నాగర్‌కర్నూల్ సబ్ జైలర్‌పై కేసు నమోదు
ABN , Publish Date - Jun 07 , 2025 | 04:43 AM
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం ధన్వాడ గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో కీలక పాత్ర పోషించారని పేర్కొంటూ నాగర్‌కర్నూల్ సబ్ జైలర్ నాగరాజుపై కేసు నమోదైంది.

నాగర్‌కర్నూల్, బర్కత్‌పుర, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం ధన్వాడ గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో కీలక పాత్ర పోషించారని పేర్కొంటూ నాగర్‌కర్నూల్ సబ్ జైలర్ నాగరాజుపై కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌లో ఆయనను ఏ-3గా చేర్చారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంటలిజెన్స్ వర్గాలు నాగరాజుకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించారు.
నాగరాజు రెండు రోజులుగా సెలవులో ఉన్నట్లు సమాచారం. కాగా, ఇథనాల్ ఫ్యాక్టరీని రైతుల ముసుగులో బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకుంటూ, విధ్వంసం సృష్టిస్తున్నారని బీసీ సంఘాల నేతలు ఆరోపించారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం సౌత్ ఇండియా ప్రధాన కార్యదర్శి చిరుతల విఠల్‌గౌడ్ మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఫ్యాక్టరీకి అనుమతులు లభించాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి బీఆర్‌ఎస్ దాడులను ప్రోత్సహిస్తోందని విమర్శించారు.