Share News

Low Voter Turnout Despite: పైసలు తీసుకున్నరు.. పత్తాలేరు!

ABN , Publish Date - Nov 12 , 2025 | 03:07 AM

బోరబండ సైట్‌ 3లోని ఓ పోలింగ్‌ బూత్‌లో దాదాపు వెయ్యి మంది ఓటర్లున్నారు. కానీ, సాయంత్రం 4 గంటల వరకూ 300 ఓట్లు కూడా పోలవ్వలేదు...

Low Voter Turnout Despite: పైసలు తీసుకున్నరు.. పత్తాలేరు!

  • ఓటేసేందుకు గడప దాటని సగంమంది ఓటర్లు.. బస్తీవాసులు ఓటేసినా దిగిరాని అపార్టుమెంట్‌వాసులు

  • జూబ్లీహిల్స్‌లో మందకొడిగా పోలింగ్‌

  • ఓటర్లను రప్పించేందుకు బస్తీ, కాలనీ, అపార్టుమెంట్‌ ముఖ్యుల ఆపసోపాలు

  • ఓటేయకపోతే డబ్బు తిరిగివ్వాల్సిందే

  • ఆయా పార్టీల బూత్‌ ఇన్‌చార్జుల హుకుం

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): బోరబండ సైట్‌-3లోని ఓ పోలింగ్‌ బూత్‌లో దాదాపు వెయ్యి మంది ఓటర్లున్నారు. కానీ, సాయంత్రం 4 గంటల వరకూ 300 ఓట్లు కూడా పోలవ్వలేదు. ఆ పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఓ పార్టీ 600 మంది ఓటర్లకుపైగా డబ్బులు పంచితే.. మరో పార్టీ కూడా బాగానే పంపిణీ చేసింది. దాంతో, బూత్‌ ఇన్‌చార్జులు రంగంలోకి దిగారు. పోలైన ఓట్ల జాబితాను ఏజెంట్‌ ద్వారా తెలుసుకొని డబ్బులు తీసుకున్నవారు అత్యధికులు ఓటేసేందుకు రాలేదని గుర్తించారు. డబ్బులిప్పించిన బస్తీ ముఖ్యులకు ఫోన్‌ చేసి ఓటర్లు రాలేదని, ఓటు వేయకపోతే తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. వారితో తొందరగా ఓటు వేయించాలని హుకుం జారీ చేశారు. మధురా నగర్‌లో పార్టీలు అపార్టుమెంట్లవారీగా డబ్బులు పంపిణీ చేశాయి. అక్కడి పోలింగ్‌ బూత్‌ల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకూ 30 శాతమే పోలింగ్‌ జరిగింది. దాంతో, ఆయా పార్టీల బూత్‌ ఇన్‌చార్జులు డబ్బులు పంపిణీ చేసిన అపార్ట్‌మెంట్ల ముఖ్యులకు ఫోన్లు చేశారు. డబ్బులు తీసుకున్న వారంతా ఓటేసేలా చూడాలని, ఓటు వేయించే బాధ్యత మీదేనని స్పష్టం చేశారు. దాంతో వారు అపార్లుమెంట్లలోని వారికి ఫోన్లు చేసి.. ఓటేసి రావాలని, లేకుంటే మున్ముందు ఇబ్బంది ఉంటుందని హెచ్చరించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను అన్ని పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఆయా పార్టీల నాయకులు దీనిపైనే పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి పని చేశారు. ఇతర జిల్లాల నుంచి నాయకులను రప్పించారు. లిఫ్టులు లేకపోవడం.. పని చేయకపోవడంతో కొన్నిచోట్ల ఆయా పార్టీల నాయకుల ఐదంతస్తులను కూడా ఎక్కి.. దిగి.. ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘమూ కోరింది. మొబైల్స్‌ భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఓటింగ్‌ శాతం పెంచడానికి మరో గంట సమయం అదనంగా పెంచారు.


కొందరు ఉచిత ఆటోలు పెట్టారు. చివరికి, మూడు పార్టీలూ ఓటర్లలో 80 శాతం మందికి రూ.500 నుంచి రూ.5000 వరకూ పంపిణీ చేశాయి. ఎన్నికను పార్టీలు, నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నా.. ఎవరెన్ని ఆపసోపాలు పడినా.. ఇక్కడి ఓటర్లు మాత్రం ఎప్పట్లాగే పట్టించుకోలేదు. గడప కూడా దాటలేదు. ఉప ఎన్నిక కనక పోలింగ్‌ 70-80 శాతం అవుతుందని భావించినా.. చివరకు 50 శాతం కూడా దాటలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూసినా.. కేవలం 1.2 శాతం మాత్రమే ఓటింగ్‌ పెరిగింది. అంతేనా.. దేశవ్యాప్తంగా మంగళవారం ఏడుచోట్ల ఉప ఎన్నికలు జరిగితే.. జూబ్లీహిల్స్‌లోనే అత్యల్ప పోలింగ్‌ శాతం నమోదైంది. నియోజకవర్గంలో నాలుగు లక్షల మందికిపైగా ఓటర్లుంటే.. సగం మంది కూడా పోలింగ్‌ బూత్‌లకు రాలేదు. బస్తీల్లో మినహా మిగిలిన అన్నిచోట్లా పోలింగ్‌ మందకొడిగానే సాగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఉప ఎన్నికల్లో రూ.100 కోట్లు పంపిణీ చేశాయని కథనాలూ వచ్చాయి. సాధారణంగా ఓటుకు డబ్బులు తీసుకున్న వాళ్లు పోలింగ్‌ బూత్‌కు తరలి వస్తారని, జూబ్లీహిల్స్‌ ఓటర్లు కాస్త భిన్నమని, పైసలు తీసుకున్న వారిలో అత్యధికులు కూడా పత్తా లేకుండా పోయారని ఆయా పార్టీల నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. పట్టు చీరలు తీసుకెళ్లిన మహిళలు కూడా ఓటు వేసేందుకు రాలేదని కొన్నిచోట్ల బూత్‌ ఇన్‌చార్జులు ఆవేదన వ్యక్తం చేశారు.

బాబ్బాబు... ఓటేద్దురు రండి!

మంగళవారం మధ్యాహ్నం 12 గంటలు అయినా ఓటర్లు ఓటు వేసేందుకు రాకపోవడాన్ని గుర్తించిన బూత్‌ ఇన్‌చార్జులు బస్తీ, అపార్టుమెంట్‌ ముఖ్యులకు ఫోన్లు చేశారు. దాంతో వారంతా అపార్టుమెంట్లు, ఇండ్ల బాట పట్టారు. ‘అమ్మా... ఓటేయటానికి రండి! అన్నా.. ఓటేద్దురు రండి!’ అంటూ బతిమాలిన దృశ్యాలు వెంగళరావునగర్‌, రహమత్‌నగర్‌, షేక్‌పేట్‌, యూసు్‌ఫగూడ, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో కనిపించాయి. ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు తీసుకు రావడానికి బస్తీ, కాలనీ, అపార్ట్‌మెంట్ల ముఖ్యులు ఆపసోపాలు పడ్డారు. చివరికి, బస్తీల్లో 60-70 శాతం ఓటింగ్‌ జరిగినా.. మధ్యతరగతి ఎక్కువగా ఉండే అపార్టుమెంట్లలో మాత్రం 35 శాతం కూడా దాటలేదని చెబుతున్నారు. నిజానికి, డబ్బులు, పట్టు చీరలు పంపిణీ చేసే సమయంలో బూత్‌లవారీగా ఓటరు ఐడీ, పోలింగ్‌ చిట్టీ పరిశీలించి పంపిణీ చేశారు. దాంతో, డబ్బులు తీసుకున్నవారు రాలేదని గుర్తించారు. ఉదాహరణకు, రాజీవ్‌గాంధీ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో 30 కుటుంబాలున్నాయి. వాటిలో 25 కుటుంబాలు డబ్బులు తీసుకున్నాయి. కానీ, 12 కుటుంబాలు మాత్రమే ఓటేసినట్లు తేల్చారు. ‘పైసలైతే తీసుకున్నరు.. పోలింగ్‌ బూత్‌లకు రమ్మంటే పత్తాలేరు’ అని బూత్‌ ఇన్‌చార్జులు వాపోయారు. డబ్బులు తీసుకొని ఓటెయ్యని వారి నుంచి తిరిగి వసూలు చేస్తామని, ఆ వివరాలు తమ దగ్గర ఉన్నాయని ఎర్రగడ్డలోని ఓ బూత్‌ ఇన్‌చార్జి ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు.


ఆఫీసులకు సెలవు లేకపోవడం కూడా..

ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులకు, విద్యా సంస్థలకు మాత్రమే సెలవిచ్చారు. కానీ, ఇక్కడ నివసించే చాలామంది ఉద్యోగులు నగరంలోని ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్నారు. దాంతో, వారు యథావిధిగా ఆఫీసులకు వెళ్లారు. ఓటింగ్‌ శాతం పెరగకపోవడానికి ఇదొక కారణంగా చెబుతున్నారు. యూసు్‌ఫగూడలో నివసించే ఆరుగురు కార్మికులు ఐడీఎల్‌ బొల్లారంలోని ఓ పరిశ్రమలో పని చేస్తారు. మంగళవారం జనరల్‌ షిప్టు కావడం ఉదయం ఓటేసేందుకు సమయం లేక, సాయంత్రం వచ్చి వేద్దామని అనుకున్నారు. అయితే, వచ్చేసరికి సమయం అయిపోయిందని పలువురు వాపోయారు. విచిత్రమేమిటంటే..ఇక్కడి ఓటర్లలో స్పందన లేకపోయినా.. స్థానికేతరుల హవా చివరి రోజు కూడా కనిపించింది.

Updated Date - Nov 12 , 2025 | 07:21 AM