Farmer Suicide: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ABN , Publish Date - Aug 02 , 2025 | 05:33 AM
అప్పుల బాధ తాళలేక ఓ యువ రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

జగదేవ్‌పూర్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): అప్పుల బాధ తాళలేక ఓ యువ రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన బూదరి నరేందర్(34) తన 18 గుంటల భూమితో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పొలం పనులు లేని సమయంలో గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలోని ఓ గోదాంలో హమాలీ పని చేస్తున్నాడు.
కుటుంబ పోషణ, వ్యవసాయానికి చేసిన అప్పులు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో నరేందర్ తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. ఇటీవల 8 గుంటల భూమిని అమ్మి కొన్ని అప్పులు కట్టాడు. అయినప్పటికీ బాకీలు తీరలేదు. శుక్రవారం గ్రామంలో పంట చిట్టి ఉండటంతో చిట్టికి డబ్బు కట్టలేక తీవ్ర మనస్తాపం చెంది పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. నరేందర్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.