Share News

Uttam: తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి

ABN , Publish Date - Jul 17 , 2025 | 03:51 AM

కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Uttam: తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి

  • ఇచ్చంపల్లి రిజర్మాయర్‌ నిర్మించాలి.. జాతీయ హోదా ఇవ్వాలి

  • పాలమూరు-రంగారెడ్డికి 45 టీఎంసీలతో ఆమోదం తెలపాలి

  • శ్రీశైలం నుంచి బ్యాక్‌వాటర్‌ తరలింపును అడ్డుకోవాలి: ఉత్తమ్‌

  • ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ ఎజెండా ప్రస్తావన

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ ఎజెండాను ఉత్తమ్‌ ప్రస్తావించారు.


తెలంగాణ ఎజెండాలోని అంశాలు..

  • గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లిలో రిజర్వాయర్‌ కట్టాలి. 148 టీఎంసీలతో చేపట్టే గోదావరి-కావేరిలో తెలంగాణకు కేటాయించే వాటాను ఇతర బేసిన్‌లో వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఇచ్చంపల్లి బ్యారేజీ నుంచి 200 టీఎంసీల వరద జలాలను వాడుకోవడానికి వెసులుబాటు కల్పించాలి. పోలవరం ప్రాజెక్టులాగే ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, ఆర్థిక సహాయం అందించాలి.

  • పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను తొలిదశలో కేటాయించిన 45 టీఎంసీల నీటితో ఆమోదం తెలిపాలి. మైనర్‌ ఇరిగేషన్‌లో 90 టీఎంసీలు ఉండగా... అందులో పొదుపు చేసిన 45 టీఎంసీలను పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయించాం. ఈ ప్రాజెక్టుకు రెండో దశ పర్యావరణ అనుమతి ఇవ్వాలి. డిండి ఎత్తిపోతలనూ క్లియర్‌ చేయాలి.

  • సమ్మక్కసాగర్‌ (తుపాకులగూడెం) ప్రాజెక్టు డీపీఆర్‌ను క్లియర్‌ చేయాలి. ఛత్తీ్‌సగఢ్‌ నుంచి ఎన్‌వోసీ తెచ్చుకోవాలని సీడబ్ల్యూసీ షరతు విధించింది. ప్రాజెక్టుకు వచ్చే వరదతో ముంపునకు గురయ్యే ప్రాంతాలకు ఐఐటీ ఖరగ్‌పూర్‌ నివేదిక ఆధారంగా పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.

  • శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ నుంచి ఏపీ నీటి మళ్లింపును అడ్డుకోవాలి. 20 రోజుల్లో 200 టీఎంసీలను ఇతర బేసిన్‌లకు తరలించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏపీ అభివృద్ధి చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం నుంచి రోజుకు 3 టీఎంసీలల తరలింపు కోసం పనులు చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ నుంచి రోజుకు 8 టీఎంసీలు, ముచ్చుమర్రి నుంచి రోజుకు 0.63 టీఎంసీలు, మల్యాల నుంచి రోజుకు 0.545 టీఎంసీల నీటి తరలిస్తున్నారు. దీన్ని అడ్డుకోవాలి.

  • శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోని అన్ని కాంపోనెంట్ల వద్ద టెలిమెట్రీ కేంద్రాలు పెట్టాలి. దీనికోసం 2024-25లో తెలంగాణ రూ.4.15 కోట్లు విడుదల చేసింది. అయినా జాప్యం జరుగుతోంది.

  • తుంగభద్ర జలాలను కేసీ కెనాల్‌కు హైలెవల్‌, లోలెవల్‌ కెనాల్‌ ద్వారా తరలిస్తూనే శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి కూడా తీసుకెళుతున్నారు. ముచ్చుమర్రి, ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ ద్వారా కేసీ కెనాల్‌కు నీటిని తరలిస్తున్నారు. ఇది బచావత్‌ ట్రైబ్యునల్‌కు వ్యతిరేకం. తక్షణమే దీనిని అడ్డుకోవాలి.

  • రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేయకుండా ఎన్జీటీ స్టే విధించిననా.. ఏపీ అక్రమంగా పనులు చేపడుతోంది. వీటిని కేంద్రం అడ్డుకోవాలి. పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం రైట్‌ మెయిన్‌ కెనాల్‌(ఎ్‌సఆర్‌ఎంసీ)కు రోజుకు 44 వేల క్యూసెక్కుల నీటి తరలిస్తుండగా.. కెనాల్‌ లైనింగ్‌ చేసి.. రోజుకు 89,762 క్యూ౅సెక్కులు తరలించడానికి పనులు చేస్తున్నారు. దీనిపై బోర్డుకు, కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదులు చేస్తున్నా ఏపీ ఆపడం లేదు.

  • శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ప్రమాదంలో పడింది. గత ఆరేడేళ్లుగా ఈ ప్రాజెక్టు మరమ్మతులు చేయడం లేదు. కోట్లాది మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. అక్రమంగా ఏపీ నీటి తరలింపుతో జలవిద్యుత్‌ ఉత్పాదనపై, తాగు, సాగునీటి అవసరాలపై తీవ్రమైన ప్రభావం పడుతోంది.

  • డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి కేంద్రం ఏఐబీపీ కింద ఆర్థిక సహాయం అందించాలి. ఈ ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదికను 2009 ఏప్రిల్‌లో సమర్పించగా... దీనికి సీడబ్ల్యూసీ 2010 ఏప్రిల్‌లో సమ్మతి తెలిపింది.


ఇవి కూడా చదవండి

కాళేశ్వరం అవినీతి ఇంజినీర్లకు ఇక చుక్కలే..ఈడీ విచారణకు సిద్ధం..


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 17 , 2025 | 03:52 AM