Indiramma Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లు
ABN , Publish Date - Jul 27 , 2025 | 03:56 AM
ఇంటి స్థలం లేని ఇందిరమ్మ లబ్ధిదారులకు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అధికారులను ఆదేశించారు.

వచ్చేనెల 15లోగా కేటాయించాలి: మంత్రి పొంగులేటి
హైదరాబాద్/ వరంగల్, జూలై 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఇంటి స్థలం లేని ఇందిరమ్మ లబ్ధిదారులకు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో భాగంగా ఇంటి స్థలాలు లేని అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, ఆగస్టు 15లోగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను వారికి కేటాయించాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వమే రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తుందని మంత్రి వెల్లడించారు. డబుల్ బెడ్‌ర్రూం ఇళ్లకు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారన్నది ముఖ్యం కాదని, తాజా దరఖాస్తులను పరిశీలించాలని కలెక్టర్లకు సూచించారు.