Share News

Ponguleti Srinivas Reddy: ధరణి పేరుతో కోట్లు కొల్లగొట్టారు

ABN , Publish Date - Apr 20 , 2025 | 05:51 AM

బీఆర్‌ఎస్‌ హయాంలో అవినీతిని విమర్శిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు.

Ponguleti Srinivas Reddy: ధరణి పేరుతో కోట్లు కొల్లగొట్టారు

  • నాలుగు గోడల మధ్య చట్టం చేశారు

  • బీఆర్‌ఎస్‌ హయాంలో అంతా అవినీతే

  • ‘భూ భారతి’తో భూ సమస్యలకు

  • పరిష్కారం: మంత్రి పొంగులేటి

గద్వాల/నాగర్‌కర్నూల్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ‘‘నలుగురు వ్యక్తులు నాలుగు గోడల మధ్య వారి కుటుంబం కోసం తయారు చేసిన చట్టం ధరణి. ఇది ప్రజలు, రైతులను అధఃపాతాళానికి తొక్కింది. ధరణి పేరుతో కోట్లు కొల్లగొట్టారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అంతా అవినీతే. అలాంటి అక్రమాలకు తావు లేకుండా మేము భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చాం’’ అని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్‌ మండల కేంద్రం, నాగర్‌కర్నూల్‌ జిల్లా గగ్గలపల్లిలలో జరిగిన భూభారతి అవగాహన సదస్సులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదవాడి ప్రభుత్వమని, అభివృద్ధి సంక్షేమంలో ముందుంటుందని చెప్పారు. భూ సమస్యలకు భూభారతి తప్పక పరిష్కారం చూపిస్తుందని తెలిపారు. ప్రతీ మనిషికి ఆధార్‌ కార్డు ఎలా ఉన్నదో భవిష్యత్‌లో భూమికి కూడా భూదార్‌ కార్డును ఇస్తామన్నారు. ధరణి చట్టంలోని లోపాల వల్ల 9,26,000 సాదాబైనామా ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, అందులోని అర్హులైన వారికి పరిష్కారం చూపిస్తామని చెప్పారు. గులాబీ చొక్కా వేసుకున్న వారికి లేని భూమిని సృష్టించి రైతుబంధు పేరిట ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. నాడు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18 లక్షల ఎకరాల భూమిని పార్ట్‌ బీ లో పెట్టారని, బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఆ భూములను కబ్జా చేయాలనేది వారి వ్యూహమని అన్నారు.


పొంగులేటికి త్రుటిలో తప్పిన ప్రమాదం

భూభారతి అవగాహన సదస్సులో పాల్గొనడానికి మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి మధ్యాహ్నం 12:28 గంటలకు నాగర్‌కర్నూల్‌ చేరుకున్నారు. ఆయన వచ్చిన హెలికాప్టర్‌ గాలిలో చక్కర్లు కొడుతున్న క్రమంలో పోలీస్‌ సిబ్బంది ల్యాండింగ్‌ సిగ్నల్‌ ఇచ్చేందుకు ఎప్పటిలాగే ఫైర్‌బాల్స్‌ను వినియోగించారు. అయితే వాటి రవ్వలు నేలమీద పడటం అక్కడ ఎండుగడ్డి ఉండటంతో మంటలు వ్యాపించాయి. హెలికాప్టర్‌ సురక్షితంగా ల్యాండింగ్‌ అవుతుందా లేదా అనే ఆందోళన నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన పరుగెత్తి మంటలను ఆర్పేశారు. 12:29 గ టలకు హెలికాప్టర్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు దాదాపు అర్ధగంట సమయం పట్టింది.


ఇవి కూడా చదవండి..

Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..

కేసీఆర్‌ క్యాంపు కార్యాలయానికి టులెట్‌ బోర్డు..


Read Latest
Telangana News And Telugu News

Updated Date - Apr 20 , 2025 | 05:51 AM