  • భర్త రెండో పెళ్లితో మనస్తాపమే కారణం

  • పిల్లలకు ఉరేసి ఆపై ఉరేసుకొని బలవన్మరణం

  • హైదరాబాద్‌లోని కైత్లాపూర్‌లో ఘటన

  • చంపేస్తానని భర్త బెదిరిస్తున్నాడని సోదరుడికి వీడియో.. మృతురాలి ఫోన్‌లో గుర్తించిన పోలీసులు

హైదర్‌నగర్‌/కూకట్‌పల్లి, చెన్నారావుపేట, మార్చి 31(ఆంధ్రజ్యోతి): తమ వివాహ బంధాన్ని మరిచి భర్త రెండో పెళ్లి చేసుకున్నాడనే కారణంతో మనస్తాపం చెందిన ఓ మహిళ తీవ్ర నిర్ణయం తీసుకుంది. భర్త చేసిన పనిని తట్టుకోలేక ఈ లోకంలో ఉండలేక.. అల్లారుముద్దుగా పెంచుకున్న తన ఇద్దరు కుమారులకు ముందుగా ఉరి వేసింది. ఆపై తాను కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగింది. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండాకు చెందిన బానోజు ప్రవీణ్‌కుమార్‌, చంద్రపేట తండాకు చెందిన స్రవంతి(28)కి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ప్రవీణ్‌, స్రవంతి దంపతులకు కార్తీక్‌ (10) కౌశిక్‌ (8) అనే కుమారులు ఉన్నారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వచ్చిన ఈ దంపతులు కూకట్‌పల్లి పరిధిలోని కైత్లాపూర్‌ రాఘవేంద్రకాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రవీణ్‌ డ్రైవర్‌గా పనిచేస్తూనే కోర్‌కటింగ్‌ సివిల్‌ పనులకు కూడా వెళుతుంటాడు. కొన్నాళ్లపాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే, ప్రవీణ్‌ రెండేళ్ల క్రితం చెన్నారావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహేశ్వరి (సోనీ) అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ప్రవీణ్‌- స్రవంతి దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. కొన్నాళ్ల కాపురం తర్వాత సదరు యువతి ప్రవీణ్‌ను వదిలి వెళ్లిపోయింది. ప్రస్తుతం ప్రవీణ్‌.. తన మొదటి భార్య స్రవంతితోనే ఉంటున్నాడు. అయితే, దంపతుల మధ్య గొడవలు పెరగ్గా... స్రవంతి పిల్లలిద్దరినీ తీసుకొని నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త ప్రవీణ్‌తో జరుగుతున్న గొడవలను తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి ప్రవీణ్‌ను మందలించారు. అనంతరం స్రవంతి, పిల్లలను తీసుకొని ప్రవీణ్‌ సోమవారం మధ్యాహ్నానికి హైదరాబాద్‌ చేరుకున్నాడు. అయితే, మంగళవారం ఉదయం భార్యభర్తల మధ్య మరోసారి గొడవ తలెత్తింది. అనంతరం డ్యూటీకి వెళ్లిన ప్రవీణ్‌ మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చేసరికి స్రవంతి, ఇద్దరు పిల్లలతో సహా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకొని ఉంది. విషయం తెలిసి ఘటనా స్థలికి చేరుకున్న బాలానగర్‌ ఏసీపీ నరే్‌షరెడ్డి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అయితే, ప్రవీణ్‌ తనని చంపేస్తానని బెదిరిస్తున్నాడని స్రవంతి తన సోదరుడికి పంపిన వీడియోను పోలీసులు స్రవంతి మొబైల్‌ ఫోన్‌లో గుర్తించారు. కాగా, పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలిసి ఆగ్రహించిన స్రవంతి కుటుంబసభ్యులు బోడ మాణక్యం తండాకు చేరుకొని ప్రవీణ్‌ ఇంటికి నిప్పు పెట్టినట్టు సమాచారం.

Updated Date - Apr 01 , 2026 | 04:22 AM