Bandi Sanjay: ప్రభాకర్‌రావు నీచుడు
ABN , Publish Date - Jun 10 , 2025 | 06:10 AM
ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పథకం ప్రకారమే లొంగిపోయి సిట్ ఎదుట హాజరయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.

ఆయన వల్ల ఎన్నో జీవితాలు నాశనమయ్యాయి
అమెరికాలోనే ఆయనకు కేసీఆర్ కుటుంబం కౌన్సెలింగ్ ఇచ్చింది: కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/హైదరాబాద్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పథకం ప్రకారమే లొంగిపోయి సిట్ ఎదుట హాజరయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అమెరికాలోనే ప్రభాకర్‌రావుకు కేసీఆర్ కుటుంబంతో కౌన్సెలింగ్ తంతు పూర్తయిందని ఆరోపించారు. విచారణలో ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మంచినీటి సరఫరా పథకానికి సంజయ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభాకర్‌రావు మామూలోడు కాదని, తనలాంటి అనేక మంది కార్యకర్తల ఉసురుపోసుకున్నాడని అన్నారు. తనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు, జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన ఘనుడు ప్రభాకర్‌రావు అని మండిపడ్డారు. ఆయన వల్ల అనేక మంది జీవితాలు నాశనమయ్యాయని, ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయని తెలిపారు. భార్యాభర్తల సంభాషణలను కూడా ట్యాప్ చేసిన నీచుడని, ఆయన వల్ల భార్యాభర్తలు కూడా ఫోన్‌లో మాట్లాడుకోలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఎవరి ఆదేశం మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారో ప్రజలకు తెలియాలని అన్నారు. ట్యాపింగ్ ఆడియోలను ఎవరికి పంపారు..? వాటిని అడ్డుపెట్టుకుని ఎవరెవరిని బెదిరించారు..? వంటి వివరాలు వెల్లడి కావాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోందని, 18 నెలల్లో ఏ ఒక్క అవినీతి కేసులో కూడా విచారణ ముందుకు సాగలేదని విమర్శించారు. ఇకనైనా కోర్టులో గట్టిగా వాదనలు వినిపించి, ప్రభాకర్ రావు, ఆయన వెనకున్న సూత్రధారులను దోషులుగా తేల్చాలని సంజయ్ డిమాండ్ చేశారు.