Share News

Telangana Request CWSC: గోదావరి పై భేటీ వాయిదా వేయండి

ABN , Publish Date - Apr 20 , 2025 | 06:40 AM

తెలంగాణ రాష్ట్రం గోదావరిలో నీటి లభ్యతపై ఏపీ లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు ఈనెల 21న ఢిల్లీలో నిర్వహించతలపెట్టిన సమావేశాన్ని వాయిదా వేయాలని సీడబ్ల్యూసీకి లేఖ రాశింది. 24వ తేదీన టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ (TAC) సమావేశం ఉన్నందున ఈ సమావేశం వాయిదా వేయాలని తెలంగాణ కోరింది

 Telangana Request CWSC: గోదావరి పై భేటీ వాయిదా వేయండి

  • సీడబ్ల్యూసీకి తెలంగాణ ఈఎన్‌సీ లేఖ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): గోదావరిలో నీటి లభ్యతపై ఏపీ లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు ఈనెల 21న ఢిల్లీలో నిర్వహించతలపెట్టిన సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ కోరింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ చైర్మన్‌ ముకేశ్‌కుమార్‌సిన్హాకు తెలంగాణ ఈఎన్‌సీ (జనరల్‌) జి.అనిల్‌కుమార్‌ శనివారం లేఖ రాశారు. 24వ తేదీ తర్వాత ఎప్పుడు నిర్వహించినా.. తమకు సమ్మతమేనని తెలిపారు. గోదావరిలో నీటి లభ్యత తేలే దాకా తెలంగాణ సమర్పించిన ప్రాజెక్టుల డీపీఆర్‌లకు అనుమతి ఇవ్వరాదంటూ అటు సీడబ్ల్యూసీకి, ఇటు గోదావరి బోర్డుకు ఏపీ పలుమార్లు లేఖలు రాసింది. ప్రాణహిత, ఇంద్రావతి, లోయర్‌ గోదావరిలో నీటి లభ్యత లెక్కలు శాస్త్రీయంగా లేవని, మళ్లీ అధ్యయనం జరగాలని వాదించింది. ఈ అంశంపై చర్చించడానికి ఈనెల 21వ తేదీన(సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం నిర్వహించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. అయితే, ఈనెల 24న సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మసాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీముఖర్జీ నేతృత్వంలో టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) సమావేశం ఉన్నందున...సోమవారం నిర్వహించ తలపెట్టిన సమావేశం వాయిదా వేయాలని తెలంగాణ కోరింది.

Updated Date - Apr 20 , 2025 | 06:41 AM