ఆలయంపై నాలుక మడతేసి..
ABN , Publish Date - Apr 01 , 2026 | 06:22 AM
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని పెదపేట రామాలయం సాక్షిగా జగన్ రోత పత్రిక నాలుక మడతేసింది. ఆల య దుస్థితిపై రాతలు రాసింది ఆ పత్రికే.
జగన్ రోత పత్రిక ‘దొంగ’ వైఖరి
ఆకివీడు రామాలయ దుస్థితిపై కథనం.. పునరుద్ధరణకు వినతి
అక్కడకు వెళ్లిన రఘురామపై కొందరి దాడి
ఆ వెంటనే పంథా మార్చి విషపు రాతలు.. దళిత క్రైస్తవులను రెచ్చగొట్టే యత్నం
ఒక పత్రిక - రెండు నాలుకలంటూ... సోషల్ మీడియాలో ట్రోలింగ్
భీమవరం, ఆకివీడు, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని పెదపేట రామాలయం సాక్షిగా జగన్ రోత పత్రిక నాలుక మడతేసింది. ఆల య దుస్థితిపై రాతలు రాసింది ఆ పత్రికే. స్థానిక భక్తుల వినతిపై అక్కడకు వెళ్లి, ఆలయ పునరుద్ధరణపై హామీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై ఇప్పుడు విషం కక్కుతోంది కూడా ఆ పత్రికే. ఆకివీడు అలజడిలో చాలా స్పష్టంగా తన రెండు నాల్కుల ధోరణి బయటపెట్టుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. ఈ నెల ఏడో తేదీన ‘శిథిలావస్థలో పురాతన రామాలయం’ అంటూ జగన్ రోతపత్రిక ఒక కథనం రాసింది. ‘రామయ్యా ఇటు చూడవయ్యా’ అంటూ.. రాసిన ఆ కథనంలో శ్రీరామునికి నిలువ నీడ కరువయిందంటూ కన్నీరు పెట్టించేలా రాతలు రాసింది. అయోధ్య రామాలయం వెలిగిపోతుండగా, ఎన్నో ప్రాచీన రామాలయాలు శిథిలమైపోతున్నాయని రాసుకొచ్చింది. సనాతన వాదులు దీనిని కాపాడాలంటూ కోరింది. పెదపేట రామాలయంలో ఆకివీడు పట్టణ పరిసర ప్రాంతాల భక్తులు పూజలు చేస్తూ వస్తున్నారు. ఓ వైపు పత్రికలో కథనం.. మరోవైపు స్థానికంగా భక్తుల విన్నపంతో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ ఆలయాన్ని సందర్శించారు. స్థానిక భక్తులు ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరగా, ఆయన అంగీకరించారు. దీనిపై ఆ రోజు పెదపేటకు చెందిన దళిత క్రైస్తవులు అభ్యంతరం తెలిపారు. క్రైస్తవులు ఉండే చోట రామాలయం నిర్మిస్తే ఘర్షణలు జరుగుతాయని అన్నారు. ఇదే క్రమంలో అక్కడ గ్రామ దేవత ఆలయం నిర్మించాలంటూ కొందరు స్థానిక దళితులు కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఇదిలా ఉంటే శ్రీరామ నవమి రోజున శ్రీరాముని దర్శించుకోవడానికి డిప్యూటీ స్పీకర్ మరోసారి అక్కడకు వెళ్లారు.
అప్పటికే అక్కడ బయట నుంచి వచ్చిన వ్యక్తులు, ఆందోళనకారులు కర్రలు, కత్తులు, పెట్రోల్ సీసాలతో సిద్ధంగా ఉన్నారు. ఆలయంలోకి రఘురామను వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల సహకారంతో ఆయన రాముని విగ్రహానికి పూలమాలలు వేసి కాన్వాయ్‌లో వెళ్లిపోయారు. ఈ సమయంలో కొందరు క్రైస్తవ యువకులు రాళ్లదాడి చేశారు. అక్కడి జనసేన, ఇతర నాయకులపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, శ్రీరాముని ఆలయం గురించి కథనం రాసిన జగన్ రోతపత్రిక ఈ దాడి తర్వాత తన పంథాను మార్చుకుంది. భక్తులపై అక్కడ స్థానికులు, బయట వ్యక్తులు దాడి చేసిన విషయంపై కనీసం స్పందించలేదు. డిప్యూటీ స్పీకర్ రెచ్చగొట్టి ఆలయం వద్ద దాడులు జరిగేలా చేస్తున్నారని, స్థానిక దళితులపై కేసులు కట్టిస్తున్నారంటూ రఘురామపై తప్పును మోపే ప్రయత్నం చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ కథనాలు వైరల్ అవుతున్నాయి. ‘చూడండి సాక్షి పత్రిక రెండు నాల్కల ధోరణి’ అంటూ పలువురు సోషల్ మీడియాలో జగన్ రోత పత్రికను ట్రోల్ చేస్తున్నారు.
మరో తొమ్మిది మంది అరెస్టు
ఆకివీడు పెదపేట రామాలయం వివాదంలో మరో 9మందిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీరామనవమి రోజున పెదపేటకు వెళ్లిన రఘురామకృష్ణరాజు, కూటమి నేతలు, భక్తులపై కొందరు దాడులు చేశారు. ఈ కేసులో 57మందిని నిందితులుగా గుర్తించి కేసులు నమోదు చేశారు. శ్రీరామనవమి రోజున 21 మంది, సోమవారం పది మంది, మంగళవారం 9మందితో కలిపి మొత్తం 40 మందిని అరెస్టు చేశారు. మరోవైపు, పెదపేట వెళ్లేందుకు ప్రయత్నించిన కేవీపీఎస్, సీపీఎం నాయకులను పొలీసులు అడ్డుకున్నారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్రా మాల్యాద్రి, సీపీఎం పట్టణ కార్యదర్శి కె.తవిటినాయుడు, డీవైఎ్‌ఫఐ నాయకులు బొడ్డుపల్లి రాంబాబు, డోకల రవితేజ, ఐద్వా నాయకురాలు డోకల లక్ష్మిని బైండోవర్ చేశారు. కాగా, బయట వ్యక్తుల ప్రోత్సాహంతోనే ఆలయం దగ్గర తరచూ అల్లర్లు జరుగుతున్నాయని పలువురు విలేకరులకు తెలిపారు. ‘‘మా వాళ్లు చేసింది తప్పే. వారిని రఘురామ క్షమించాలి. వారితో మాట్లాడడానికి సమయం ఇవ్వాలి. అరెస్టు చేసి జైల్లో పెట్టించిన మావాళ్లను విడిచిపెట్టాలి’’ అని పెదపేట వాసులైన బొండాడ వెంకటేశ్వరరావు, దరిశే శ్రీను, దండు సువర్ణరాజు, ఏనేపల్లి నాగేశ్వరరావు, గూడపాటి పమ్ము, జ్యోతి, రాధిక, మహంకాళి తదితరులు అభ్యర్థించారు.