Suryapet: మృత్యువు మిగిల్చిన విషాదం
ABN , Publish Date - Jul 05 , 2025 | 05:47 AM
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం గట్టికల్‌లోని ఓ కుటుంబానికి మృత్యువు పెను విషాదాన్ని మిగిల్చింది. అనారోగ్యంతో బాధపడుతూ ఆ ఇంటి పెద్ద, తండ్రి మరణించగా..

అనారోగ్యంతో తండ్రి.. రోడ్డు ప్రమాదంలో కొడుకు, అల్లుడు
సూర్యాపేట జిల్లాలోని ఓ ఇంట్లో ముగ్గురి మృతి
ఆత్మకూరు(ఎస్), జూలై 4(ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం గట్టికల్‌లోని ఓ కుటుంబానికి మృత్యువు పెను విషాదాన్ని మిగిల్చింది. అనారోగ్యంతో బాధపడుతూ ఆ ఇంటి పెద్ద, తండ్రి మరణించగా.. అంత్యక్రియలకు అవసరమైన సామగ్రి కొనుగోలుకు వెళ్లిన అతని కొడుకు, అల్లుడు రోడ్డు ప్రమాదానికి బలయ్యారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రానికి ఆ కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గట్టికల్ గ్రామానికి చెందిన మోరపాక భిక్షం అనారోగ్యం వల్ల గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. భిక్షం అంత్యక్రియలను శుక్రవారం నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. భిక్షం మరణవార్త తెలిసి అతని అల్లుడు మోనంది ఐలయ్య(55) గురువారం రాత్రి సూర్యాపేట నుంచి గట్టికల్ వచ్చాడు.
అంత్యక్రియలకు అవసరమైన సామగ్రి కొనుగోలు కోసం ఐలయ్య, భిక్షం మూడో కుమారుడు రాములు(45) కలిసి గురువారం రాత్రి బైక్‌పై నెమ్మికల్ వైపు వెళ్లారు. అదే సమయంలో గట్టికల్ గ్రామానికి చెందిన కోన వినోద్, ఆయన తల్లి లక్ష్మమ్మ బైక్‌పై ఎదురుగా వచ్చి ఐలయ్య, రాములు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వినోద్, లక్ష్మమ్మకు స్వల్పగాయాలవగా ఐలయ్య, రాములు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఐలయ్య, సాయంత్రం రాములు మరణించారు. ఐలయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రాములు భార్య మూడేళ్ల క్రితం మరణించగా, అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భిక్షం అంత్యక్రియలను శుక్రవారం ఉదయం పూర్తి చేసిన కుటుంబసభ్యులు.. ఐలయ్య, రాములు మృతదేహాలను అప్పగించడంలో ఆలస్యం జరగడంతో తొలుత సూర్యాపేట ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం రోడ్డు ప్రమాదానికి కారణమైన వినోద్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగగా గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.