Share News

చట్టబద్ధం.. కట్టుదిట్టం!

ABN , Publish Date - Apr 01 , 2026 | 04:40 AM

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ‘అమరావతి’తో ఆటలు కుదరవిక! ‘అమరావతే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని’ అనే చట్టబద్ధమైన స్పష్టత ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ‘రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని.

చట్టబద్ధం.. కట్టుదిట్టం!

  • ఏపీ రాజధానిపై చట్టబద్ధమైన స్పష్టత.. నేడే లోక్‌సభలో ‘అమరావతి’ బిల్లు

  • రేపు రాజ్యసభలో ఆమోద ముద్ర!

  • రాష్ట్రపతి ఆమోదంతో ‘నోటిఫికేషన్‌’!

  • అసెంబ్లీ తీర్మానం మేరకు కదిలిన కేంద్రం

  • 2024 జూన్‌ 2 నుంచే రాజధానిగా ‘అమరావతి’

  • రాజధాని పరిధిపైనా బిల్లులో స్పష్టత

  • సీఆర్డీయే నోటిఫై చేసిన ప్రాంతమంతా రాజధానే

(న్యూఢిల్లీ/అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ‘అమరావతి’తో ఆటలు కుదరవిక! ‘అమరావతే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని’ అనే చట్టబద్ధమైన స్పష్టత ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ‘రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని. ఆ తర్వాత తెలంగాణకు హైదరాబాద్‌ రాజధానిగా కొనసాగుతుంది. మరి... ఆంధ్రప్రదేశ్‌ మాటేమిటి?’ అనే ప్రశ్నకు... ‘అమరావతి’ అనే సమాధానం పార్లమెంటు వేదికగా వినిపించనుంది. 2024 జూన్‌ 2వ తేదీ నుంచే ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించేలా... ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు - 2026ను బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంగళవారం రూపొందించిన లోక్‌సభ బిజినెస్‌ జాబితాలో ఈ బిల్లును చేర్చింది. బుధవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా లేదా హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ ఈ బిల్లును ప్రవేశపెడతారు. బుధవారమే లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందే అవకాశముంది. ఆ తర్వాత... గురువారం రాజ్యసభలోనూ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందుతారు. ఆపై... రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టబద్ధమైన రక్షణ కల్పిస్తూ నోటిఫికేషన్‌ వెలువడనుంది.


ఆగమేఘాల మీద...

వైసీపీ అధికారంలోకి రాగానే అమరావతిని అటకెక్కించి, మూడు ముక్కలాటకు తెరలేపిన సంగతి తెలిసిందే. దీంతో... కూటమి ప్రభుత్వం అమరావతికి పార్లమెంటు ద్వారా చట్టబద్ధమైన రక్షణ, స్పష్టత కల్పించాలని భావించింది. దీనిపై అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. అసెంబ్లీ తీర్మానం ఆధారంగా పార్లమెంటులో చట్టం చేస్తే... అది మరింత బలంగా ఉంటుందని కేంద్రం సూచించడంతో శనివారం (మార్చి 28న) అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. అమరావతిపై తీర్మానాన్ని ఆమోదించింది. అప్పటికప్పుడు కేంద్రానికి పంపింది. ఆ మేరకు... బుధవారం ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది.


బిల్లులో ఏముందంటే..

2014లో ఆమోదించిన విభజన చట్టంలోని సెక్షన్‌ 5, సబ్‌సెక్షన్‌ 2లో... ‘ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఇప్పుడు ఇక్కడ ‘అమరావతి’ని చేర్చి... ‘ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి నూతన రాజధానిగా ఉంటుంది’ అని మార్చుతారు. అంటే... ‘రాష్ట్ర విభజన అనంతరం పదేళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత, ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధాని’ అనే స్పష్టత ఇవ్వనున్నారు. సవరణ బిల్లులో లక్ష్యాలు, కారణాలను (స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ అబ్జెక్ట్స్‌ అండ్‌ రీజన్స్‌) స్పష్టంగా వివరించారు. ‘‘పునర్‌ వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఉంటుందని నాటి చట్టంలో పేర్కొన్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం తగిన పరిశీలన, సంప్రదింపుల అనంతరం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తించి నోటిఫై చేసింది. ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధానిగా అమరావతి పేరును చేర్చుతూ సదరు చట్టంలోని సెక్షన్‌ 5ను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ ఏపీ శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తదనుగుణంగా... ఏపీ రాజధాని విషయంలో చట్టబద్ధమైన స్పష్టతను ఇస్తూ నాటి చట్టంలోని సెక్షన్‌ 5 లోని సబ్‌సెక్షన్‌ 2ను సవరించాలని ప్రతిపాదించడమైనది. దీని ద్వారా 2024 జూన్‌ 2 నుంచి అమరావతిని రాష్ట్ర రాజధానిగా చట్టం ద్వారా గుర్తిస్తాం’’ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేరిట వెలువడిన ఈ బిల్లులో పేర్కొన్నారు.


పరిధిపైనా స్పష్టత...

‘అమరావతే రాజధాని’ అని ప్రకటించడంతోపాటు... ‘అమరావతి’ పరిధిపైనా ఈ సవరణ బిల్లులో స్పష్టత ఇచ్చారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) రాజధానిగా నోటిపై చేసిన ప్రాంతమంతా అమరావతి పరిధిలోకి వస్తుందని బిల్లులో తెలిపారు. రాజధాని పురోగతిని దృష్టిలో పెట్టుకుని... భవిష్యత్తులో సీఆర్‌డీయే పరిధిని విస్తరించినట్లయితే ఆ ప్రాంతం కూడా ‘అమరావతి’ పరిధిలోకే వచ్చేలా ఈ జాగ్రత్త తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రెండో దశ భూ సమీకరణకు శ్రీకారం చుట్టింది. సీఆర్‌డీఏ పరిధిని విస్తరించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో ‘అమరావతి’కి నిర్దిష్టమైన పరిమితులు విధించకుండా... సీఆర్‌డీఏ నోటిఫై చేసిన ప్రాంతమంతా రాజధానిగానే పరిగణించేలా సవరణ చేస్తున్నారు. బిల్లులోని వివరణ-2లో ఇదే అంశాన్ని పొందుపరిచారు. లోక్‌సభలో ‘అమరావతి’ బిల్లుపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, లోక్‌సభలో టీడీపీ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడనున్నారు.

Updated Date - Apr 01 , 2026 | 05:48 AM