Vemulawada: మతి ఉండే నా తలరాత ఇలా రాశావా ?
ABN , Publish Date - Jul 07 , 2025 | 03:15 AM
మతి, తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా.. అదే నీ కొడుకుకు అలా రాయలేదే.. మేము కొడుకులం కాదా..?’’ అని దేవుడిని ఉద్దేశిస్తూ లేఖ రాసి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

దేవుడిని ఉద్దేశించి లేఖ రాసి వేములవాడలో యువకుడి ఆత్మహత్య
వేములవాడ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ‘‘మతి, తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా.. అదే నీ కొడుకుకు అలా రాయలేదే.. మేము కొడుకులం కాదా..?’’ అని దేవుడిని ఉద్దేశిస్తూ లేఖ రాసి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన దీటి రోహిత్(25) జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు ఆదివారం ఉదయం గుర్తించారు. రోహిత్ తండ్రి దీటి వేణుగోపాల్ స్థానికంగా ఎలకా్ట్రనిక్స్, ఫర్నిచర్ దుకాణం నిర్వహిస్తుంటారు. ఎమ్మెస్సీ పూర్తి చేసి ప్రస్తుతం బీఎడ్ చదువుతున్న రోహిత్.. డాక్టర్ కావాలనే తన కల నెరవేరకపోవడంతో ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేవాడని బంధువులు చెబుతున్నారు.
ఆత్మహత్య విషయం తెలిసి ఘటనా స్థలికి చేరుకున్న వేములవాడ పోలీసులు.. రోహిత్ రాసినట్టుగా భావిస్తున్న ఓ లేఖను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దేవుళ్లను ప్రార్థిస్తూ లేఖను మొదలుపెట్టిన రోహిత్.. ఓ మంచి ఆత్మహత్య లేఖ రాయాలనే తన కోరిక నెరవేరిందని అందులో పేర్కొన్నాడు. మరణం కంటే జీవించడంలో ఉన్న బాధ అధికమని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనకు మరో జన్మ వద్దని అందులో రాశాడు. తన జీవితాన్ని జగన్మాతకు అర్పిస్తున్నానని, తన మృతదేహాన్ని కాశీలో దహనం చేయాలనేదే తన చివరి కోరికని పేర్కొన్నాడు.