kaleshwaram report: సీఎం చేతికి కాళేశ్వరం నివేదిక.. కీలక భేటీకి రంగం సిద్ధం
ABN , Publish Date - Jul 31 , 2025 | 08:09 PM
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రూపొందించిన నివేదిక ప్రభుత్వం చేతికి వెళ్లింది. దీనిపై శుక్రవారం కీలక సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్, జులై 31: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి అందింది. ఈ నివేదికపై శుక్రవారం నాడు హైదరాబాద్‌లో కీలక సమావేశం జరగనుందని తెలుస్తోంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డికి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావుతోపాటు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బుజ్జా ఈ నివేదికను అందజేయనున్నారు. అనంతరం దీనిపై వీరు చర్చించనున్నట్లు సమాచారం. వచ్చే కేబినెట్ భేటీలో ఈ నివేదికపై చర్చించి.. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారు. అందులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారు. అయితే 2023 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు మేడిగడ్డ బ్యారేజీలోని కొన్ని పిల్లర్లు కుంగాయి. లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని.. అందుకే ఈ విధంగా జరిగిందంటూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి.
ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే.. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఓటరు పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది. అనంతరం ఈ వ్యవహారంపై ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్‌తో కమిషన్‌ను రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు.
2024, మార్చిలో ఈ కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. దాదాపు 15 నెలల పాటు అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి ఇంజనీర్ ఇన్ చీఫ్ వరకు, పలువురు ఉన్నతాధికారులు, సిబ్బందిని సైతం ఈ కమిషన్ విచారించింది. అలాగే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావులను సైతం ఈ కమిషన్ విచారించింది. గురువారం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్.. ఈ నివేదికను నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేశారు.
అనంతరం ఆయన.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు అందజేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ సచివాలయంలో శుక్రవారం జరిగే కీలక సమావేశంలో జస్టిస్ పీసీ ఘోష్ సైతం హాజరయ్యే అవకాశముందని తెలిస్తుంది. అనంతరం కోల్‌కతాకు పీసీ ఘోష్ బయలుదేరి వెళ్తారనే ప్రచారం సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News