Ponguleti: నీటి వాటాల్లో రాజీపడేది లేదు
ABN , Publish Date - Jul 17 , 2025 | 04:24 AM
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్ పాలనలోనే బనకచర్లకు అనుమతులు
అప్పుడు ఎవ్వరూ నోరు మెదపలేదు
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ములకలపల్లి/దమ్మపేట, జూలై 16 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంలో ప్రభుత్వం రాజీ లేని పోరాటం చేస్తోందని వెల్లడించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఏపీలో బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని తెలిపారు. ఆ సమయంలో బనకచర్ల అంశంపై ఎవ్వరూ నోరుమెదపలేదని పొంగులేటి గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామంలో రూ.9 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని మంత్రి పొంగులేటి బుధవారం సాయం త్రం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నీటి వాటాల అంశంలో ప్రభుత్వ వైఖరిని తెలియజేశారు.
తిమ్మంపేట ఎత్తిపోతల పథకం గిరిజనులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇక, భద్రాద్రి జిల్లా దమ్మపేటలో బుధవారం జరిగిన అశ్వారావుపేట నియోజకవర్గస్థాయి ఇందిరా మహిళా శక్తి సంబురాల్లోనూ పాల్గొన్న మంత్రి పొంగులేటి.. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించి రూ.3.02కోట్లు చెక్కును అందజేశారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పొంగులేటి మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని వివరించారు. మహిళా సంఘాల సభ్యులకు రుణ బీమా, ప్రమాద బీమాను ప్రభుత్వం అందిస్తోందన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ కూడా ఎగ్గొట్టిందని పొంగులేటి ఆరోపించారు. అనంతరం కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం అవినీతి ఇంజినీర్లకు ఇక చుక్కలే..ఈడీ విచారణకు సిద్ధం..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి