Jubilee Hills By Election: ఎక్సైజ్ శాఖకు.. ఒక్క నెలలోనే భారీగా ఆదాయం..
ABN , Publish Date - Nov 06 , 2025 | 02:09 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు? అన్నది వందల కోట్ల రూపాయల ప్రశ్నగా మారింది. ఇటు తెలంగాణతోపాటు అటు ఏపీలోనూ...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సర్వేలు చేయించుకుంటున్న బెట్టింగ్ రాయుళ్లు
స్థానిక బంధువులకు ఏపీ వాసుల ఫోన్లు
కోట్లలో పందేలు కాసేందుకు ప్రణాళిక
500కోట్ల మేర బెట్టింగ్ జరిగినట్టు అంచనా
ఫలితాల నాటికి రూ.1200 కోట్లకు పెరిగే చాన్స్
బంజారాహిల్స్, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు? అన్నది వందల కోట్ల రూపాయల ప్రశ్నగా మారింది. ఇటు తెలంగాణతోపాటు అటు ఏపీలోనూ ఈ అంశంపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి? ఓటర్లు ఏ అభ్యర్థి వైపు సానుకూలంగా ఉన్నారు? సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి? ఏ పార్టీ ఎంత ఖర్చు చేస్తోంది? ఇలా అనేక రకాలుగా లెక్కలు వేసుకుంటూ బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఇందుకోసం కొందరు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ఇప్పటికే సుమారుగా రూ.500కోట్ల మేర పందేలు కాసినట్టు తెలుస్తోంది. మరో వారంలో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచే బెట్టింగ్ మొదలైంది. అభ్యర్థుల ఖరారు పూర్తి కాకముందే సుమారు రూ.50 కోట్ల మేరకు బెట్టింగ్ జరిగినట్లు సమాచారం. అభ్యర్థుల ప్రకటన తర్వాత అధికార పార్టీ అభ్యర్థికి భారీ మెజారిటీ వస్తుందన్న అంచనాతో పందేలు కాశారు. నామినేషన్లు పూర్తయ్యాక మెజారిటీ కన్నా ఎవరు విజయం సాధిస్తారనే దానిపై బెట్టింగ్ నడుస్తోంది. ఇప్పటికే రూ.500 కోట్లకుపైనే బెట్టింగ్ జరిగినట్టు తెలుస్తుండగా.. పోలింగ్ తేదీ నాటికి ఇది రెండింతలు అవుతుందని, ఫలితాల వెలువడే నాటికి రూ.1200 కోట్లకు చేరినా ఆశ్చర్యపోనవవసరం లేదని ఓ బెట్టింగ్ రాయుడు చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, మణికొండతోపాటు ఖమ్మం, సూర్యాపేట జిల్లాల ప్రజలు, ఏపీలోని విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారు బెట్టింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలిసింది. ఏపీకి చెందిన వారు ఎప్పటికప్పుడు హైదరాబాద్‌లో ఉంటున్న బంధువులకు ఫోన్లు చేసి, పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా పందేలు కాస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన తొలినాళ్లలో ఓ పార్టీ తరఫున రూ.10కడితే రూ.100 ఇస్తామంటూ బెట్టింగ్ నిర్వాహకులు ప్రచారం చేశారు. నామినేషన్లు వేసిన తర్వాత ఓ పార్టీపై రూ.10కి రూ.60, మరో పార్టీపై రూ.10కి రూ.30చొప్పున బెట్టింగ్ నడుస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రత్యేకంగా సర్వేలు చేయిస్తూ..
పక్కా లెక్కలతో బెట్టింగ్‌లో డబ్బు పెట్టేందుకు కొంత మంది ఓ బృందంలా ఏర్పడి ప్రైవేటు సర్వేలు చేయించుకుంటున్నారు. పలు సంస్థలను ఆశ్రయించి పక్కా నివేదికలు సిద్ధం చేయించుకుంటున్నారు. ఇలాంటి సర్వేలకు ఆయా ఏజెన్సీలు రూ.70వేల నుంచి రూ.లక్ష తీసుకుంటున్నాయి. మరీ పెద్ద ఏజెన్సీ అయితే రూ.2లక్షలు ఉంటుంది. ఈ చిన్నపాటి ఖర్చుతో ప్లానింగ్ చేసుకుంటే ఏకంగా కోట్లాది రూపాయలు కొల్లగొట్టవచ్చని బెట్టింగ్ రాయుళ్లు భావిస్తున్నారు. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ప్రజలకే కాదు బెట్టింగ్ రాయుళ్లకు చెమటలు పట్టిస్తోంది.