NCC: ఎంబీబీఎస్ ప్రవేశాల్లో ఎన్‌సీసీ కోటా అమలయ్యేనా ?
ABN , Publish Date - Jul 17 , 2025 | 06:25 AM
రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది.

2023లో ఆ రిజర్వేషన్ ఎత్తేసిన రాష్ట్ర సర్కారు
బదులుగా అభ్యర్థికి అదనపు మార్కులు
రిజర్వేషన్ కోసం ప్రజావాణిలో వినతులు
ఈ ఏడాది మొదలైన కౌన్సెలింగ్ ప్రక్రియ
సర్కారు స్పందించాలంటున్న విద్యార్థులు
హైదరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. అయితే, ఎన్‌సీసీ(నేషనల్ క్యాడెట్ కార్ప్) కోటాకు అర్హులైన అభ్యర్థులు మాత్రం తమ రిజర్వేషన్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. వైద్య విద్య ప్రవేశాల్లో ఎన్‌సీసీ అభ్యర్థులకు ఒక శాతం రిజర్వేషన్ ఉంటుంది. అయితే, తెలంగాణలో 2023 నుంచి ఆపేశారు. ఈ రిజర్వేషన్ కోసం కొందరు అడ్డదారుల తొక్కి ఎంబీబీఎస్ సీట్లు పొందినట్టు తేలడంతో అప్పటి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్‌సీసీ క్యాడెట్‌లకు యూజీ సీట్లలో ఉన్న 1 శాతం రిజర్వేషన్‌ను ఎత్తేసింది. రిజర్వేషన్‌కు బదులుగా అర్హులైన ఎన్‌సీసీ క్యాడెట్లకు అదనంగా 6 లేదా 7 మార్కులు కలుపుతున్నారు. అంటే, ఎన్‌సీసీ క్యాడెట్ అర్హత ఉన్న ఓ విద్యార్థి నీట్‌లో 450 మార్కులు సాధిస్తే.. ఏడు మార్కులు కలుపుతారు.
దీంతో ఆ అభ్యర్థి స్కోరు 457 అయ్యేది. ప్రస్తుతం ఇదే విధానం అమలులో ఉంది. అయితే, అదనపు మార్కుల కేటాయింపు కాకుండా ఎన్‌సీసీ కోటాను అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కొందరు ప్రజావాణిలో వినతి పత్రాలు కూడా ఇచ్చారు. వైద్య విద్య ప్రవేశాల్లో మాత్రమే ఎన్‌సీసీ కోటా అమలు చేయడం లేదని వాపోయారు. దీంతో ఎన్‌ఎ్‌ససీ కోటా అంశంపై వివరణ ఇవ్వాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ)ని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కోరారు. కానీ, వీసీ నుంచి సమాధానం రాలేదని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవ్వగా.. ప్రభుత్వం స్పందించి ఎన్‌సీసీ క్యాడెట్లకు 1 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.